Investments in small projects give good profits in real estate - Sakshi
Sakshi News home page

చిన్న ప్రాజెక్ట్‌లు.. పెద్ద లాభాలు!

Published Sat, May 27 2023 8:37 AM | Last Updated on Sat, May 27 2023 10:22 AM

small projects good profits realestate - Sakshi

ప్రతికూల పరిస్థితుల్లోనూ హాట్‌కేకుల్లా 
ఫ్లాట్లు అమ్ముడుపోవాలంటే.. 

పునాదుల్లోనే సగానికిపైగా అమ్మకాలు 
జరగాలంటే.. 
అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఏడాదిలో 
గృహ ప్రవేశం చేయాలంటే.. 

వీటన్నింటికీ ఒకే సమాధానం చిన్న ప్రాజెక్ట్‌లు. నిజం చెప్పాలంటే చిన్న ప్రాజెక్ట్‌లు విస్తీర్ణంలోనే చిన్నవి.. వసతుల్లో మాత్రం పెద్ద ప్రాజెక్ట్‌లకు ఏమాత్రం తీసిపోవు. పైపెచ్చు అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఉండటం చిన్న ప్రాజెక్ట్‌లకు మరింత కలిసొచ్చే అంశం. 

సాక్షి, హైదరాబాద్‌:  బడా ప్రాజెక్టులు నిర్మించాలంటే కోట్లలో పెట్టుబడి కావాలి. అమ్మకాలు బాగుంటే పర్వాలేదు.. కానీ, సీన్‌ రివర్స్‌ అయ్యిందో ప్రాజె క్ట్‌ను పూర్తి చేయడం కష్టం. దీంతో అటు కొనుగోలుదారులకు, ఇటు నిర్మాణ సంస్థలకూ తలనొప్పే. ప్రతికూల పరిస్థితుల్లో గొప్పకు పోయి పెద్ద మొత్తంలో బ్యాంకు రుణాలు తెచ్చి ప్రాజెక్ట్‌లు ప్రారంభించి అమ్మకాల్లేక బోర్డు తిప్పేసిన సంస్థలనేకం. అందుకే ఎలాంటి పరిస్థితుల్లోనైనా హాట్‌కేకుల్లా ప్రాజెక్ట్‌ అమ్ముడుపోవాలంటే చిన్న ప్రాజెక్ట్‌లే మేలని సూచిస్తున్నారు నిపుణులు. చేతిలో ఉన్న కొద్దిపాటి పెట్టుబడితో ప్రాజెక్ట్‌ను ప్రారంభించి.. పునాదుల్లోనే సగానికి పైగా అమ్మకాలు చేసుకునే వీలుంటుంది కూడా. 
 

ఏడాదిలో గృహప్రవేశం.. 
డిమాండ్‌ ఉన్న ప్రాంతాల్లో కొద్దిపాటి స్థలంలోనే చిన్నపాటి నిర్మాణాలు చేపడుతున్నాయి నిర్మాణ సంస్థలు. అప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతం కావటం, ఆధునిక వసతులూ కల్పిస్తుండటంతో కొనుగోలుదారులూ వీటిల్లో ఫ్లాట్లు కొనేందుకు ముందుకొస్తున్నారు. చిన్న ప్రాజెక్ట్‌ల మార్కెట్‌లో లాభాలు తక్కువగానే ఉంటాయి. అయినా నిర్మాణం చేపట్టడానికి సిద్ధం. ఎందుకంటే ఈ నిర్మాణాలు ఏడాది లేక 15 నెలల్లో పూర్తవుతాయి. దీంతో త్వరగానే కొనుగోలుదారుల సొంతింటి కల నెరవేరడంతో పాటు మార్కెట్‌లో తమ కంపెనీ బ్రాండింగ్‌ పెరుగుతుందనేది నిర్మాణ సంస్థల వ్యూహం. అయితే చిన్న ప్రాజెక్ట్‌లు నిర్మించాలంటే స్థలం అంత సులువుగా దొరకదు. పోటీ ఎక్కువగా ఉంటుంది. 
 

వసతులకు కొదవేంలేదు.. 
గతంలో డిమాండ్‌ ఉన్న ప్రాంతాల్లో నిర్మించే ప్రాజెక్ట్‌ల్లో వసతులు కల్పించకపోయినా గిరాకీకి ఢోకా ఉండేది కాదు. కానీ, ప్రస్తుతం కొనుగోలుదారుల అభిరుచిలో మార్పు వచ్చింది. ధర ఎక్కువైనా.. వసతుల విషయంలో రాజీపడటం లేదు. దీంతో చిన్న ప్రాజెక్ట్‌ల్లోనూ ఆరోగ్యం కోసం వాకింగ్, జాగింగ్‌ ట్రాక్స్, యోగా, జిమ్, మెడిటేషన్‌ హాల్, ఆహ్లాదకరమైన ల్యాండ్‌ స్కేపింగ్‌లతో పాటుగా స్విమ్మింగ్‌ పూల్, బేబీ, మదర్‌ కేర్‌ సెంటర్, లైబ్రరీ.. వంటి ఏర్పాట్లుంటున్నాయి. అంతేకాకుండా చిన్న ప్రాజెక్ట్‌లో కొన్ని ఫ్లాట్లే ఉంటాయి. ఫ్లాట్‌వాసులందరూ ఒకే కుటుంబ సభ్యుల్లా కలిసిమెలిసి ఉంటారు. దీంతో ఉమ్మడి కుటుంబాల లోటు తీరుతుందనేది కొనుగోలుదారుల అభిప్రాయం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement