ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిత్యం వార్తలు, కథనాలు వండి వార్చే ఒక మీడియా, తెలంగాణలో ఒక ఆసక్తికరమైన కథనాన్ని ఇచ్చింది. తెలంగాణలో కూడా ఆర్టిసి ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆ వార్త ఇచ్చారు.
అందులో ఎపి ప్రభుత్వానికి, ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కితాబు ఇవ్వడానికి కాకుండా అక్కడి ముఖ్యమంత్రిని ఎద్దేవ చేయడానికి ఆ కథనాన్ని ఇచ్చారని అర్ధం అవుతోంది. ఎపిలో ఆర్టిసి ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అది సాధ్యం కాని పని అని వ్యాఖ్యానించిన విషయాన్ని ఈ పత్రిక గుర్తు చేసింది.
వైరల్‌గా సీఎం కేసీఆర్ వీడియో
అంతేకాక ఆయన ఇలా అన్నారట. 'ఆర్టిసిని గవర్నరమెంట్ లో కలపడమనే ఒక అసంబద్దమైన, అర్థరహితమైన నినాదాన్ని పట్టుకుంటారా? అదో నినాదమా.. నాకర్దం కాదు. ఒక పనికిమాలిన, పిచ్చి రాజకీయ పార్టీలు తలకకాయమాసినోడు, నెత్తిన మాసినోడు, గీళ్లా.. నాకర్దం కాదు. అర్ధం ఉండాలి. భూ గోళం ఉన్నంతవరకు అది జరగదు.
ఎపి ప్రభుత్వం ఏమి చేస్తుందో చూద్దాం. అది ఒక ప్రయోగం. అక్కడ ఏ మన్ను జరగలేదు. అది అయ్యే పని కాదు.. అని కెసిఆర్ అప్పట్లో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయని పేర్కొన్నారు. తెలంగాణలో ఆర్టిసి ఉద్యోగులు సమ్మె చేసిన నేపధ్యంలో ఆయన అప్పట్లో అలా అభిప్రాయ పడ్డారు.
కాని జగన్ ప్రభుత్వం ఆర్టిసిని విలీనం చేయడమే కాకుండా, విజయవంతంగా గత కొద్ది సంవత్సరాలుగా అమలు చేస్తోంది. దీంతో ఆర్టిసి పై జీతాలు, తదితర వ్యయ భారం తగ్గింది. ఆర్టిసి లాభాలు ఆర్జించడానికి ఆస్కారం ఏర్పడింది. ఈ విషయాన్ని తెలంగాణలోని ఆర్టిసి ఉద్యోగులు గమనిస్తున్నారు.
కేసీఆర్ వైఖరిలో మార్పునకు కారణమిదే..
ఎపిలో విలీనం జరిగినప్పుడు తెలంగాణలో ఎందుకు సాధ్యం కాదని వారు ప్రశ్నించుకుంటున్నారు. తెలంగాణలో ఎన్నికలు జరగనున్న తరుణంలో కెసిఆర్ వైఖరి మారిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఆర్టిసి ఉద్యోగ కుటుంబాలలో సుమారు రెండున్నర లక్షల ఓట్లు ఉంటాయని అంచనా.
వారిలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని, దానిని పోగొట్టడానికి కెసిఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని విశ్లేషిస్తున్నారు. ఇది చివరివరకు జరుగుతుందా? లేదా? అన్న సంశయాన్ని కార్మికులు వ్యక్తం చేస్తున్నారట. అయితే మంత్రి కెటిఆర్ ఇప్పటికే ఆర్టిసి డిపోల వద్ద సంబరాలు జరపాలని పిలుపు ఇచ్చారు.
(చదవండి: హైదరాబాద్‌లో పార్కింగ్ పరేషాన్! కేటీఆర్‌కు ట్వీట్.. ఇలా చేస్తే బెటర్!)
దాచేస్తే దాగుతుందా?
సహజంగానే ఈ వార్తకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఎపి ప్రభుత్వంపై ఈ మధ్య కొన్నిసార్లు కెసిఆర్ ఒకింత వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం, వాటిని తెలుగుదేశం మీడియా ఎపిలో కూడా పనికట్టుకుని ప్రచురించి జగన్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని యత్నించడం తెలిసిన సంగతే.
