సాక్షి, అమరావతి : పట్టణాల్లోని పేద, మధ్య తరగతి మహిళలు సంఘటితమై విజయం సాధించారు. పట్టణ ప్రాంత పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) అందించిన సాయంతో జగనన్న మహిళా మార్ట్‌లను నెలకొల్పి లాభాల బాటలో నడిపిస్తున్నారు. రాష్ట్రంలో 10 పట్టణాల్లో ఏర్పాటు చేసిన మార్ట్‌లు నెలకు సగటున రూ.79.40 లక్షల వ్యాపారం చేస్తూ ముందుకు సాగుతున్నాయి.
పొదుపు సంఘాల్లోని మహిళలు కేవలం రూ.150 చొప్పున పెట్టుబడి పెట్టి.. తమ ఇంటికి అవసరమైన సరుకులను డిస్కౌంట్ ధరకు పొందుతూనే రోజువారీ అమ్మకాల ద్వారా ఏడాదికి రూ.19 లక్షల నికర లాభాలను ఆర్జిస్తున్నారు. తిరుపతి పట్టణానికి చెందిన స్వయం సహాయక సంఘాల్లోని 37,308 మంది మహిళలు మెప్మా ఎండీ విజయలక్ష్మి ప్రోత్సాహంతో మార్ట్ ఏర్పాటుకు ముందుకు వచ్చారు.
ఒక్కో సభ్యురాలు కేవలం రూ.150 చొప్పున రూ.55,96,200 పెట్టుబడిగా పెట్టి గత ఏడాది మే నెలలో జగనన్న మహిళా మార్ట్‌ను ఏర్పాటు చేశారు. ఈ మార్ట్ ఏడాదిన్నరలో రూ.4.89 కోట్ల అమ్మకాలు చేసి, రూ.30 లక్షల లాభాన్ని ఆర్జించింది. ఈ సందర్భంగా శుక్రవారం ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తున్నారు. వాటాదారులకు రూ.20 లక్షల మొత్తాన్ని డివిడెంట్‌గా పంచి.. మిగిలిన రూ.10 లక్షలను సభ్యుల అంగీకారంతో మరో వ్యాపారంలో పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయించారు.
ఆర్థిక స్వావలంబన దిశగా..
రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా మహిళా సమాఖ్యలు ఉన్నా వీరు ప్రభుత్వం ఇచ్చే సాయాన్ని ఇన్నేళ్లు ఇంటి అవసరాలకే వినియోగించుకునేవారు. వారికి మెరుగైన ఆర్థిక స్వావలంబన ఉండాలని, సుస్థిర జీవనోపాధికి మార్గం చూపాలన్న లక్ష్యంతో ‘మెప్మా’ ఎండీ విజయలక్ష్మి సమాఖ్య సభ్యులను సూపర్ మార్కెట్ల ఏర్పాటు దిశగా ప్రోత్సహించారు. ఆసక్తి గల సభ్యులతో రూ.150 చొప్పున పెట్టుబడి పెట్టించి ‘జగనన్న మహిళా మార్ట్’లను ఏర్పాటు చేశారు.
2021 జనవరిలో పులివెందులలో తొలి మార్ట్‌ను ఏర్పాటు చేశారు. గత ఏడాది ఈ స్టోర్ రూ.2.50 కోట్ల వ్యాపారం చేయడంతో పాటు సుమారు రూ.18 లక్షల లాభాన్ని ఆర్జించింది. దాంతో వాటాదారులకు డివిడెండ్ చెల్లించారు. ఇప్పుడు తిరుపతి పట్టణంలోని మహిళా మార్ట్ వాటాదారులు డివిడెంట్ అందుకోనున్నారు. కాగా.. ఈ రెండేళ్ల కాలంలో పులివెందుల, రాయచోటి, అద్దంకి, పుంగనూరు, తిరుపతి, చిత్తూరు, శ్రీకాకుళం, కర్నూలు, మారా>్కపురం, ఒంగోలు పట్టణాల్లో 10 జగనన్న మహిళా మార్ట్‌లను అందుబాటులోకి తెచ్చారు.
ఇది సమైక్య విజయం
పెట్టుబడిదారులు, అమ్మకందారులు, కొనుగోలుదారులు మహిళలే. మార్ట్‌ల నిర్వహణ కోసం మెప్మా ఆధ్వర్యంలోశిక్షణ ఇచ్చాం. మార్ట్ ఏర్పాటు, నిర్వహణ ప్రతి దశను ఎస్‌హెచ్‌జీ సభ్యులే స్వయంగా చూసుకుంటున్నారు. తిరుపతిలో జగనన్న మహిళా మార్ట్ ఏడాదిన్నలో రూ.30 లక్షల లాభాన్ని ఆర్జించింది.
ఇందులోని సభ్యులకు రూ.20 లక్షల డివిడెండ్ చెల్లించి.. మిగతా మొత్తంతో సభ్యుల అంగీకారంతో కొత్త వ్యాపారంలో ప్రారంభిస్తాం. ఇందులోనూ మహిళలే సభ్యులుగా ఉండి వచ్చిన లాభాలను పంచుకుంటారు. మహిళా స్వయం సహాయక సంఘాల్లోని ప్రతి మహిళ ఆర్థికంగా ఎదిగేలా చేయడమే మెప్మా లక్ష్యం. – వి.విజయలక్ష్మి, మెప్మా మిషన్ డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment