సర్దుబాటు ఉత్తర్వులు రద్దు చేయాలి | adjustment orders must cancel | Sakshi
Sakshi News home page

సర్దుబాటు ఉత్తర్వులు రద్దు చేయాలి

Published Sat, Jan 7 2017 2:17 AM | Last Updated on Tue, Sep 5 2017 12:35 AM

సర్దుబాటు ఉత్తర్వులు రద్దు చేయాలి

సర్దుబాటు ఉత్తర్వులు రద్దు చేయాలి

ఏలూరు సిటీ : విద్యాసంవత్సరం పూర్తికావస్తున్న దశలో ఉపాధ్యాయులను సుదూర ప్రాంతాలకు సర్దుబాటు చేసేందుకు పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వులు వెంటనే ఉపసంహరించుకోవాలని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఏపీ టీచర్స్‌ ఆర్గనైజేషన్‌ (ఫ్యాప్టో) డిమాండ్‌ చేసింది. ఈ మేరకు శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు ధర్నా చేపట్టారు. బి.గోపీమూర్తి, పి.ప్రసాద్, గుగ్గులోతు కృష్ణ, రాజబాబు ఈ కర్యక్రమానికి నేతృత్వం వహించారు. ధర్నాకు హాజరైన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రాము సూర్యారావు మాట్లాడుతూ పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన సర్దుబాటు ఉత్తర్వులు వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. దీనిపై విద్యాశాఖ మంత్రి, పాఠశాల విద్యశాఖ కార్యదర్శితో చర్చిస్తానని తెలిపారు. నాయకులు మాట్లాడుతూ జిల్లాలో 672 మంది ఉపాధ్యాయుల సర్దుబాటు అసంబద్ధంగా ఉందని, సరిదిద్దమని విన్నవించేందుకు అధికారులు అందుబాటులో లేరని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా సబ్జెక్టు రిలవెన్సీతో సంబంధం లేకుండా ఇష్టమైన వారిని పాఠశాలల్లో ఉంచి మిగిలిన వారిని డెప్యుటేషషన్‌ వేశారని ఆరోపించారు. యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి షేక్‌ సాబ్జీ మాట్లాడుతూ వేసవి సెలవుల్లో, పాఠశాలలు ప్రారంభించిన వెంటనే మాత్రమే రేషనలైజేషన్‌ ప్రక్రియ నిర్వహించాల్సి ఉందన్నారు. విద్యాసంవత్సరం ప్రారంభమై 7 నెలలు గడిచిన అనంతరం ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ చేపట్టడంతో విద్యాశాఖలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.బాలాజీ మాట్లాడుతూ అధికారులు ఎటువంటి ముందుచూపు లేకుండా ఉత్తర్వులు జారీ చేయటంతో విద్యార్థులు, ఉపాధ్యాయులకు నష్టం జరుగుతుందన్నారు. డీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.నరహరి మాట్లాడుతూ పాఠశాల విద్యాశాఖలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ ఉపాధ్యాయులకు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ధర్నాలో పి.జయకర్‌ (యూటీఎఫ్‌), పి.సాల్మన్‌రాజు (ఏపీటీఎఫ్‌), ఆర్‌వీవీఎం శ్రీనివాస్‌ (ఏపీటీఎఫ్‌1938), ఎన్‌.శ్రీనివాసరావు (డీటీఎఫ్‌), ప్రతాపరాజు (ఎస్‌టీయూ) తదితరులు ఉన్నారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement