సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ అనగానే.. నష్టాలు, అప్పులు, ఆలస్యంగా తిరిగే ట్రిప్పులు, డొక్కు బస్సులు.. ఇలాంటివి చాలామందికి మదిలో మెదులుతాయి. కానీ, కొంతకాలంగా కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్న సంస్థ తనను తాను మార్చుకుంటూ వస్తూ ఇప్పుడు అరుదైన రికార్డు సృష్టించింది. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీపై సమీక్ష నిర్వహిస్తున్న తరుణంలో కేవలం నాలుగు డిపోలు మాత్రమే ఖర్చులను మించి ఆదాయాన్ని సాధించాయన్న విషయం అధికారులు ఆయన ముందుంచారు.
తాజాగా ఆర్టీసీ చేసిన ఫీట్ ఏంటంటే.. ఆర్టీసీలో 96 డిపోలు ఉండగా, గత సోమవారం (సెప్టెంబరు 11) రికార్డు స్థాయిలో 90 డిపోలు నిర్వహణ ఖర్చుల కంటే ఎక్కువ ఆదాయాన్ని పొందాయి. ఇక ఈనెల సెప్టెంబర్ 11వ తేదీ వరకు వరసగా 71 డిపోలు లాభాల(నిర్వహణ ఖర్చులను మించి)ను ఆర్జించాయి. టీఎస్‌ఆర్టీసీ చరిత్రలో తొలిసారి ఈ రెండు ఫీట్లు నమోదయ్యాయి. ప్రభుత్వంలో విలీనం అవుతున్న నేపథ్యంలో మంచి ఊపుమీద ఉన్న ఆర్టీసీ ఉద్యోగులు, కలిసికట్టుగా, పక్కా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ఈ రికార్డులను సాధించటం విశేషం.
ఫలితాన్నిస్తోన్న ‘ఆల్ డిపోస్ ప్రాఫిట్ చాలెంజ్’
‘ఆల్ డిపోస్ ప్రాఫిట్ చాలెంజ్’పేరుతో కొద్ది రోజులుగా ఆర్టీసీ అమలు చేస్తున్న ప్రత్యేక ప్రణాళిక ఇప్పుడు ఈ రూపంలో సరికొత్త ఫలితాలని అందించింది. సాధారణంగా సోమవారం రోజు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. సాధారణ సోమవారాల్లో రూ.16–రూ.17 కోట్ల మేర ఆదాయం వస్తుండగా, ఈనెల 11న (చివరి ‘శుభముహూర్త’సోమవారం) ఏకంగా రూ.20.22 కోట్ల ఆదాయం నమోదైంది.
♦ సోమవారం రోజున ముషీరాబాద్–2, ఉట్నూరు, కోస్గి, భైంసా, మిధాని, నారాయణ్‌ఖేడ్ డిపోలు మినహా మిగతా 90 డిపోలు నిర్వహణ ఖర్చులను మించి ఆదాయాన్ని పొందాయి. నారాయణఖేడ్ డిపో ఖర్చు కంటే కేవలం రూ.వేయి మాత్రమే తక్కువ ఆదాయాన్ని పొందింది. నష్టాలు పొందిన మిగతా ఐదు డిపోలు కూడా రూ.22 వేల నుంచి రూ.1.45 లక్షల నష్టాన్ని మాత్రమే పొందటం గమనార్హం.
♦ ఆర్టీసీలో సాధారణంగా కొన్ని బస్సులను స్పేర్‌లో ఉంచుతారు. మరికొన్ని మరమ్మతు కోసం పక్కన పెడతారు. శ్రావణ శుభముహూర్తాల నేపథ్యంలో అస్సలు నడవలేని డొక్కు బస్సులు తప్ప అన్నింటినీ బాగుచేసి రోడ్డెక్కించారు. 11న ఆక్యుపెన్సీ రేషియో 85.19 శాతంగా నమో దైంది. సాధారణ రోజులతో పోలిస్తే గత పది రోజుల్లో కనీసం 5 శాతం వరకు పెరిగిందని ఆర్టీసీ పేర్కొంటోంది.
♦ కొన్ని మార్గాల్లో ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది, కొన్ని రూట్లలో తక్కువగా ఉంటుంది. డెడికేటెడ్ సరీ్వ సుల పేరుతో, ఆక్యుపెన్సీ రేషియో తక్కువగా ఉండే మార్గాల్లోనూ బస్సులు తిప్పే అలవాటు ఉండేది. ఇప్పుడు, ప్రయాణికుల డిమాండ్ ఎక్కువగా ఎటు ఉందో ఆయా మార్గాల్లోనే ఎక్కువ బస్సులు తిప్పుతున్నారు. గత పక్షం రోజులుగా రోజువారీ ఆదాయం దాదాపు రూ.కోటిన్నర మేర పెరిగింది.
♦ ఇటీవలే దాదాపు 650 కొత్త సూపర్ లగ్జరీ బస్సులు, 200 డీలక్స్ బస్సులు చేతికందాయి. వాటిని పూర్తి సామర్ధ్యంతో తిప్పుతున్నారు. సాధారణ రోజుల్లో 28 లక్షల కి.మీ. మేర బస్సులను తిప్పుతుండగా 11న 34 లక్షల కి.మీ. తిప్పారు.
♦ ఇతర సిబ్బందికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించి ప్రధాన పాయింట్ల వద్ద వినియోగించారు. దీనివల్ల సమయానుకూలంగా బస్సులు, రావటం, వచ్చిన బస్సుల్లో ఎక్కువ మంది ఎక్కేలా చూడటం, ప్రైవేటు వాహనాల వైపు వెళ్లేవారిని మళ్లించటం లాంటివి జరిగాయి.
♦ సెలవులను నియంత్రించి వీలైనంతమంది సిబ్బంది విధుల్లో ఉండేలా చూశారు.
Comments
Please login to add a commentAdd a comment