revision
-
ప్రొఫెసర్లకు పునశ్చరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న వివిధ విభాగాల అధిపతులు, సీనియర్ ప్రొఫెసర్లకు ప్రత్యేక ఓరియంటేషన్ కార్యక్రమాలు నిర్వహించాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. సెప్టెంబర్ 21 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించాలని భావిస్తున్నామని మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి తెలిపారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ పునశ్చరణ బాధ్యతలు తీసుకుంటోందని వెల్లడించారు. ఇటీవల జరిగిన ఉన్నత విద్య పాలక మండలి సమావేశంలో ఈ మేరకు చర్చించినట్టు స్పష్టం చేశారు. ఈ వివరాలను లింబాద్రి మంగళవారం మీడియాకు వివరించారు. అధ్యాపకుల ఆలోచనా ధోరణిని విస్తృతపర్చేందుకు.. దేశవ్యాప్తంగా ఉన్నత విద్య కోర్సు ల్లో అనేక మార్పులు చోటు చేసు కుంటున్నాయి. అంతర్జాతీయ విద్యా ప్రమాణాల వైపు వెళ్ళాలనే ఆకాంక్ష బలపడుతోంది. ప్రపంచంలోని ప్రఖ్యాత యూనివర్సిటీలు కూడా ఆన్లైన్ కోర్సులను అందిస్తున్నాయి. డిజిటల్ యూనివర్సిటీ ప్రాధ్యానత అన్ని స్థాయిలను ఆకర్షిస్తోంది. వివిధ సబ్జెక్టుల మేళవింపుతో, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా శాస్త్రీయ విద్యా విధానం విస్తృత స్థాయిలో అందుబాటులోకి వస్తోంది. మరోవైపు ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకూ కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. స్వదేశీ యూనివర్సిటీలు వీటి పోటీని తట్టుకుని నిలబడాల్సిన అవసరం ఏర్పడింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మన రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఉన్న అధ్యాపకుల ఆలోచనాధోరణిని మరింత విస్తృతపర్చేందుకు ప్రత్యేక ఓరియంటేషన్ చేపడుతున్నట్టు లింబాద్రి తెలిపారు. శిక్షణ ఇలా... విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ప్రధాన విభాగాల ముఖ్య అధికారులను వర్సిటీల వీసీలతో కలిసి ఉన్నత విద్యా మండలి ఎంపిక చేస్తుంది. ఇలా అన్ని యూనివర్శిటీల నుంచి తొలి దశలో వంద మందిని ఎంపిక చేసే అవకాశం ఉంది. సీనియర్ అధ్యాపకుడు భవిష్యత్‌లో ఉన్నత విద్యలో కీలకపాత్ర పోషిస్తాడు. ఈ కారణంగా బోధనపై నవీన మెళకువలే కాకుండా, నాయకత్వ లక్షణాలు అవసరం. గ్లోబల్ లీడర్‌గా ఉన్నత విద్యను అర్థం చేసుకునే స్థాయి కల్పిస్తారు. మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఈ దిశగా ప్రత్యేక ఓరియంటేషన్ మెళకువలను నిష్ణాతులు రూపొందిస్తారు. వీటిని అనుభజ్ఞులైన అధికారులు పరిశీలిస్తా రు. అర్థమయ్యేలా వివరించే అధికారులతో ప్రత్యేక బోధన తరగతులు నిర్వహిస్తారు. అధ్యాపకులతో మొదలయ్యే ఈ పునశ్చరణ తరగతులు తర్వాత దశలో వీసీల వరకూ విస్తరించాలని భావిస్తున్నారు. -
TS: ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వేతన సవరణకు సీఎం సానుకూలత!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులకు బకాయి ఉన్న రెండు వేతన సవరణల్లో ఒకదాన్ని ప్రకటించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. 2017, 2021లకు సంబంధించి పీఆర్సీలు పెండింగులో ఉండగా, 2017కు సంబంధించిన వేతనాల ను సవరించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనను సీఎం కేసీఆర్ ముందుకు ఆర్టీసీ చైర్మన్ తెచ్చినట్టు సమాచారం. విషయంపై చర్చించేందుకు సీఎం అనుమతించటంతో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఈడీ, సీపీఎం, ఫైనాన్స్ అడ్వయిజర్లు మంగళవారం సాయంత్రం ప్రగతిభవన్ వెళ్లారు. అయితే మరో ముఖ్యమైన పనిలో సీఎం బిజీగా ఉండటంతో అపాయింట్మెంట్ దక్కలేదు. వారిని బుధవారం రావాల్సిందిగా అక్కడి అధికారులు సూచించారు. దీనిపై సీఎంతో చర్చించిన తర్వాత ఫిట్మెంట్ విషయమై స్పష్టత రానుంది. ఐదేళ్లుగా ఇంటీరియమ్ రిలీఫ్ పైనే.. రాష్ట్రం ఆవిర్భవించిన వెంటనే 2015లో ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు అత్యధికంగా 44 శాతం ఫిట్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. 2013కు సంబంధించిన వేతన సవరణను రెండేళ్ల తర్వాత, ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేసిన దానికంటే ఎక్కువగా ప్రభుత్వం ప్రకటించింది. దానికి సంబంధించిన బకాయిల్లో 50 శాతం మొత్తాన్ని బాండ్ల రూపంలో ఇవ్వనున్నట్టు అప్పట్లో ప్రకటించింది. అయితే ఆ మొత్తాన్ని ఇప్పటివరకు చెల్లించలేదు. 2017లో మరోసారి వేతన సవరణ జరగాల్సి ఉన్నా, సకాలంలో చేయకపోవటంతో అప్పట్లో కారి్మకులు సమ్మెకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఆ సమయంలో నాటి మంత్రి కడియం శ్రీహరి ఆధ్వర్యంలో మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. కారి్మక సంఘాలతో పలుమార్లు చర్చించిన కమిటీ, వేతన సవరణ చేసేవరకు ఇంటీరియమ్ రిలీఫ్(ఐఆర్) ఇస్తామని తెలిపింది. దీనికి కారి్మక నేతలు అంగీకరించటంతో, ప్రభుత్వం 16 శాతం ఐఆర్‌ను ప్రకటించింది. ఇప్పటికీ అదే అమలవుతోంది. దానికి మరికొంత కలిపి 30 శాతం ఫిట్మెంట్ ప్రకటించాలని ఉద్యోగులు అప్పటి నుంచి డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఈలోపు మరో వేతన సవరణ గడువు 2021 దాటిపోయింది. 2013 నాటి వేతన సరవణ బకాయిలు సగం వరకు పెండింగులో ఉండటం, 2017 వేతన సవరణ చేయకుండా ఐఆర్‌తో సరిపుచ్చటం, 2021 వేతన సవరణ ఊసే ఎత్తకపోవటంతో ఆర్టీసీ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఒక వేతన సవరణను ప్రకటించాలని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి కోరుతూ వస్తున్నారు. తాజాగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లటంతో, చర్చించేందుకు ఆయనను, అధికారులను పిలిచారు. బుధవారం దీనిపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. చదవండి: ఏడేళ్ల ‘బడి ’కల.. 4 లక్షల మంది ఎదురు చూపు.. నోటిఫికేషన్ జాడేది? -
జేఈఈ అడ్వాన్స్డ్: విజయానికి యాభై రోజులు
జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు సాధించి.. ప్రతిష్టాత్మక ఐఐటీల్లో బీటెక్‌లో చేరడం దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థుల కల! తమ స్వప్నం సాకారం దిశగా కసరత్తును ముమ్మరం చేయాల్సిన కీలక సమయం ఆసన్నమైంది! ఎందుకంటే.. జేఈఈ అడ్వాన్స్డ్–2021 తేదీ ఖరారైంది. అక్టోబర్ 3వ తేదీన పరీక్ష జరుగనుంది. అంటే.. పరీక్షకు ఇంకా యాభై రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. అభ్యర్థులు ఈ విలువైన సమయంలో తమ ప్రిపరేషన్‌కు పదును పెడుతూ.. ప్రణాళికబద్ధంగా, వ్యూహాత్మకంగా ముందుకుసాగాలి. అప్పుడే అడ్వాన్స్‌డ్‌లో విజయావకాశాలు మెరుగవుతాయి. ఈ నేపథ్యంలో.. జేఈఈ–అడ్వాన్స్‌డ్‌లో సక్సెస్ సాధించేందుకు నిపుణుల ప్రిపరేషన్ గైడెన్స్... విద్యార్థులు ఇంటర్లో చేరిన తొలిరోజు నుంచే జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంక్ కోసం కృషి చేస్తుంటారు. వాస్తవానికి పరీక్షకు నెల రోజులు ముందు సాగించే ప్రిపరేషన్ అత్యంత కీలకం అంటున్నారు నిపుణులు. రెండేళ్ల నుంచీ చదువుతున్నాం కదా.. అనే ధీమా ఎంతమాత్రం సరికాదని సూచిస్తున్నారు. ప్రస్తుతం సబ్జెక్ట్ వారీ ప్రిపరేషన్ షెడ్యూల్ రూపకల్పన మొదలు.. పరీక్ష రోజు వ్యవహరించాల్సిన తీరు వరకూ.. ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. అత్యంత శ్రద్ధతో, ఏకాగ్రతతో ప్రిపరేషన్ కొనసాగించాలి. ఇప్పటి వరకు చదివింది ఒక ఎత్తయితే.. ఇప్పుడు అందుబాటులో ఉన్న ఈ యాభై రోజుల్లో సాగించే ప్రిపరేషన్ ఐఐటీలకు దారి చూపుతుందని గుర్తించాలి. రివిజన్‌కు ప్రాధాన్యం ప్రస్తుతం జేఈఈ అడ్వాన్స్డ్ అభ్యర్థులు వీలైనంత ఎక్కువ సమయం పునశ్చరణకు కేటాయించాలి. 2019తో పోల్చుకుంటే గత ఏడాది, ఈ ఏడాది అడ్వాన్స్డ్ పరీక్షలు ఆలస్యంగా జరుగుతున్న విషయం తెలిసిందే. అంటే.. అడ్వాన్స్డ్ లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థులకు ప్రిపరేషన్‌కు ఎక్కువ సమయమే లభించింది. కాబట్టి ఇప్పటికే సీరియస్ అభ్యర్థులంతా సిలబస్ అంశాల ప్రిపరేషన్ పూర్తి చేసుకొని ఉంటారు. కాబట్టి ప్రస్తుత సమయంలో రివిజన్‌కు అధిక సమయం కేటాయించడం మేలు. ప్రతి సబ్జెక్ట్–ప్రతి రోజూ ► ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో రివిజన్ పరంగా.. విద్యార్థులు ప్రతి రోజు, ప్రతి సబ్జెక్ట్ రివిజన్ చేసేలా రోజువారీ ప్రణాళిక రూపొందించుకోవాలి. ప్రతి రోజూ తమ ప్రిపరేషన్ సమయాన్ని మూడు భాగాలుగా విభజించుకొని.. పరీక్షలో అడిగే మూడు సబ్జెక్ట్‌ల(మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ)కు కేటాయించాలి. ప్రతి సబ్జెక్ట్‌కు రోజుకు కనీసం నాలుగు గంటల సమయం కేటాయించుకోవాలి. ► ఆయా సబ్జెక్ట్‌కు కేటాయించిన నాలుగు గంటల్లో.. మూడు లేదా మూడున్నర గంటలు రివిజన్, ప్రాక్టీస్ చేయాలి. మిగతా సమయాన్ని ఆ రోజు అప్పటివరకు చదివిన సదరు సబ్జెక్ట్ అంశాల స్వీయ విశ్లేషణ చేసుకోవాలి. తద్వారా సదరు టాపిక్‌లో తమ బలాలు, బలహీనతలపై అవగాహన ఏర్పడుతుంది. బలహీనంగా ఉన్న టాపిక్స్‌కు పరీక్షలో ఎక్కువ వెయిటేజీ ఉందని భావిస్తే.. వాటిలోని ముఖ్యాంశాల(కాన్సెప్ట్‌లు, ఫార్ములాలు)పై దృష్టి పెట్టాలి. వీలైతే పూర్తి అభ్యసనం.. లేదంటే.. ముఖ్య ఫార్ములాలు, కాన్సెప్ట్‌లకు, సినాప్సిస్కు సమయం కేటాయించాలి. కచ్చితత్వం ఆయా సిలబస్ టాపిక్స్‌పై విద్యార్థులు సంపూర్ణ అవగాహన పెంచుకోవాలి. సదరు అంశం నుంచి ఎలాంటి ప్రశ్నలు అడిగినా.. పూర్తి కచ్చితత్వంతో సమాధానాలు సాధించేలా పట్టు బిగించాలి. అందుకోసం సంబంధిత టాపిక్ నుంచి ప్రశ్నలను ఒకటికి రెండుసార్లు ప్రాక్టీస్ చేయాలి. పలు ప్రశ్నలకు పొరపాటు సమాధానాలు ఇచ్చామని భావిస్తే.. సదరు టాపిక్ కోసం మరింత ఎక్కువ సమయం కేటాయించాలి. పాత ప్రశ్న పత్రాలు ప్రస్తుత సమయంలో అభ్యర్థులు పాత ప్రశ్న పత్రాలను ఎక్కువగా సాధన చేయాలి. ఫలితంగా సబ్జెక్ట్ నైపుణ్యాలు మెరుగవుతాయి. పరీక్షలో ప్రశ్నలు అడుగుతున్న తీరు, ప్రతి ఏటా ప్రశ్నల శైలిలో మార్పు వంటి విషయాలపై అవగాహన లభిస్తుంది. 25 నుంచి 30 వరకూ.. ప్రీవియస్, మోడల్ కొశ్చన్ పేపర్స్‌ను ప్రాక్టీస్ చేస్తే.. పరీక్షలో ఎలాంటి ప్రశ్నలు అడిగినా.. సమాధానాలు ఇచ్చే సంసిద్ధత లభిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. మాక్ టెస్ట్‌లు, గ్రాండ్ టెస్ట్‌లు విజయానికి చేరువయ్యేందుకు అనుసరించాల్సిన మరో వ్యూహం.. మాక్ టెస్ట్‌లు, గ్రాండ్ టెస్ట్‌లకు హాజరు కావడం. ఇందుకోసం విద్యార్థులు ప్రత్యేక సమయాన్ని కేటాయించుకోవాలి. పరీక్షకు ముందు పది రోజుల సమయాన్ని వీలైనంత మేరకు మాక్ టెస్ట్‌లు, గ్రాండ్ టెస్ట్‌లకు కేటాయించాలి. వీటి ఫలితాల ఆధారంగా తమ సామర్థ్యాల విషయంలో అవగాహన పొందాలి. ఫార్ములాలు, కాన్సెప్ట్‌లు అడ్వాన్స్డ్ విద్యార్థులు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ.. ఇలా మూడు సబ్జెక్ట్‌లకు సంబంధించి ముఖ్యమైన ఫార్ములాలు, కాన్సెప్ట్‌లు, సిద్ధాంతాలపై ప్రత్యేక దృష్టిపెట్టి ప్రిపరేషన్ సాగించాలి. అడ్వాన్స్‌డ్‌లో అడిగే ప్రశ్నలు నేరుగా కాకుండా.. కాన్సెప్ట్ ఆధారితంగా విభిన్నంగా ఉంటాయి. కాబట్టి విద్యార్థులు కాన్సెప్ట్‌లను అవపోసన పడితే.. పరీక్షలో ప్రశ్నలు పరోక్షంగా అడిగినా.. సమాధానం ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది. ప్రశ్నల సరళి, మార్కింగ్ పరీక్షలో అడిగే ప్రశ్నల సరళి, మార్కింగ్ విధానాన్ని కూడా విద్యార్థులు పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సింగిల్ కరెక్ట్ కొశ్చన్స్; మల్టిపుల్ ఛాయిస్ కొశ్చన్స్; పేరాగ్రాఫ్ ఆధారిత ప్రశ్నలను సాధన చేయాలి. వీటిలో రాణించాలంటే.. కాన్సెప్ట్ ఆధారిత ప్రశ్నలు, అప్లికేషన్ ఓరియెంటేషన్‌తో ప్రిపరేషన్ పూర్తి చేసుకుని.. అలాంటి ప్రశ్నలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. సబ్జెక్ట్ వారీగా.. ఇలా ► మ్యాథమెటిక్స్: కోఆర్డినేట్ జామెట్రీ, త్రికోణమితి, డిఫరెన్షియల్ కాలిక్యులస్, ఇంటిగ్రల్ కాలిక్యులస్, మాట్రిక్స్ అండ్ డిటర్మినెంట్స్, పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ప్రాబబిలిటీ, వెక్టార్స్, కాంప్లెక్స్ నెంబర్స్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ► కెమిస్ట్రీ: కెమికల్ బాండింగ్, ఆల్కైల్ హలైడ్; ఆల్కహాల్ అండ్ ఈథర్, కార్బొనైల్ కాంపౌండ్స్, అటామిక్ స్ట్రక్చర్ అండ్ న్యూక్లియర్ కెమిస్ట్రీ, థర్మోడైనమిక్స్ అండ్ థర్మో కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ► ఫిజిక్స్: ఎలక్ట్రో డైనమిక్స్; మెకానిక్స్; హీట్ అండ్ థర్మో డైనమిక్స్, ఎలక్ట్రిసిటీపై ఎక్కువ దృష్టిపెట్టాలి. మెయిన్‌కు హాజరవుతుంటే జేఈఈ–మెయిన్ మూడు సెషన్లలో ఆశించిన స్థాయిలో మార్కులు రాలేదనే ఉద్దేశంతో చాలామంది విద్యార్థులు జేఈఈ–మెయిన్ 4వ సెషన్‌కు హాజరవుతున్నారు. ఈ పరీక్షలు ఈ నెల(ఆగస్టు) 26, 27, 31 తేదీల్లో, సెప్టెంబర్ 1, 2 తేదీల్లో జరుగనున్నాయి. ► వీటికి హాజరయ్యే విద్యార్థులకు మెయిన్ తర్వాత అడ్వాన్స్‌డ్‌కు లభించే సమయం నెల రోజులు మాత్రమే. కాబట్టి ప్రస్తుత సమయంలో వీలైనంత మేరకు అడ్వాన్స్‌డ్‌ను దృష్టిలో పెట్టుకొని మెయిన్ పరీక్షకు ప్రిపరేషన్ సాగించాలి. మెయిన్ పరీక్ష పూర్తయిన తర్వాత ఇక పూర్తి సమయాన్ని అడ్వాన్స్డ్ రివిజన్‌కు కేటాయించాలి. వారం రోజుల ముందు అడ్వాన్స్డ్ పరీక్షకు వారం రోజుల ముందు నుంచి పూర్తిగా ప్రాక్టీస్ టెస్టులు, మోడల్టెస్టులు, గ్రాండ్ టెస్ట్‌ల సాధనకు కేటాయించాలి. ఈ సమయంలో కొత్త అంశాలు చదువుదాం.. వాటికి వెయిటేజీ ఎక్కువ ఉంది అనే భావన ఏ మాత్రం సరికాదు. పరీక్ష రోజు కీలకం ► ఎలాంటి పోటీ పరీక్ష అయినా.. ఎన్ని సంవత్సరాలు కృషి చేసినా.. పరీక్ష రోజు చూపే ప్రతిభ విజయంలో అత్యంత కీలకంగా మారుతుంది. ► పరీక్ష హాల్లో ప్రశ్న పత్రం ఆసాంతం చదివేందుకు కనీసం 10 నుంచి పదిహేను నిమిషాలు కేటాయించాలి. ► దాని ఆధారంగా తమకు సులభంగా ఉన్న ప్రశ్నలను గుర్తించాలి. ముందుగా వాటికి సమాధానాలు ఇవ్వాలి. ► పరీక్ష ముగియడానికి ముందు పది లేదా పదిహేను నిమిషాలపాటు గుర్తించిన సమాధానాలు రివ్యూ చేసుకోవాలి. ► సమాధానాలు ఇచ్చే సమయంలో ఏమైనా సందిగ్ధత ఉంటే.. మార్క్ ఫర్ రివ్యూ బటన్‌పై క్లిక్ చేసి.. చివరలో సమీక్షించుకోవాలి. అడ్వాన్స్డ్.. ముఖ్యాంశాలు ► ప్రాక్టీస్‌కు ప్రాధాన్యమిస్తూ అప్లికేషన్ ఓరియెంటెడ్ కొశ్చన్స్ సాధన చేయాలి. ► ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నల సాధనకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ► ప్రతి రోజు, ప్రతి సబ్జెక్ట్‌కు నిర్దిష్ట సమయం కేటాయించుకుని ప్రిపరేషన్ సాగించాలి. ► వీలైనంత మేరకు మోడల్ టెస్ట్‌లు, మాక్ టెస్ట్‌లకు హాజరు కావాలి. ► అన్ని సబ్జెక్ట్‌లలో అన్ని టాపిక్స్‌లో కాన్సెప్ట్స్, ఫార్ములాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి. ► పరీక్షకు వారం రోజుల ముందు నుంచి పూర్తిగా మోడల్ టెస్టులు, మాక్ టెస్ట్‌లకు సమయం కేటాయించాలి. ► పరీక్ష రోజు.. కేంద్రంలోకి అనుమతించే సమయానికంటే గంట ముందుగా చేరుకునే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలి. ► పరీక్షకు ముందు ఎలాంటి మానసిక ఒత్తిడి, ఆందోళన లేకుండా చూసుకోవాలి. ► పరీక్ష హాల్లో.. పరీక్ష సమయంలో కంప్యూటర్ స్క్రీన్‌పై అందుబాటులో ఉండే కౌంట్‌డౌన్ టైమర్‌ను చూసుకుంటూ ఉండాలి. ► మొదటి పేపర్ పూర్తయిన తర్వాత దాని గురించి మర్చిపోయి రెండో పేపర్‌కు సన్నద్ధం కావాలి. విజయ సాధనాలు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో విజయం సాధించాలంటే.. ప్రిపరేషన్ సమయంలోనే ఆయా టాపిక్స్‌ను అప్లికేషన్ అప్రోచ్‌తో ప్రాక్టీస్ చేయాలి. దీనివల్ల పరీక్షలో ప్రశ్నను ఎలా అడిగినా.. సమాధానం ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది. ప్రిపరేషన్ సమయంలోనే సింగిల్ కరెక్ట్ కొశ్చన్స్; మల్టిపుల్ ఛాయిస్ కొశ్చన్స్; పేరాగ్రాఫ్ ఆధారిత ప్రశ్నలను సాధన చేయడం ద్వారా.. పరీక్షలో ఏమైనా మార్పులు జరిగినా.. ఎలాంటి ఒత్తిడి లేకుండా సమాధానాలు ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది. – ఆర్.కేదారేశ్వర్, జేఈఈ పోటీ పరీక్షల నిపుణులు -
ఆర్ఆర్బీ పరీక్షలో సక్సెస్ సాధించాలంటే..?
ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అంటే... రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్–నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ ఎగ్జామ్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు.. ఈనెల 23 నుంచి 31 వరకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ పరీక్ష నిర్వహణకు షెడ్యూల్ ఖరారు చేసింది. ప్రస్తుతం నిర్వహించేది స్టేజ్–1 పరీక్ష. ఎగ్జామ్‌కు మరో పది రోజులు మాత్రమే సమయం ఉంది. అభ్యర్థులు ఈ విలువైన సమయాన్ని సమర్థంగా వినియోగించుకుంటే పరీక్షలో విజయం సాధించవచ్చు. ఈ నేపథ్యంలో.. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ టిప్స్.. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ పరీక్షను దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. ఈ పరీక్ష ద్వారా అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్, కమర్షియల్ అప్రెంటిస్, ట్రైన్స్ క్లర్క్, జూనియర్ టైమ్ కీపర్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రాఫిక్ అసిస్టెంట్, ట్రాఫిక్ అప్రెంటిస్, గూడ్స్ గార్డ్ మొదలైన ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఇంటర్మీడియెట్(10+2) ఉత్తీర్ణులు, గ్రాడ్యుయేట్స్ ఈ పరీక్ష దరఖాస్తుకు అర్హులు. వయసు 18 ఏళ్ల నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ పోస్టులకు మొత్తం నాలుగు దశల్లో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. తొలుత సీబీటీ(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్)1, ఆ తర్వాత సీబీటీ(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) 2, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా తుది ఎంపిక నిర్వహిస్తారు. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ టెస్ట్‌ను ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నారు. ప్రస్తుతం జరిగే ది పరీక్ష స్టేజ్–1. ఇందులో అర్హత సాధించిన వారిని రెండో దశ(స్టేజ్–2)కు ఎంపిక చేస్తారు. రెండో దశ పరీక్ష సైతం ఆన్లైన్ విధానంలోనే ఉంటుంది. ఆ తర్వాత టైపింగ్ స్కిల్ టెస్ట్/కంప్యూటర్ ఆధారిత అప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్/మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటాయి. స్టేజ్–1 పరీక్ష ► తొలి దశ పరీక్ష 100 ప్రశ్నలు–100 మార్కులకు జరుగుతుంది.ఇందులో మ్యాథమెటిక్స్ 30 ప్రశ్నలు–30 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 ప్రశ్నలు–30 మార్కులు, జనరల్ అవేర్నెస్ 40 ప్రశ్నలు–40 మార్కులకు ఉంటాయి. పరీక్ష సమయం 90నిమిషాలు. స్టేజ్1లో అర్హత సాధించినవారిని స్టేజ్2కు అనుమతిస్తారు. స్టేజ్–2 పరీక్ష రెండో దశ పరీక్ష 120 ప్రశ్నలు–120 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో మ్యాథమెటిక్స్ 35 ప్రశ్నలు–35 మార్కులు, రీజనింగ్ 35 ప్రశ్నలు–35 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ 50 ప్రశ్నలు–50 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం 90 నిమిషాలు. నెగిటివ్ మార్కుల విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానినికి 1/3 మార్కు కోత వేస్తారు. ప్రిపరేషన్ ప్రణాళిక ► ఎంతో కాలంగా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ పరీక్ష కోసం సిద్ధమవుతున్న వారు ఇప్పటికే సిలబస్ అంశాల అధ్యయనం పూర్తిచేసి ఉంటారు. ► ఇప్పుడున్న తక్కువ సమయంలో అభ్యర్థులు తమ బలాలు, బలహీనతలను అంచనా వేసుకోవడం అవసరం. ఏ విభాగంలో బలహీనంగా ఉన్నారో గుర్తించి.. దానికి ఎక్కువ సమయం కేటాయించాలి. ► పరీక్ష రోజు వరకు అభ్యర్థులు గత ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ప్రశ్న పత్రాలను ప్రాక్టీస్ చేయడం మంచిది. ఇది పరీక్షలో టైమ్ మేనేజ్మెంట్కు దోహదపడుతుంది. ► ఒక సబ్జెక్ట్ కోసం ఎంత సమయం కేటాయించారో.. ఆలోపే చదవడం పూర్తి చేయాలి. ప్రతిరోజు రివిజన్ చేయడం మరిచిపోవద్దు. ► ఆన్లైన్లో మాక్‌టెస్టులు ప్రాక్టీస్ చేయడం ద్వారా ఒత్తిడిని జయించడంతోపాటు వేగం పెంచుకోవచ్చు. ► ప్రస్తుతం అందుబాటులో ఉన్న తక్కువ సమయంలో ఎలాంటి చిట్కాలు పాటిస్తే మంచి మార్కులు స్కోరు చేయవచ్చో తెలుసుకోవాలి. ► గణిత విభాగానికి సంబంధించిన ఫార్ములాలు, సూత్రాలను గుర్తుంచుకోవాలి. ► ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సిలబస్‌లో పేర్కొన్న టాపిక్స్ అన్నీ కవర్ చేశారో లేదో చూసుకోవాలి. ఇప్పుడు కొత్త అంశాల జోలికి వెళ్లడం కంటే ఇప్పటికే చదివిన టాపిక్స్‌ను మరోసారి అధ్యయనం చేయడం మంచిది. ► ఏదో ఒక ఒక సబ్జెక్టుకు ఎక్కువ సమయం కేటాయించకుండా..