ఇదే సమయంలో ఎపి ప్రభుత్వం చేసే మంచి పనులను మాత్రం ఎక్కడ కనిపించకూడా చూడాలన్నది ఈ మీడియా యత్నం. దాచేస్తే దాగదు నిజం అని నానుడి. అలాగే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఎపిలో చేసిన కొన్ని కార్యక్రమాలను అమలు చేయడానికి ముందుకు వస్తోంది. అది తప్పేమి కాదు. దేశంలో ఏ రాష్ట్రంలో ఏ మంచి జరిగినా దానిని ఎవరైనా ఆచరించవచ్చు.
ఎపిలో స్కూళ్లను బాగు చేసిన తీరును గమనించిన కెసిఆర్ ప్రభుత్వం కూడా అదే తరహాలో స్కీమును ప్రకటించి నిధులు కేటాయించింది. ఎపిలో గ్రామ సచివాలయ వ్యవస్థను పరిశీలించిన తమిళనాడు ప్రభుత్వం అక్కడ కూడా ఆ వ్యవస్థను చేపడుతోంది. ముందుగా 600 చోట్ల ఆ గ్రామ సచివాలయాల ఏర్పాటుకు పూనుకుంది.
ఎపిలో ఉన్న వలంటీర్ల వ్యవస్థ దేశ వ్యాప్తంగా ప్రశంసలు పొందుతోంది. రైతు భరోసా కేంద్రాలను పరిశీలించిన పలువురు కేంద్ర మంత్రులు, కేంద్ర అధికార బృందాలు వాటి పనితీరును ప్రశంసిస్తున్నారు. కేరళ ప్రభుత్వ అధికారులు వచ్చి పరిశీలించి వెళ్లారు. ఆరోగ్య వసతులలో దేశంలోనే ఎపి ముందంజలో ఉందని ఆరోగ్య యాజమాన్య సమాచార వ్యవస్థ ప్రకటించింది.
జనాభా ప్రాతిపదిక చూసుకుంటే ఈ స్థానం వచ్చింది. అంకెల వారీగా చూస్తే దక్షిణాదిలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఎపిలో 13,432 ప్రభుత్వ ఆరోగ్య వసతులు ఉన్నాయని ఆ సంస్థ తెలిపింది. అభివృద్ది రేటులో అగ్రభాగాన ఉన్న రాష్ట్రాలలో ఎపి కూడా ఉంది.
(చదవండి: TSRTC: నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి ప్రభుత్వంలో విలీనంతో ఊపిరి )
నెగిటివ్ భావాలే వెళ్లాలని ఉబలాటం
అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఎపిలోని జగన్ ప్రభుత్వం వరసగా మూడో సంవత్సరం కూడా మొదటి ర్యాంకు సాధించింది. అయినా తెలుగుదేశం మీడియా ప్రభుత్వంపై విషపూరిత ప్రచారం చేస్తూ ప్రజలలోకి నెగిటివ్ భావాలే వెళ్లాలని విశ్వయత్నం చేస్తోంది.
ఎపిలో పలు కొత్త వ్యవస్థలు, సరికొత్త నిర్ణయాలతో జగన్ ప్రభుత్వం ముందుకు వెళుతుంటే, కొంతమంది వాటిని జనం మర్చిపోయేలా చేయాలని కృషి చేస్తున్నారు. కొసమెరుపు ఏమిటంటే తెలంగాణ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కెసిఆర్ ను ఎద్దేవ చేయడానికి ఎపిలో జరిగిన ఆర్టిసి విలీనం విషయాన్ని ఈ మీడియా వాడుకుందే తప్ప, ఎపిలో జరిగింది మంచి పని అని, ఆ క్రెడిట్ ముఖ్యమంత్రి జగన్ కు దక్కుతుందని కాని ఒక్క ముక్క రాయలేదు.
కనీసం జగన్ పేరు ను కూడా ప్రస్తావించకుండా జాగ్రత్తపడ్డారు. దానికి కారణం ఆ మీడియా ఎపిలో జగన్ కు వ్యతిరేకంగా పనిచేస్తోంది. తెలుగుదేశం కు బాకా ఊదుతోంది. తెలంగాణలో కెసిఆర్ కు వ్యతిరేకం అయినా, కాకపోయినా, రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉన్న కాంగ్రెస్ పార్టీకి బాసటగా నిలబడాలన్న తపనతో ఉందని చెబుతారు. దానికి రీజన్ ఎవరికివారే ఊహించుకోవచ్చు.
-కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment