ఎవరికి ఎవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక.. అని పాత తెలుగు సినిమాలో ఓ పాట ఉంది. ఇలా అయినవారిపై విసుగు చెందిన ఓ బిలియనీర్ తన యావదాస్తిని తన వద్ద పనిచేసే వ్యక్తికి రాసిచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఇంతకీ ఆస్తి ఎంతనుకుంటున్నారు? ఏకంగా రూ.91 వేల కోట్ల విలువైన ఆస్తి. ఇందు కోసం అతన్ని దత్తత తీసుకోవాలని నిర్ణయించాడు. ఈ వ్యవహారం ఇప్పుడు స్విట్జర్లాండ్ మీడియాలో చర్చనీయాంశమైంది.
స్విట్జర్లాండ్‌లో ప్రముఖ లగ్జరీ ఫ్యాషన్ ఉత్పత్తుల కంపెనీ హెర్పెస్ (Hermes)ను స్థాపించిన థియరీ హెర్మెస్ మనవడు 80 ఏళ్ల నికోలస్ ప్యూచ్ (Nicolas Puech) తన దగ్గర పనిచేసే 51 ఏళ్ల తోటమాలిని దత్తత తీసుకుని అతనికి 11 బిలియన్ డాలర్లు ( సుమారు రూ.91 వేల కోట్లు) సంపదను అప్పగించాలని యోచిస్తున్నట్లు ట్రిబ్యూన్ డి జెనీవ్ ఫార్చ్యూన్ అనే స్విస్ పత్రిక నివేదించింది.
ఐదో తరం వారసుడు
హెర్మెస్ కంపెనీని థియరీ హెర్మెస్1837లో స్థాపించారు. థియరీ హెర్మెస్ కుటుంబంలో ఐదవ తరం వారసుడే నికోలస్ ప్యూచ్. ఈయన కంపెనీలో
9 బిలియన్ నుంచి 10 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌ల విలువైన 5- 6 శాతం వాటా కలిగి ఉన్నారు. అయితే నికోలస్‌కు పెళ్లి, పిల్లలు లేరు. దీంతో ఆయన తన తదనంతరం సంపదను తన వద్ద పనిచేస్తున్న మాజీ తోటమాలికి రాసిచ్చే ప్రక్రియలో ఉన్నారు. దీని కోసం న్యాయవాద బృందాన్ని సైతం నియమించినట్లు సమాచారం.
ఇప్పటికే రూ.49 కోట్లు
అయితే నికోలస్ దత్తత తీసుకుని ఆస్తిని రాసివ్వాలనుకుంటున్న వ్యక్తి పేరు మాత్రం వెల్లడి కాలేదు. ఆయన స్పానిష్ మహిళను వివాహం చేసుకున్నట్లు, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ వ్యక్తికి నికోలస్ 5.9 మిలియన్ డాలర్లు (రూ.49 కోట్లు) విలువైన ఆస్తిని ఇచ్చినట్లు సమాచారం. ఇందులో మొరాకోలోని మరకేష్‌లోని ఆస్తి, స్విట్జర్లాండ్‌లోని మాంట్రీక్స్‌లోని ఒక విల్లా ఉన్నాయి.
కుటుంబంలో విభేదాలు
ఫార్చ్యూన్ కథనం ప్రకారం.. కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా 220 బిలియన్ డాలర్ల విలువైన హెర్మెస్ కంపెనీలో తనకున్న 5-6 శాతం వాటాను తన దగ్గర పనిచేసే వ్యక్తికి రాసిచ్చేందుకు నికోలస్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హెర్మెస్ కంపెనీ సూపర్‌వైజరీ బోర్డు నుంచి నికోలస్ ప్యూచ్ 2014లో
తప్పుకొన్నారు. ఆ తర్వాత ఎల్‌వీఎంహెచ్ అనే మరో ఫ్యాషన్ కంపెనీ హెర్మెస్‌లో 23 శాతం వాటాను బలవంతంగా దక్కించుకుంది. దీన్ని అడ్డుకునేందుకు ఇతర కుటుంబ సభ్యులు తమ షేర్లతో ఓ హోల్డింగ్ కంపెనీని ఏర్పాటు చేసుకున్నారు. కానీ ప్యూచ్ మాత్రం తన వాటాను కొనసాగించారు. ఈ విభేదాలే నికోలస్ తన వారసులుగా కుటుంబ సభ్యులను కాకుండా బయటి వ్యక్తిని తన వారసుడిగా చేయడానికి కారణంగా భావిస్తున్నారు.
దత్తత సాధ్యమేనా?
నికోలస్ ప్యూచ్ తన దగ్గర పనిచేసే వ్యక్తిని దత్తత తీసుకునేందుకు నిర్ణయం తీసుకున్నా ఆయన పెద్దవారు కావడంతో చట్టపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. పెద్దల దత్తతకు సంబంధించి స్విట్జర్లాండ్‌లో కొన్ని కఠినమైన నిబంధనలు ఉన్నాయి. ఇది ఎంత మేరకు సాధ్యమతుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment