hermes bag
-
పేపర్ కవర్ ధర పదివేలా? ఏముందిరా అందులో..?
సాధారణంగా మనం వాడే పేపర్ కవర్ (ఎన్వలప్) ఎంత ఉంటుంది. పది, ఐదు, మహా అయితే రెండు వందలు ఉంటుంది. కానీ ఫ్రెంచ్ లగ్జరీ డిజైన్ హౌస్ హెర్మేస్ ఇంటర్నేషనల్ ప్రస్తుతం ఒకే పేపర్ ఎన్వలప్‌ను వేల రూపాయలకు విక్రయిస్తోంది. దీనికి సంబంధించిన స్టోరీ ఒకటి ఇంటర్నరెట్లో హల్ చల్ చేస్తోంది. అయితే దీనికి ఓ ప్రత్యేకత ఉంది. హెర్మేస్ వెబ్సైట్ ప్రకారం, “సిగ్నేచర్ ఆరెంజ్ హెర్మేస్ పేపర్ ఎన్వలప్” ఆరెంజ్పేపర్ బాక్స్‌లో పట్టుదారాలతో చుట్టి ఉంటుంది. A4 , A5 అనే రెండు సైజుల్లో ఇది అందుబాటులో ఉంది. దీంట్లో ట్రావెల్ డాక్యుమెంట్స్, టిక్కెట్లు , ఇతర పత్రాలను దాచుకోవచ్చు. అంతేకాదు “ప్రత్యేక ఆహ్వానం లేదా ప్రేమ ప్రకటన” కోసం కూడా అపురూపంగా పదిలపర్చు కోవచ్చు. ఫ్రాన్స్లోప్రత్యేకంగా రూపొందించిన ఈపేపరు కవరు ధరసుమారు రూ. 10,411 (125 డాలర్లు)కి విక్రయిస్తోంది. అంతేకాదు దీన్ని రీయూజ్ చేసుకోవచ్చు. హెర్మేస్ హై-ఎండ్ స్టేషనరీ కలెక్షన్లో దీన్ని ప్రత్యేకంగా భావిస్తారు. కొందరు ఇది కాస్ట్లీ గురూ అంటోంటే, మరికొందరు మాత్రం స్టేటస్ బాస్ అంటారట. కాగా హీర్మేస్ ఇంటర్నేషనల్ లగ్జరీ బ్రాండ్ ప్రొడక్ట్స్ ధరలు సోషల్ మీడియాలో వైరల్ కావడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది Balenciaga ట్రాష్ బ్యాగ్ ఒక్కొక్కటి రూ. 1.4 లక్షలకు విక్రయించడం వైరల్‌గా మారింది. అలాగే 7.5 అంగుళాల సమర్కాండే మోడల్‌తో సహా వివిధ విలువైన పేపర్‌వెయిట్ ధర 2,950 డాలర్లు, అలాగే మౌస్ ప్యాడ్ 405 డాలర్లంటే ఆశ్చర్యమే మరి. 1837 నుండి విలాసవంతమైన ఉత్పత్తులకు, ముఖ్యంగా సాండిల్స్, హ్యాండ్‌బ్యాగ్‌లు, ఇతర లెదర్ వస్తువులకు ప్రసిద్ధి చెందింది ఈ బ్రాండ్. -
ఏకంగా రూ.91 వేల కోట్ల ఆస్తి.. పనివాడే వారసుడు!
ఎవరికి ఎవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక.. అని పాత తెలుగు సినిమాలో ఓ పాట ఉంది. ఇలా అయినవారిపై విసుగు చెందిన ఓ బిలియనీర్ తన యావదాస్తిని తన వద్ద పనిచేసే వ్యక్తికి రాసిచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఇంతకీ ఆస్తి ఎంతనుకుంటున్నారు? ఏకంగా రూ.91 వేల కోట్ల విలువైన ఆస్తి. ఇందు కోసం అతన్ని దత్తత తీసుకోవాలని నిర్ణయించాడు. ఈ వ్యవహారం ఇప్పుడు స్విట్జర్లాండ్ మీడియాలో చర్చనీయాంశమైంది. స్విట్జర్లాండ్‌లో ప్రముఖ లగ్జరీ ఫ్యాషన్ ఉత్పత్తుల కంపెనీ హెర్పెస్ (Hermes)ను స్థాపించిన థియరీ హెర్మెస్ మనవడు 80 ఏళ్ల నికోలస్ ప్యూచ్ (Nicolas Puech) తన దగ్గర పనిచేసే 51 ఏళ్ల తోటమాలిని దత్తత తీసుకుని అతనికి 11 బిలియన్ డాలర్లు ( సుమారు రూ.91 వేల కోట్లు) సంపదను అప్పగించాలని యోచిస్తున్నట్లు ట్రిబ్యూన్ డి జెనీవ్ ఫార్చ్యూన్ అనే స్విస్ పత్రిక నివేదించింది. ఐదో తరం వారసుడు హెర్మెస్ కంపెనీని థియరీ హెర్మెస్1837లో స్థాపించారు. థియరీ హెర్మెస్ కుటుంబంలో ఐదవ తరం వారసుడే నికోలస్ ప్యూచ్. ఈయన కంపెనీలో 9 బిలియన్ నుంచి 10 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌ల విలువైన 5- 6 శాతం వాటా కలిగి ఉన్నారు. అయితే నికోలస్‌కు పెళ్లి, పిల్లలు లేరు. దీంతో ఆయన తన తదనంతరం సంపదను తన వద్ద పనిచేస్తున్న మాజీ తోటమాలికి రాసిచ్చే ప్రక్రియలో ఉన్నారు. దీని కోసం న్యాయవాద బృందాన్ని సైతం నియమించినట్లు సమాచారం. ఇప్పటికే రూ.49 కోట్లు అయితే నికోలస్ దత్తత తీసుకుని ఆస్తిని రాసివ్వాలనుకుంటున్న వ్యక్తి పేరు మాత్రం వెల్లడి కాలేదు. ఆయన స్పానిష్ మహిళను వివాహం చేసుకున్నట్లు, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ వ్యక్తికి నికోలస్ 5.9 మిలియన్ డాలర్లు (రూ.49 కోట్లు) విలువైన ఆస్తిని ఇచ్చినట్లు సమాచారం. ఇందులో మొరాకోలోని మరకేష్‌లోని ఆస్తి, స్విట్జర్లాండ్‌లోని మాంట్రీక్స్లోని ఒక విల్లా ఉన్నాయి. కుటుంబంలో విభేదాలు ఫార్చ్యూన్ కథనం ప్రకారం.. కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా 220 బిలియన్ డాలర్ల విలువైన హెర్మెస్ కంపెనీలో తనకున్న 5-6 శాతం వాటాను తన దగ్గర పనిచేసే వ్యక్తికి రాసిచ్చేందుకు నికోలస్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హెర్మెస్ కంపెనీ సూపర్వైజరీ బోర్డు నుంచి నికోలస్ ప్యూచ్ 2014లో తప్పుకొన్నారు. ఆ తర్వాత ఎల్వీఎంహెచ్ అనే మరో ఫ్యాషన్ కంపెనీ హెర్మెస్లో 23 శాతం వాటాను బలవంతంగా దక్కించుకుంది. దీన్ని అడ్డుకునేందుకు ఇతర కుటుంబ సభ్యులు తమ షేర్లతో ఓ హోల్డింగ్ కంపెనీని ఏర్పాటు చేసుకున్నారు. కానీ ప్యూచ్ మాత్రం తన వాటాను కొనసాగించారు. ఈ విభేదాలే నికోలస్ తన వారసులుగా కుటుంబ సభ్యులను కాకుండా బయటి వ్యక్తిని తన వారసుడిగా చేయడానికి కారణంగా భావిస్తున్నారు. దత్తత సాధ్యమేనా? నికోలస్ ప్యూచ్ తన దగ్గర పనిచేసే వ్యక్తిని దత్తత తీసుకునేందుకు నిర్ణయం తీసుకున్నా ఆయన పెద్దవారు కావడంతో చట్టపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. పెద్దల దత్తతకు సంబంధించి స్విట్జర్లాండ్‌లో కొన్ని కఠినమైన నిబంధనలు ఉన్నాయి. ఇది ఎంత మేరకు సాధ్యమతుందో చూడాలి. -
ఈ స్పెషల్ హ్యాండ్‌బ్యాగ్‌ని అమ్మితే.. కోట్లలో లాభాలు..
పెట్టుబడి మీద మంచి లాభాలు కొనాలంటే బంగారం, రియల్ ఎస్టేట్ సులువైన మార్గాలు. కొంచెం శ్రమిస్తే స్టాక్‌మార్కెట్ కూడా ఎక్కువ లాభాలే అందిస్తుంది. కానీ వీటన్నింటిని ఈ బ్యాగును కొన్ని కొన్నాళ్లు వాడుకుని అమ్మేసినా చాలు పెట్టుబడి మీద స్టాక్ మార్కెట్‌ను మించి రిటర్న్స్ వస్తున్నాయి. ఇంతకీ కాసుల పంట పండిస్తున్న ఆ బంగారుబాతు లాంటి బ్యాగు పేరు హెర్మిస్ బిర్కిన్. హోదాకు చిహ్నం సెలబ్రిటీ, ధనవంతుల ప్రపంచంలో బిర్కిన్ బ్యాగులకు ఉండే క్రేజ్ వేరు. ఐశ్వర్యవంతుల కుటుంబ సభ్యులు బిర్కిన్ బ్యాగుని ధరించడం తమ హోదాకు చిహ్నంగా భావిస్తుంటారు. అందుకే ఈ బ్యాగును కొనుగోలు చేసేందుకు ఎంత ధరైనా చెల్లించేందుకు వెనుకడారు. ఫుట్‌బాల్ స్టార్ ఆటగాడు బెక్‌హామ్ భ్యార విక్టోరియా బెక్‌హామ్ దగ్గర వందకు పైగా బిర్కిన్ బ్యాగులు ఉన్నాయి. వీటి విలువ రూ. 7 కోట్లకు పైమాటే. అదే విధంగా సింగపూర్ ఎంట్రప్యూనర్ జేమీ చువా దగ్గర అయితే ఏకంగా ఈ బ్యాగులు రెండు వందలకు పైగానే ఉన్నాయి. హిమాలయ ధర రూ.3.75 కోట్లు హెర్మిస్ బిర్కిన్ బ్యాగుల్లో అనేక మోడళ్లు ఉన్నప్పటికీ ఇందులో అత్యంత ప్రత్యేకమైనవి హిమాలయ శ్రేణి హ్యాండ్ బ్యాగులు. ఈ బ్యాగు తయారీలో ప్రత్యేకమైన జంతు చర్మం ఉపయోగించడంతో పాటు 18 క్యారెట్ బంగారంతో చేసిన మెటీరియల్ 200 వజ్రాలు ఈ బ్యాగులో పొదిగి ఉంటాయి. అమెరికన్ బెట్టింగ్ రారాజు డేవిడ్ ఓనాసియా హిమాలయన్ బ్యాగుని ఇటీవల 5 లక్షల డాలర్లు (ఇండియన్ కరెన్సీలో సుమారు 3.75 కోట్లు )చెల్లించి కొనుగోలు చేశాడు. ఒక్క హ్యాండ్ బాగుకి సంబంధించి ఇదే అత్యధిక ధర. ప్రపంచ రికార్డు కూడా. కానీ త్వరలోనే ఈ రికార్డు కూడా మాయం కాబోతుంది. ఎందుకంటే రాబోయే ఈ రోజుల్లో ఈ బ్యాగుని 20 లక్షల డాలర్ల (రూ.14 కోట్లు)కి అమ్మేస్తానంటూ చెబుతున్నాడు డేవిడ్ ఓనాసియా. సెలబ్రిటీ ప్రపంచంలో ఈ బ్యాగుకి ఆ స్థాయి క్రేజ్ ఉంది. ఎలా వచ్చాయి ఇంగ్లండ్‌కి చెందిన నటీ సింగర్ జేన్ బిర్కిన్ ఓసారి ప్యారిస్ నుంచి లండన్‌కి విమానంలో ప్రయాణం చేస్తున్నారు. ఆమె తన హ్యాండ్‌బ్యాగుని లగేజ్ ర్యాక్‌లో పెట్టగా.. మార్గమధ్యంలో స్ట్రాప్ ఊడిపోయి అందులో వస్తువులన్నీ కింద పడిపోయాయి. ఆ సమయంలో అదే విమానంలో ప్రయాణం చేస్తున్న లగ్జరీ గూడ్స్ తయారీ సంస్థ హెర్మీస్ సీఈవో లూయిస్ డ్యుమాస్, జేన్ కిర్బిన్ ఇబ్బందిని గమనించాడు. ఇకపై మీకు ఈ సమస్య ఉండదంటూ ఆమెకు హమీ ఇచ్చాడు. ఏడాదిలోగా అన్నట్టుగానే ఏడాది తిరిగే సరికి అత్యంత సుందరైన, సౌకర్యవంతమైన బ్యాగుని తయారు చేసి దానికి బిర్కిన్ అనే పేరు పెట్టి ఆ నటికి బహుమతిగా అందించాడు. ఈ ఘటన 1984లో జరిగింది. ఎంపిక చేసిన జంతువుల చర్మాలతో ఎంతో కళాత్మకంగా పూర్తి హ్యాండ్ మేడ్‌గా బిర్కిన్ బ్యాగు రూపొందింది. పైగా ఆనాటి ప్రముఖ నటి పేరు మీదుగా రావడం దీనికి ప్లస్ అయ్యింది. అంతే ఐదేళ్లు తిరిగే సరికి బిర్కిన్ బ్యాగ్ సెలబ్రిటీల హోదాకు ప్రత్యామ్నయంగా మారింది. డిమాండ్ ఎందుకు సెలబ్రిటీల హోదాకు బిర్కిన్ చిహ్నంగా మారడంతో 90వ దశకంలో ధనవంతులు ఈ బ్యాగులను సొంతం చేసుకునేందుకు పోటీ పడటం మొదలైంది. అయితే డిమాండ్ ఎంత ఉన్నా హెర్మిస్ సంస్థ ఈ బ్యాగులను పరిమితంగానే తయారు చేయడం ప్రారంభించింది. ఎంతటి ధనవంతులైనా.. ఎంత డబ్బులు చెల్లిస్తామన్నా ఎన్నంటే అన్ని బ్యాగులు తయారు చేయదు హెర్మిస్. పైగా బ్యాగులు కొనుగోలుపై కూడా పరిమితి విధిస్తుంది. దీంతో వీటి పట్ల క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. వీటిని తమ భాగస్వామికి బహుమతిగా అందించేందుకు కోటీశ్వరులు ఊవ్విళ్లూరుతారు. ఎలాగైనా ఈ బ్యాగు ఉండాల్సిందే అనుకునే మగువల క్యూ అంతకంతకు రెట్టింపయ్యింది. అందుకే కోట్ల రూపాయలు పోసీ బిర్కిన్ బ్యాగులు కొనేస్తున్నారు. 500ల శాతం పరిమిత సంఖ్యలో బ్యాగులు లభించడం, అపరిమిత సంఖ్యలో కొనుగోలుదారులు ఆసక్తి చూపడంతో అనతి కాలంలోనే బిర్కిన్ బ్యాగుల డిమాండ్ ఆకాశాన్ని తాకింది. దానికి తగట్టే సెకండ్ హ్యాండ్ మార్కెట్లో వీటిని కొనేందుకు పోటీ పెరిగింది. వాడిన బ్యాగులైనా సరే అసలు కంటే ఎక్కువ ధర పెట్టి కొనడం మొదలైంది. 2017లో చేపట్టిన సర్వేలో బిర్కిన్ బ్యాగుల విలువ గడిచిన 35 ఏళ్లలో 500 శాతం పెరిగినట్టు.. ప్రతీ ఏడు ఈ బ్యాగుల విలువ 14 శాతం పెరుగుతూ వస్తోందని తేలింది. ఫేక్‌ల వెల్లువ బిర్కిన్ బ్యాగులకు ఉన్న డిమాండ్ నేపథ్యంలో మార్కెట్లో ఫేక్ బ్యాగులు కూడా వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే వందలాది కేసులు నమోదయ్యాయి. అయినా సరే ఫేక్‌లను పూర్తిగా అరికట్టలేకపోయారు. - సాక్షివెబ్ ప్రత్యేకం -
ఈ బ్యాగ్ ధరెంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
బయటికి వెళ్తున్నామంటే భుజాన బ్యాగ్ తప్పక ఉండాల్సిందే. ఇక పార్టీలకు వెళ్లేపుడు ప్రత్యేక ఆకర్షణగా నిలవాలంటే డ్రెస్‌తో పాటు ఆభరణాలు, వెంట తీసుకెళ్లే ఆక్ససరీస్ ట్రెండీగా ఉండాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. అలాగే ఆసియాకు చెందిన ఓ మహిళ కూడా తన వెంట తీసుకెళ్లే బ్యాగు ప్రత్యేకంగా ఉండాలనుకున్నారు. అయితే అందుకోసం ఆమె వెచ్చించిన సొమ్ము ఎంతో తెలిస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే. హాంగ్‌కాంగ్‌లో క్రిస్టీస్ అనే సంస్థ నిర్వహించిన వేలంలో 2కోట్ల 57లక్షల రూపాయలు చెల్లించి మరీ బ్యాగును ఆమె సొంతం చేసుకున్నారు. హ్యాండ్ బ్యాగుకే అంత ధరా అని ఆశ్చర్యపోకండి ఎందుకంటే అది ప్రఖ్యాత ఫ్రెంచ్ లగ్జరీ ఫ్యాషన్ హౌజ్ ‘హెర్మ్స్’కు చెందిన బిర్కిన్ బ్రాండ్ బ్యాగు. హ్యాండు బ్యాగుల తయారీ కోసం ప్రత్యేకంగా మొసళ్లను పెంచి మరీ వాటి చర్మంతో బ్యాగులు, పర్సులు తయారు చేసే హెర్మ్స్ కంపెనీ ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. విక్టోరియా బెక్‌హామ్ నుంచి అమెరికన్ టీవీ నటి కిమ్ కర్దాషియన్ వరకు ఎంతో మంది సెలబ్రిటీలు తమ చేతిలో ప్రఖ్యాత హెర్మ్స్ బ్రాండ్ బ్యాగు ఉండాలని పోటీ పడి వాటిని సొంతం చేసుకుంటారు. బిర్కిన్ బ్యాగు ప్రారంభ ధర 7 వేల డాలర్లకు తక్కువగా ఉండదు. ప్రస్తుతం ఆసియన్ మహిళ సొంతం చేసుకున్న బ్యాగును హిమాలయన్ నీలో మొసలి చర్మంతో తయారుచేశారు. అరుదైన 245.. 18 క్యారట్ వైట్ గోల్డ్ డైమండ్స్‌తో పొదగబడిన లాక్‌తో రూపొందిన గ్రేడియన్ కలర్ బ్యాగును సొంతం చేసుకోవడానికి ఎంతో మంది ష్యాషన్ ప్రియులు పోటీ పడటంతో చరిత్రలో అత్యంత ఎక్కువ ధరకు అమ్ముడుపోయిన బ్యాగుగా రికార్డుకెక్కిందని క్రిస్టీస్ నిర్వాహకులు తెలిపారు. -
ఈ బ్యాగ్ ఖరీదు కోటిన్నర
న్యూయార్క్: అరుదైన మొసలి చర్మంతో 18 క్యారెట్ల బంగారం, వజ్రాలతో తయారు చేసిన బటన్లు అమర్చి అందంగా డిజైన్ చేసిన గులాబీ రంగు హ్యాండ్ బ్యాగ్ సోమవారం న్యూయార్క్‌లోని క్రిస్టీస్ ఆక్షన్ హౌజ్‌లో ఏకంగా 1.46 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది సెలబ్రిటీలను అభిమానులుగా కలిగిన ప్రపంచ ప్రసిద్ధ లెథర్ బ్యాగుల కంపెనీ హెర్మెస్ ఈ బ్యాగ్‌ను డిజైన్ చేసింది. హెర్మెస్ బిర్కిన్ బ్యాగ్ ట్యాగ్‌తో విడుదల చేసిన ఈ బ్యాగ్‌ను గుర్తు తెలియని వ్యక్తి కొనుగోలు చేశారని, ఇదే ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన బ్యాగ్ అని క్రిస్టీ వేలం నిర్వాహకులు తెలిపారు. గతంలో హెర్మెస్ బిర్కిన్ బ్యాగ్ 1.29 కోట్లకు అమ్ముడు పోయిందని, ఇప్పుడు ఆ రికార్డును బద్దలు కొట్టామని హెర్మెస్ కంపెనీ వర్గాలు తెలియజేశాయి. నల్ల రంగులో ఉన్న మరో బిర్కిన్ బ్యాగ్‌ను త్వరలో విడుదల చేయబోతున్నామని, అది ఇంతకన్న ఎక్కువ ధర పలుకుతుందని భావిస్తున్నామని ఆ వర్గాలు చెప్పాయి. ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన బిర్కిన్ ట్యాగ్ బ్యాగ్‌లకు ఎంతో గిరాకీ ఉంది. ఈ బ్యాగ్‌ల కోసం కొన్నేళ్లపాటు నిరీక్షించే వినియోగదారులు కూడా ఉన్నారు. ఫ్రాన్స్‌కు చెందిన హెర్మెస్ కంపెనీ 1984లో అప్పటికి పాపులరైన ప్రముఖ ఫ్రెంచ్ నటి, సింగర్ జాన్ బెర్కిన్ పేరిట హ్యాండ్ బ్యాగ్ సిరీస్‌ను ప్రారంభించింది. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు ఈ బ్యాగ్‌లను ఎగబడి కొంటున్నారు. ప్రముఖ మోడల్, సింగర్, డిజైనర్ విక్టోరియా బెకమ్ వద్ద ఈ బ్రాండ్ బ్యాగులు దాదాపు వంద ఉన్నాయట. కిమ్ కర్దాషియన్, హైదీ క్లమ్ లాంటి సెలబ్రిటీలు కూడా హెర్మెస్ బిర్కిన్ బ్యాగులే కొంటారు.