సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన జగనన్న మహిళా మార్టుల నిర్వహణ అద్భుతంగా ఉందని కేరళకు చెందిన అధికారులు కితాబిచ్చారు. అతి తక్కువ పెట్టుబడితో స్వయం సహాయక సంఘాల మహిళలు సూపర్ మార్కెట్లను ఏర్పాటు చేయడంతో పాటు ఇంత ఘన విజయం సాధించడం దేశంలో ఎక్కడా చూడలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మహిళలను స్వయం శక్తిగా తీర్చిదిది్దన పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ (మెప్మా) కృషిని అభినందించారు.
ఈ తరహా మార్టులను కేరళ రాష్ట్రంలోనూ ప్రవేశపెడతామని పేర్కొన్నారు. ఏపీలోని స్వయం సహాయక సంఘాల మహిళల ప్రగతిని, స్థితిగతులను పరిశీలించేందుకు గతనెలలో కేరళకు చెందిన కుడుంబశ్రీ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జాఫర్ మాలిక్ ఆధ్వర్యంలో అధికారులు రాష్ట్రంలో పర్యటించారు. అందులో భాగంగా వారు శ్రీకాకుళంలోని జగనన్న మహిళా మార్టును, విశాఖపట్నంలోని అర్బన్ మార్కెట్లను పరిశీలించారు.
నిర్వహణకు ఏకీకృత సాఫ్ట్‌వేర్
రెండేళ్ల క్రితం పైలట్ ప్రాజెక్టుగా తొలి జగనన్న మహిళా మార్టును పులివెందులలో ‘మెప్మా’ ఏర్పా టు చేసింది. తర్వాత వివిధ దశల్లో రాయచోటి, అద్దంకి, పుంగనూరు, తిరుపతి, చిత్తూరు, శ్రీకాకుళంలో మొత్తం 7 మహిళా మార్టులను అందుబాటులోకి తెచ్చారు. అన్ని స్టోర్లలోనూ స్థానిక పట్టణా ల్లోని స్వయం సహాయక సంఘాల్లోని ఒక్కో మహిళా రూ.150 చొప్పున వాటాగా పెట్టారు. ఒక్కో స్టోర్‌లో 8 వేల నుంచి గరిష్టంగా 37 వేల మంది వరకు వాటాదారులుగా ఉన్నారు.
ఒక్కో మార్ట్ నెలకు రూ.13.50 లక్షల నుంచి రూ.32.56 లక్షల వరకు అమ్మకాలు చేస్తున్నాయి. మొత్తం అన్ని మార్టుల నిర్వహణకు మెప్మా అధికారులు ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ప్రతి వస్తువు అమ్మకంపై వచ్చే లాభాలు సైతం కంప్యూటర్‌లో కనిపిస్తుండడంతో 7 మార్టుల సంఘాలు అమ్మకాలు చేసేందుకు పోటీ పడుతున్నాయి.
మన మార్ట్ మోడల్ నచ్చింది..
జగనన్న మహిళా మార్టుల పనితీరు కేరళ అధికారులకు బాగా నచ్చింది. త్వరలో గుంటూరు, రాజమండ్రి, ఒంగోలు, మంగళగిరి, విజయవాడల్లోనూ జగనన్న మహిళా మార్టులను ఏర్పాటు చేస్తాం. లాభాలు ఆశించకుండా నాణ్యమైన సరుకులను అందిస్తుండడంతో మార్టులకు మంచి ఆదరణ లభిస్తోంది. – విజయలక్ష్మి, మెప్మా ఎండీ
Comments
Please login to add a commentAdd a comment