దేశీయ స్టాక్ సూచీల లాభాలు ఈ వారమూ కొనసాగొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు అంచనా వార్తలు ఈక్విటీ మార్కెట్లను ముందుకు నడిపించవచ్చంటున్నారు. ఆయా దేశాల స్థూల ఆర్థిక గణాంకాలు, అంతర్జాతీయ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల క్రయ విక్రయాలు దలాల్ స్ట్రీట్‌కు దిశానిర్దేశం చేస్తాయంటున్నారు. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదలికలను ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలించే వీలుందంటున్నారు.
‘‘అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పాలసీ సమావేశం సెప్టెంబర్ 17-18 జరగునున్నాయి. ఈ నేపథ్యంలో ఫెడ్ వడ్డీరేట్లను ప్రభావితం చేసే యూఎస్ తయారీ రంగ, నిరుద్యోగ రేటు, వ్యవసాయేతర పేరోల్ గణాంకాలను ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. లాభాలు కొనసాగితే నిఫ్టీ ఎగువ స్థాయిలో 25,500 స్థాయిని పరీక్షించవచ్చు. గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ చోటు చేసుకుంటే 25,000 వద్ద తక్షణ మద్దతు లభించవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే 24,900 వద్ద మరో మద్దతు ఉంది’’ అని మెహ్తా ఈక్విటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సే తెలిపారు.
యూఎస్ ద్రవ్యోల్బణం, నిరుద్యోగ క్లెయిమ్స్ తగ్గడంతో పాలసీ సర్దుబాట్లకు సమయం ఆసన్నమైందంటూ ఫెడ్ చైర్మన్ పావెల్ వ్యాఖ్యలతో గతవారం సూచీలు ఒకటిన్నర శాతానికి పైగా ర్యాలీ చేశాయి. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు సైతం సెంటిమెంట్‌ను బలపరిచాయి. ముఖ్యంగా విస్తృత స్థాయి మార్కెట్లో చిన్న, మధ్య తరహా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. సెన్సెక్స్ 1,280 పాయింట్లు, నిఫ్టీ 413 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.
దేశీయ ఆటో కంపెనీల ఆగస్టు వాహన విక్రయ గణాంకాల వెల్లడి కారణంగా ఆటో రంగ షేర్లలో కదలికలు గమనించవచ్చు. ఇవాళ(సోమవారం) భారత్ పాటు చైనా, యూరోజోన్‌లు ఆగస్టు తయారీ రంగ పీఎంఐ డేటాను విడుదల చేయనున్నాయి. అమెరికా ఆగస్టు తయారీ రంగ, వాహన విక్రయ డేటాను మంగళవారం ప్రకటించనుంది.
దేశీయ సేవారంగ పీఎంఐ గణాంకాలు బుధవారం(సెప్టెంబర్ 4న) విడుదల అవుతాయి. ఆగస్టు 31తో ముగిసిన వారం బ్యాంకు రుణాలు, డిపాజిట్ల వృద్ధి గణాంకాలు, ఆగస్టు 24తో ముగిసిన వారం ఫారెక్స్ నిల్వలను ఆర్‌బీఐ శుక్రవారం(సెప్టెంబర్ 6న) విడుదల చేస్తుంది. ఇదే వారాంతాపు రోజున యూరోజోన్ జూన్ క్వార్టర్ జీడీపీ అంచనా డేటా, అమెరికా నిరుద్యోగ రేటు, వ్యవసాయేతర పేరోల్ గణాంకాలను వెల్లడి కానున్నాయి. ఆయా దేశాల ఆర్థిక స్థితిగతులను ప్రతిబింబిపజేసే ఈ స్థూల ఆర్థిక గణాంకాలు ఈక్విటీ మార్కెట్ల ట్రేడింగ్‌ను ప్రభావితం చేయగలవు.
ఆగస్టులో రూ.7,320 కోట్ల అమ్మకాలు
విదేశీ ఇన్వెస్టర్లు ఆగస్టులో రూ.7,320 కోట్ల విలువైన భారత ఈక్విటీలను విక్రయించారు. అధిక వాల్యుయేషన్ ఆందోళనలతో పాటు జపాన్ వడ్డీరేట్ల పెంపుతో యెన్ ఆధారిత ట్రేడింగ్ భారీగా తగ్గడం ఇందుకు ప్రధాన కారణాలు. ఆగస్టులో అమెరికా ఆర్థిక మాంద్య భయాలు, బలహీన స్థూల ఆర్థిక గణాంకాల నమోదు కూడా విదేశీ ఇన్వెస్టర్లను నిరాశపరిచాయి. అయితే జూలైలో రూ.32,365 కోట్లు, జూలైలో రూ.26,565 కోట్ల విక్రయాలతో పోలిస్తే ఇది తక్కువ కావడం విశేషం. ఇదే నెలలో డెట్ మార్కెట్లో రూ.17,960 కోట్ల పెట్టుడులు పెట్టారు.
‘‘ఎఫ్‌ఐలు సెప్టెంబర్‌లో కొనుగోళ్లు చేపట్టే వీలుంది. దేశీయ రాజకీయ స్థిరత్వం, స్థూల ఆర్థిక గణాంకాలు, ఫెడ్ వడ్డీరేట్ల తగ్గింపు, మార్కెట్ వాల్యుయేషన్‌లు, రంగాల ప్రాధాన్యత, డెట్ మార్కెట్ ఆకర్షణ అంశాలు విదేశీ ఇన్వెస్టర్ల క్రయ, విక్రయాలపై ప్రభావం చూపొచ్చు’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్ వీకే విజయకుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment