డాబాగార్డెన్స్(విశాఖ): మామ్మూళ్ల బెడద లేదు. కరెంటు.. ఇంటి అద్దె ఖర్చు లేదు. ఒకే వ్యాపారం చేయాలన్న ఒత్తిడి లేదు. నచ్చిన చోట మెచ్చిన వ్యాపారం. టిఫిన్ సెంటర్ నుంచి షర్బత్ బండి వరకు.. వినియోగదారులకు మెచ్చే ఆహారం. మొబైల్ బిజినెస్ ఇప్పుడు.. ఎప్పుడూ.. ఎవర్‌గ్రీన్ ట్రెండ్. పట్టణీకరణ పెరగడంతో సాటి మానవుడి అవసరాలు, ఆలోచనల్లో కూడా చాలా మార్పులు వచ్చాయి. బిజీబిజీ జీవనంలో శుచి, శుభ్రతతో ఉన్న వస్తువులు తమ వాకిట్లో లేదా తాము విధులు నిర్వహించే చోట, ఆఫీసుకు వెళ్లే మార్గంలో ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు.
జీవనం యాంత్రికం అయిపోవడంతో హోటళ్లు, షాపులకు వెళ్లే సమయం చాలా మందికి దొరకడం లేదు. దీంతో వినియోగదారుల అవసరాలకు తగిన విధంగానే వ్యాపారులు తమ వ్యాపార పద్ధతులను మార్చుకున్నారు. వాహనాల్లో మొబైల్ హోటళ్లు, షర్బత్‌లు సిద్ధం చేస్తున్నారు. పచ్చళ్లు, కాయగూరలు, విద్యుత్ బల్బులు, స్వీట్లు, దుస్తులు, కొబ్బరి బొండాలు, ఐస్‌క్రీంలు, పలు రకాల పండ్లు కూడా ఆటోల ద్వారా విక్రయిస్తున్నారు.
దీని వల్ల వినియోగదారుల చెంతకే ఆహార పదార్థాలు చౌకైన ధరలకు అందడం ఒక విషయమైతే.. వ్యాపారులు కూడా ఒకే చోట ఉండి అ క్కడి పరిస్థితుల మీదనే ఆధార పడకుండా ఎక్కడ, ఏ సమయంలో వ్యాపారం జరుగుతుందంటే అక్కడ వాలిపోతున్నారు. ఫలితంగా వినియోగదారుల నుంచి ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం నగరంలో గజం స్థలం ధర చుక్కలంటడం, పైగా రోడ్డు పక్కన తోపుడు బండి పెట్టుకుందామన్నా పలు విధాల ఒత్తిళ్లు, మామ్మూళ్లు బెడద ఎక్కువైపోయింది.
వీటన్నింటిని నుంచి విముక్తితో పాటు కరెంటు, ఇంటి అద్దె వంటి తదితర ఇబ్బందులు లేకపోవడంతో ఈ మొబైల్ వ్యాపారమే చాలా భేషుగ్గా ఉందని వ్యాపారులు అంటున్నారు. వినియోగదారులు అయితే హోటల్‌కు వెళ్లి వేచి ఉండాల్సిన పని లేకుండా పనులకు వెళ్లే దారిలోనే టిఫిన్ కానిచ్చేస్తున్నారు. పండ్లు, ఇతర వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. ఇలాంటి వ్యాపారాలు జీవీఎంసీ పరిధి దక్షిణ నియోజకవర్గంలో కొకొల్లాలు. నగరంలోని సౌత్‌జైల్‌రోడ్డులో ఫుడ్ ఆన్ వీల్స్ ఘుమఘుమలు పంచుతున్నాయి. ప్రస్తుతం కరోనా కారణంగా వాటికి బ్రేక్ ఇచ్చారు. ఇక సాయంత్రమైతే చాలు.. చినవాల్తేరు, బీచ్‌రోడ్డు పలు ప్రాంతాల్లో ఫుడ్ ఆన్ వీల్స్.. వందలాది బండ్లు అక్కడకు చేరుకుంటాయి. చేతిలో కార్డు ఉండే చాలు.
చక చకా ఏం కావాలో అవి తినొచ్చు. ఏటీఎం డెబిట్/క్రెడిట్ కార్డ్స్‌తో పాటు పేటీఎం, గూగూల్ పే.. ఇలా ఎన్నో రకాలుగా నగదు చెల్లించేయొచ్చు. సాయంత్రం 4 నుంచి అర్ధరాత్రి వరకు (ప్రస్తుతం కర్ఫ్యూ అమల్లో ఉన్నందున రాత్రి 9 గంటల వరకే) ఇక్కడ టిఫిన్, నూడిల్స్, చికెన్ జాయింట్లు..ఫ్రైడ్ రైస్.. అన్ని రకాల చికెన్ వంటకాలతో పాటు చల్లని పానీయాలు కూడా మొబైల్ వ్యాన్ల ద్వారానే లభిస్తున్నాయి. మొత్తానికి ఈ బిజినెస్ ఇటు వినియోగదారులకు.. అటు వ్యాపారులకు ఇద్దరికీ సంతృప్తిని కలిగిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment