సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులకు బకాయి ఉన్న రెండు వేతన సవరణల్లో ఒకదాన్ని ప్రకటించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. 2017, 2021లకు సంబంధించి పీఆర్‌సీలు పెండింగులో ఉండగా, 2017కు సంబంధించిన వేతనాల ను సవరించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనను సీఎం కేసీఆర్ ముందుకు ఆర్టీసీ చైర్మన్ తెచ్చినట్టు సమాచారం. విషయంపై చర్చించేందుకు సీఎం అనుమతించటంతో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఈడీ, సీపీఎం, ఫైనాన్స్ అడ్వయిజర్లు మంగళవారం సాయంత్రం ప్రగతిభవన్ వెళ్లారు. అయితే మరో ముఖ్యమైన పనిలో సీఎం బిజీగా ఉండటంతో అపాయింట్‌మెంట్ దక్కలేదు. వారిని బుధవారం రావాల్సిందిగా అక్కడి అధికారులు సూచించారు. దీనిపై సీఎంతో చర్చించిన తర్వాత ఫిట్‌మెంట్ విషయమై స్పష్టత రానుంది.
ఐదేళ్లుగా ఇంటీరియమ్ రిలీఫ్ పైనే..
రాష్ట్రం ఆవిర్భవించిన వెంటనే 2015లో ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు అత్యధికంగా 44 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. 2013కు సంబంధించిన వేతన సవరణను రెండేళ్ల తర్వాత, ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేసిన దానికంటే ఎక్కువగా ప్రభుత్వం ప్రకటించింది. దానికి సంబంధించిన బకాయిల్లో 50 శాతం మొత్తాన్ని బాండ్ల రూపంలో ఇవ్వనున్నట్టు అప్పట్లో ప్రకటించింది. అయితే ఆ మొత్తాన్ని ఇప్పటివరకు చెల్లించలేదు. 2017లో మరోసారి వేతన సవరణ జరగాల్సి ఉన్నా, సకాలంలో చేయకపోవటంతో అప్పట్లో కారి్మకులు సమ్మెకు పిలుపునిచ్చారు.
ప్రభుత్వం ఆ సమయంలో నాటి మంత్రి కడియం శ్రీహరి ఆధ్వర్యంలో మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. కారి్మక సంఘాలతో పలుమార్లు చర్చించిన కమిటీ, వేతన సవరణ చేసేవరకు ఇంటీరియమ్ రిలీఫ్(ఐఆర్) ఇస్తామని తెలిపింది. దీనికి కారి్మక నేతలు అంగీకరించటంతో, ప్రభుత్వం 16 శాతం ఐఆర్‌ను ప్రకటించింది. ఇప్పటికీ అదే అమలవుతోంది. దానికి మరికొంత కలిపి 30 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించాలని ఉద్యోగులు అప్పటి నుంచి డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఈలోపు మరో వేతన సవరణ గడువు 2021 దాటిపోయింది.
2013 నాటి వేతన సరవణ బకాయిలు సగం వరకు పెండింగులో ఉండటం, 2017 వేతన సవరణ చేయకుండా ఐఆర్‌తో సరిపుచ్చటం, 2021 వేతన సవరణ ఊసే ఎత్తకపోవటంతో ఆర్టీసీ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఒక వేతన సవరణను ప్రకటించాలని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి కోరుతూ వస్తున్నారు. తాజాగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లటంతో, చర్చించేందుకు ఆయనను, అధికారులను పిలిచారు. బుధవారం దీనిపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.
చదవండి: ఏడేళ్ల ‘బడి ’కల.. 4 లక్షల మంది ఎదురు చూపు.. నోటిఫికేషన్ జాడేది?
Comments
Please login to add a commentAdd a comment