Byjus FY21 Losses Surge 20 Times After Change In Revenue, Know More Details Inside - Sakshi
Sakshi News home page

Byjus FY21 Audit Results: బైజూస్‌ ఆదాయం హైజంప్‌

Published Thu, Sep 15 2022 8:40 AM | Last Updated on Thu, Sep 15 2022 9:35 AM

Byju losses surge 20 times after change in revenue know details - Sakshi

న్యూఢిల్లీ: ఎడ్‌టెక్‌ దిగ్గజం థింక్‌ అండ్‌ లెర్న్‌ స్థూల ఆదాయం మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2021-22)లో నాలుగు రెట్లు దూసుకెళ్లింది. బైజూస్‌ బ్రాండుతో విద్యా సంబంధ సేవలందించే కంపెనీ రూ. 10,000 కోట్ల టర్నోవర్‌ ప్రకటించింది. కాగా.. 202021లో నష్టాలు రూ. 4,588 కోట్లకు పెరిగినట్లు కంపెనీ తాజాగా వెల్లడించింది. ఈ కాలంలో రూ. 2,428 కోట్ల ఆదాయం సాధించినట్లు తెలియజేసింది. కొద్ది నెలల ఆలస్యం తదుపరి కంపెనీ ఆడిటెడ్‌ ఫలితాలను విడుదల చేసింది. భారీ నష్టాలకు ప్రధానంగా వైట్‌హ్యాట్‌ జూనియర్‌ విభాగం ఆదాయం, నష్టాలను వాయిదా వేయడం, ఆదాయ మదింపులో చేపట్టిన మార్పులు కారణమైనట్లు బైజూస్‌ పేర్కొంది. 2019–20లో దాదాపు రూ. 232 కోట్ల నష్టం మాత్రమే నమోదైంది.

2020లో సాధించిన రూ. 2,511 కోట్లతో పోలిస్తే ఆదాయం సైతం 1 శాతం తగ్గినట్లు తెలియజేసింది. ఆదాయ నమోదును వాయిదా వేసినప్పటికీ వ్యయాల నమోదును కొనసాగించడంతో నష్టాలు భారీగా పెరిగినట్లు బైజూస్‌ సహవ్యవస్థాపకుడు, సీఈవో బైజు రవీంద్రన్‌ వివరించారు. అంతేకాకుండా వేగంగా వృద్ధి చెందుతున్నప్పటికీ నష్టాలు నమోదు చేస్తున్న వైట్‌హ్యాట్‌ జేఆర్‌ తదితర సంస్థల కొనుగోళ్లు కూడా ఇందుకు కారణమైనట్లు తెలియ జేశారు. అయితే గతేడాది లాభం లేదా నష్టం వివరాలు వెల్లడించక పోవడం గమనార్హం!  

తొలి 4 నెలల్లో జూమ్‌ 
2022 ఏప్రిల్‌-జులైలో సాధించిన రూ. 4,530 కోట్ల ఆదాయం 2021లో నమోదైన మొత్తం ఆదాయం కంటే అధికమని రవీంద్రన్‌ వెల్లడించారు. కీలక బిజినెస్‌ 150 శాతం పురోగమించినట్లు తెలియ జేశారు. ఆకాష్, గ్రేట్‌ లెర్నింగ్‌ సంస్థల కొనుగోళ్లు మంచి ఫలితాలను ఇస్తున్నట్లు పేర్కొన్నారు.  కొనుగోలు తదుపరి బిజినెస్‌లో రెట్టింపు వృద్ధి నమోదైనట్లు వెల్లడించారు. వైట్‌హ్యాట్‌ జేఆర్‌ మాత్రం అంతంత మాత్ర పనితీరును చూపుతున్నట్లు ప్రస్తావించారు. 50 కోట్ల డాలర్ల (సుమారు రూ. 4,000 కోట్లు) సమీకరణకు కంపెనీ నిర్వహిస్తున్న చర్చలు పురోగతిలో ఉన్నట్లు తెలియజేశారు. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం అబుధాబి సావరిన్‌ వెల్త్‌ ఫండ్స్‌ నుంచి 40–50 కోట్ల డాలర్లు, ఖతార్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీ నుంచి 25–35 కోట్ల డాలర్లు చొప్పున పెట్టుబడులను సమకూర్చుకునే వీలుంది. నిధులను 23 బిలియన్‌ డాలర్ల వేల్యుయేషన్‌తో సమీకరించనున్నట్లు తెలుస్తోంది. 

కొనుగోళ్లకు తాత్కాలిక బ్రేక్‌ 
స్థూల ఆర్థిక పరిస్థితుల కారణంగా ప్రస్తుతం ఇతర కంపెనీల కొనుగోళ్ల అంశాన్ని పక్కనపెట్టినట్లు రవీంద్రన్‌ తెలియజేశారు. కంపెనీ ఇప్పటికే బిలియన్‌ డాలర్లకు దేశీ సంస్థ ఆకాష్‌ను సొంతం చేసుకోగా.. సింగపూర్‌ సంస్థ గ్రేట్‌ లెర్నింగ్‌ను 60 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది. ఈ బాటలో యూఎస్‌ రీడింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ఎపిక్‌ను 50 కోట్ల డాలర్లకు, కోడింగ్‌ సైట్‌ టింకర్‌ను 20 కోట్ల డాలర్లకు చేజిక్కించుకుంది. ఆస్ట్రియా గణిత శాస్త్ర సంస్థ జియోజెబ్‌డ్రాను 10 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది. కంపెనీలో ప్రస్తుత ఉపాధ్యాయుల సంఖ్య 20,000కాగా వచ్చే ఏడాదిలో మరో 10,000 మందిని జత చేసుకునే ప్రణాళికల్లో బైజూస్‌ ఉంది. కంపెనీలో మొత్తం సిబ్బంది సంఖ్య ప్రస్తుతం 50,000కు చేరింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement