What Is SWP (Systematic Withdrawal Plan) In Mutual Fund? Benefits Of A Systematic Withdrawal Plan - Sakshi
Sakshi News home page

ఎస్‌డబ్ల్యూపీ అంటే? నెక్ట్స్‌ మంత్‌ నుంచే ఆదాయం పొందొచ్చా?       

Published Mon, Aug 21 2023 9:53 AM | Last Updated on Mon, Aug 21 2023 12:45 PM

Do you know how to earn profits Systematic Withdrawal Plan - Sakshi

ఎస్‌డబ్ల్యూపీ అంటే ఏంటి? ఓ పథకంలో పెట్టుబడి పెట్టి, తదుపరి నెల నుంచి ఎస్‌డబ్ల్యూపీ ద్వారా ఆదాయం పొందొచ్చా?  – కృతిక 
మార్కెట్ల అస్థిరతలను అధిగమించేందుకు వీలుగా క్రమంగా ఇన్వెస్ట్‌ చేసుకునేందుకు సిప్‌ ఎలా ఉపయోగపడుతుందో..? అదే మాదిరి.. సిస్టమ్యాటిక్‌ విత్‌డ్రాయల్‌ ప్లాన్‌ (ఎస్‌డబ్ల్యూపీ) అనేది, పెట్టుబడిని క్రమానుగతంగా వెనక్కి తీసుకునేందుకు వీలు కల్పిస్తుంది. మార్కెట్లు కనిష్టాల్లో (తక్కువ విలువల వద్ద) ఉన్నప్పుడు పెట్టుబడినంతా వెనక్కి తీసుకోకుండా ఎస్‌డబ్ల్యూపీ సాయపడుతుంది. రిటైర్మెంట్‌ తీసుకున్న వారికి ఎస్‌డబ్ల్యూపీ అనుకూలంగా ఉంటుంది. కావాల్సినంత స్థిరమైన ఆదాయం పొందే ఏర్పాటు చేసుకోవచ్చు. ఎన్ని రోజులకు ఒకసారి ఆదాయం రావాలన్నది నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉంటుంది. ఇన్వెస్టర్‌ ప్రతీ నెలా నిరీ్ణత తేదీన, నిరీ్ణత మొత్తాన్ని ఎస్‌డబ్ల్యూపీ ద్వారా రావాలని నిర్ణయించుకుంటే.. అదే రోజు ఆ మొత్తం బ్యాంకు ఖాతాకు జమ అవుతుంది. ఆ మేరకు పెట్టుబడుల నుంచి యూనిట్లు తగ్గిపోతాయి. సిప్‌కు విరుద్ధంగా పనిచేసేదే ఎస్‌డబ్ల్యూపీ.

ఇక్కడ రెండు కీలక అంశాలను గుర్తు పెట్టుకోవాలి. ఎస్‌డబ్ల్యూపీ కోసం చేసే పెట్టుబడుల్లో కనీసం మూడింట ఒక వంతు అయినా ఈక్విటీల్లో ఉంచుకోవాలి. ఉపసంహరించుకునే మొత్తం ఏటా పెట్టుబడుల విలువలో 4-6 శాతం మించి ఉండకూడదు. దీనివల్ల పెట్టుబడికి నష్టం లేకుండా ఉంటుంది. ఉదాహరణకు మీ పెట్టుబడులపై రాబడి వార్షికంగా 8-9 శాతంగా ఉండి, మీరు 5 శాతాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు అయితే.. అప్పుడు మిగిలిన 3-4 శాతం రాబడి పెట్టుబడి వృద్ధికి తోడ్పడుతుంది. దీనివల్ల మీ పెట్టుబడి విలువ క్షీణించకుండా ఉంటుంది. ఎస్‌డబ్ల్యూపీ ద్వారా ఉపసంహరించుకునే మొత్తంలో కొంత పెట్టుబడి, కొంత లాభం ఉంటుంది. ఈ లాభంపైనే పన్ను పడుతుంది. డెట్‌లో అయితే కాలవ్యవధితో సంబంధం లేకుండా లాభం వ్యక్తిగత ఆదాయానికి కలుస్తుంది. ఈక్విటీల్లో అయితే ఏడాదిలోపు లాభంపై 15 శాతం చెల్లించాలి. ఏడాదికి మించిన లాభం మొదటి రూ.లక్షపై పన్ను లేదు. తదుపరి లాభంపై 10 శాతం పన్ను పడుతుంది.(ఊరట: వచ్చే నెల నుంచి కూరగాయల రేట్లు తగ్గుముఖం)

ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ (ఎఫ్‌వోఎఫ్‌) ఎలా పనిచేస్తాయి? వీటి వల్ల లాభాలేంటి?   – రవీంద్రనాథ్‌ 
ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ (ఎఫ్‌వోఎఫ్‌) అంటే సమీకరించిన పెట్టుబడులను తీసుకెళ్లి మరో మ్యూచువల్‌ ఫండ్‌ పథకంలో ఇన్వెస్ట్‌ చేసే పథకం. పెట్టుబడుల విధానానికి అనుగుణంగా డెట్‌ ఫండ్స్‌ లేదా ఈక్విటీ ఫండ్స్‌లో ఒకటి లేదా ఒకటికి మించిన పథకాల్లో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. సాధారణంగా ఎఫ్‌వోఎఫ్‌లను ఆయా ఫండ్స్‌ హౌస్‌లు వాటికి సంబంధించిన ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్ట్‌ చేసేందుకు ప్రారంభిస్తుంటాయి. ఎఫ్‌వోఎఫ్‌లు ఇతర మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల మాదిరే పనిచేస్తాయి. వీటిల్లోనూ సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) రూపంలో పెట్టుబడి పెట్టుకోవచ్చు. విదేశీ సూచీలు, విదేశీ మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల్లో ఇన్వెస్ట్‌ చేసే ఎఫ్‌వోఎఫ్‌లు కూడా ఉన్నాయి. ఇతర పథకాల మాదిరే ఎఫ్‌వోఎఫ్‌ల్లోనూ ఎక్స్‌పెన్స్‌ రేషియో ఉంటుంది. ఎఫ్‌వోఎఫ్‌లు ఇతర పథకాల్లో ఇన్వెస్ట్‌ చేస్తాయి కనుక రెండింటిలోనూ ఎక్స్‌పెన్స్‌ రేషియో భారం ఇన్వెస్టర్‌పైనే పడుతుంది.

ఉదాహరణకు ఎఫ్‌వోఎఫ్‌లో 1 శాతం ఎక్స్‌పెన్స్‌ రేషియో ఉందనుకుంటే, అది ఇన్వెస్ట్‌ చేసే పథకం ఎక్స్‌పెన్స్‌ రేషియో 0.50 శాతం ఉంటే మొత్తం 1.5 శాతం ఎక్స్‌పెన్స్‌ రేషియో చెల్లించాల్సి వస్తుంది. ఎఫ్‌వోఎఫ్‌ ఇన్వెస్ట్‌ చేసే పథకంలో నేరుగా ఇన్వెస్టర్లు పెట్టుబడులకు అవకాశం లేనప్పుడు వీటిని పరిశీలించొచ్చు. ఎఫ్‌వోఎఫ్‌లను నాన్‌ ఈక్విటీ పథకంగా పరిగణిస్తారు. కనుక డెట్‌ పథకాలకు మాదిరే మూలధన లాభాలపై పన్ను అమలవుతుంది. ఒకవేళ ఎఫ్‌వోఎఫ్‌ దేశీయ ఈక్విటీ పథకాల్లోనే 90 శాతానికిపైగా పెట్టుబడి పెడితే ఈక్విటీకి మాదిరే మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది.  ఎస్‌డబ్ల్యూపీతో స్థిరమైన ఆదాయం పొందొచ్చా? 


ధీరేంద్ర కుమార్‌ - సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement