పెట్టుబడి మీద మంచి లాభాలు కొనాలంటే బంగారం, రియల్ ఎస్టేట్ సులువైన మార్గాలు. కొంచెం శ్రమిస్తే స్టాక్‌మార్కెట్ కూడా ఎక్కువ లాభాలే అందిస్తుంది. కానీ వీటన్నింటిని ఈ బ్యాగును కొన్ని కొన్నాళ్లు వాడుకుని అమ్మేసినా చాలు పెట్టుబడి మీద స్టాక్ మార్కెట్‌ను మించి రిటర్న్స్ వస్తున్నాయి. ఇంతకీ కాసుల పంట పండిస్తున్న ఆ బంగారుబాతు లాంటి బ్యాగు పేరు హెర్మిస్ బిర్‌కిన్.
హోదాకు చిహ్నం
సెలబ్రిటీ, ధనవంతుల ప్రపంచంలో బిర్‌కిన్ బ్యాగులకు ఉండే క్రేజ్ వేరు. ఐశ్వర్యవంతుల కుటుంబ సభ్యులు బిర్‌కిన్ బ్యాగుని ధరించడం తమ హోదాకు చిహ్నంగా భావిస్తుంటారు. అందుకే ఈ బ్యాగును కొనుగోలు చేసేందుకు ఎంత ధరైనా చెల్లించేందుకు వెనుకడారు. ఫుట్‌బాల్ స్టార్ ఆటగాడు బెక్‌హామ్ భ్యార విక్టోరియా బెక్‌హామ్ దగ్గర వందకు పైగా బిర్‌కిన్ బ్యాగులు ఉన్నాయి. వీటి విలువ రూ. 7 కోట్లకు పైమాటే. అదే విధంగా సింగపూర్ ఎంట్రప్యూనర్ జేమీ చువా దగ్గర అయితే ఏకంగా ఈ బ్యాగులు రెండు వందలకు పైగానే ఉన్నాయి.
హిమాలయ ధర రూ.3.75 కోట్లు
హెర్మిస్ బిర్కిన్ బ్యాగుల్లో అనేక మోడళ్లు ఉన్నప్పటికీ ఇందులో అత్యంత ప్రత్యేకమైనవి హిమాలయ శ్రేణి హ్యాండ్ బ్యాగులు. ఈ బ్యాగు తయారీలో ప్రత్యేకమైన జంతు చర్మం ఉపయోగించడంతో పాటు 18 క్యారెట్ బంగారంతో చేసిన మెటీరియల్ 200 వజ్రాలు ఈ బ్యాగులో పొదిగి ఉంటాయి. అమెరికన్ బెట్టింగ్ రారాజు డేవిడ్ ఓనాసియా హిమాలయన్ బ్యాగుని ఇటీవల 5 లక్షల డాలర్లు (ఇండియన్ కరెన్సీలో సుమారు 3.75 కోట్లు )చెల్లించి కొనుగోలు చేశాడు. ఒక్క హ్యాండ్ బాగుకి సంబంధించి ఇదే అత్యధిక ధర. ప్రపంచ రికార్డు కూడా. కానీ త్వరలోనే ఈ రికార్డు కూడా మాయం కాబోతుంది. ఎందుకంటే రాబోయే ఈ రోజుల్లో ఈ బ్యాగుని 20 లక్షల డాలర్ల (రూ.14 కోట్లు)కి అమ్మేస్తానంటూ చెబుతున్నాడు డేవిడ్ ఓనాసియా. సెలబ్రిటీ ప్రపంచంలో ఈ బ్యాగుకి ఆ స్థాయి క్రేజ్ ఉంది.
ఎలా వచ్చాయి
ఇంగ్లండ్‌కి చెందిన నటీ సింగర్ జేన్ బిర్‌కిన్ ఓసారి ప్యారిస్ నుంచి లండన్‌కి విమానంలో ప్రయాణం చేస్తున్నారు. ఆమె తన హ్యాండ్‌బ్యాగుని లగేజ్ ర్యాక్‌లో పెట్టగా.. మార్గమధ్యంలో స్ట్రాప్ ఊడిపోయి అందులో వస్తువులన్నీ కింద పడిపోయాయి. ఆ సమయంలో అదే విమానంలో ప్రయాణం చేస్తున్న లగ్జరీ గూడ్స్ తయారీ సంస్థ హెర్మీస్ సీఈవో లూయిస్ డ్యుమాస్, జేన్ కిర్‌బిన్ ఇబ్బందిని గమనించాడు. ఇకపై మీకు ఈ సమస్య ఉండదంటూ ఆమెకు హమీ ఇచ్చాడు.
ఏడాదిలోగా
అన్నట్టుగానే ఏడాది తిరిగే సరికి అత్యంత సుందరైన, సౌకర్యవంతమైన బ్యాగుని తయారు చేసి దానికి బిర్‌కిన్ అనే పేరు పెట్టి ఆ నటికి బహుమతిగా అందించాడు. ఈ ఘటన 1984లో జరిగింది. ఎంపిక చేసిన జంతువుల చర్మాలతో ఎంతో కళాత్మకంగా పూర్తి హ్యాండ్ మేడ్‌గా బిర్‌కిన్ బ్యాగు రూపొందింది. పైగా ఆనాటి ప్రముఖ నటి పేరు మీదుగా రావడం దీనికి ప్లస్ అయ్యింది. అంతే ఐదేళ్లు తిరిగే సరికి బిర్‌కిన్ బ్యాగ్ సెలబ్రిటీల హోదాకు ప్రత్యామ్నయంగా మారింది.
డిమాండ్ ఎందుకు
సెలబ్రిటీల హోదాకు బిర్‌కిన్ చిహ్నంగా మారడంతో 90వ దశకంలో ధనవంతులు ఈ బ్యాగులను సొంతం చేసుకునేందుకు పోటీ పడటం మొదలైంది. అయితే డిమాండ్ ఎంత ఉన్నా హెర్మిస్ సంస్థ ఈ బ్యాగులను పరిమితంగానే తయారు చేయడం ప్రారంభించింది. ఎంతటి ధనవంతులైనా.. ఎంత డబ్బులు చెల్లిస్తామన్నా ఎన్నంటే అన్ని బ్యాగులు తయారు చేయదు హెర్మిస్. పైగా బ్యాగులు కొనుగోలుపై కూడా పరిమితి విధిస్తుంది. దీంతో వీటి పట్ల క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. వీటిని తమ భాగస్వామికి బహుమతిగా అందించేందుకు కోటీశ్వరులు ఊవ్విళ్లూరుతారు. ఎలాగైనా ఈ బ్యాగు ఉండాల్సిందే అనుకునే మగువల క్యూ అంతకంతకు రెట్టింపయ్యింది. అందుకే కోట్ల రూపాయలు పోసీ బిర్‌కిన్ బ్యాగులు కొనేస్తున్నారు.
500ల శాతం
పరిమిత సంఖ్యలో బ్యాగులు లభించడం, అపరిమిత సంఖ్యలో కొనుగోలుదారులు ఆసక్తి చూపడంతో అనతి కాలంలోనే బిర్‌కిన్ బ్యాగుల డిమాండ్ ఆకాశాన్ని తాకింది. దానికి తగట్టే సెకండ్ హ్యాండ్ మార్కెట్లో వీటిని కొనేందుకు పోటీ పెరిగింది. వాడిన బ్యాగులైనా సరే అసలు కంటే ఎక్కువ ధర పెట్టి కొనడం మొదలైంది. 2017లో చేపట్టిన సర్వేలో బిర్‌కిన్ బ్యాగుల విలువ గడిచిన 35 ఏళ్లలో 500 శాతం పెరిగినట్టు.. ప్రతీ ఏడు ఈ బ్యాగుల విలువ 14 శాతం పెరుగుతూ వస్తోందని తేలింది.
ఫేక్‌ల వెల్లువ
బిర్‌కిన్ బ్యాగులకు ఉన్న డిమాండ్ నేపథ్యంలో మార్కెట్‌లో ఫేక్ బ్యాగులు కూడా వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే వందలాది కేసులు నమోదయ్యాయి. అయినా సరే ఫేక్‌లను పూర్తిగా అరికట్టలేకపోయారు.
- సాక్షివెబ్ ప్రత్యేకం
Comments
Please login to add a commentAdd a comment