టైమ్ టేబుల్ ప్రకారం అన్ని అంశాలకు సన్నద్ధమవ్వాలి. ► ప్రతి ప్రశ్నను పరిష్కరించడానికి నిర్దిష్ట సమయాన్ని కేటాయించాలి. జవాబులను త్వరగా గుర్తించేందుకు సత్వరమార్గాలు, చిట్కాలను గుర్తుంచుకోవాలి. ► ఏదైనా ఒక టాపిక్‌ను సాధన చేసే క్రమంలో ఇబ్బందులు తలెత్తితే.. ఇతర టాపిక్స్‌ను చదవడం లేదా ఇంతకుముందు చదివిన టాపిక్స్‌ను మరోసారి ప్రాక్టీస్ చేయడం మంచిది. పరీక్ష రోజు టిప్స్ ► పరీక్షలో మొదట తేలికపాటి ప్రశ్నల నుంచి క్లిష్టమైన ప్రశ్నలకు జవాబులు గుర్తించడం మంచిది. దీనివల్ల ఒత్తిడి తగ్గడంతోపాటు ఎక్కువ ప్రశ్నలకు జవాబులు గుర్తించేందుకు వీలవుతుంది. ► గణిత విభాగంతో పోలిస్తే, జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ విభాగాల ప్రశ్నలకు సులభంగానే సమాధానాలు గుర్తించవచ్చు. కాబట్టి మొదట సులభమైన వాటితో పరీక్ష ప్రారంభించాలి. దీనివల్ల కేటాయించిన సమయం కంటే ముందే తేలికపాటి ప్రశ్నలు ముగిస్తే.. క్లిష్ట ప్రశ్నలకు కేటాయించేందుకు అధిక సమయం లభిస్తుంది. ► ఒక ప్రశ్నకు 30 సెకన్ల కంటే ఎక్కువ సమయం కేటాయించకుండా చూసుకోవాలి. ఎక్కువ సమయం తీసుకునే ప్రశ్నలను చివరగా ప్రయత్నించడం మేలుచేస్తుంది. -
బ్యాంకు ఉద్యోగుల సమ్మె ఖరారు
సాక్షి, చెన్నై: బ్యాంకు ఉద్యోగులు సమ్మె సైరన్ మోగించేందుకు సిద్ధమవుతున్నారు. రెండు రోజుల పాటు(48 గంటల) సమ్మె చేపట్టనున్నామని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) నాయకులు చెప్పారు. ప్రభుత్వ, ప్రయివేటు రంగ బ్యాంకుల్లో పనిచేస్తున్న దాదాపు 10 లక్షల మంది ఉద్యోగులు ఈ సమ్మె చేపట్టనున్నారు. మే 30వ తేదీ ఉదయం 6గంటల నుంచి జూన్ 1వ తేదీ ఉదయం 6గంటల వరకు సమ్మె నిర్వహించేందుకు నిర్ణయించినట్టు చెప్పారు. వేతనాల సమీక్ష విషయంలో యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్లు(యూఎఫ్‌బీయూ)కి, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ)కి మధ్య మే 5 న ముంబైలో జరిగిన చర్చలు మరోసారి విఫలమవడంతో సమ్మెకు దిగుతున్నట్టు వెల్లడించారు. బ్యాంక్ మేనేజ్మెంట్ అండ్ చీఫ్ లేబర్ కమీషనర్ (సెంట్రల్), ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) కు సమ్మె నోటీసులిచ్చామని ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం స్పష్టం చేశారు. . 2017, నవంబరు నుంచి వేతన సవరణ పెండింగ్‌లో ఉందని పేర్కొన్నారు. 2012 నవంబర్ 1న 10వ బిపర్‌టైట్ వేతన ఒప్పందంలో భాగంగా మొత్తం వేతన బిల్లులో 15 శాతానికి పైగా పెంపునకు బదులుగా 2శాతం ఐబీఏ ఆఫర్ చేయడాన్ని యూనియన్లు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. -
బట్టి విక్రమార్కులు
పరీక్షలకు ఇంకా టైముంది గానీ, సిలిబస్‌ను పూర్తిచేయడానికి మాత్రం ఇది తగినంత సమయం కాదనే విద్యార్థుల మనోగతం. మార్చి, సెప్టెంబర్ బడుద్ధాయి బ్యాచ్ సంగతి వదిలేద్దాం. పరీక్షలంటే వాళ్లకు ఏమాత్రం లక్ష్యం ఉండదు. ఒక్క ఊపులోనే పరీక్షలు గట్టెక్కేయాలనే పట్టుదల ఉన్న బుద్ధిమంతుల గురించి ఆలోచిద్దాం. వాళ్లందరికీ ఇది రివిజన్ సీజన్. అనగా పునశ్చరణ రుతువు. స్కూళ్లల్లో, కాలేజీల్లో పాఠాలు సరిగా చెప్పినా, చెప్పకపోయినా సిలబస్‌ను పూర్తిగా చదివి తీరాల్సిందేననే ఆత్మజ్ఞానం ఇలాంటి విద్యార్థులకు ఎక్కువగానే ఉంటుంది. స్కూళ్లు, కాలేజీలలో చెప్పే పాఠాలతో పరీక్షల్లో ర్యాంకులు వస్తాయో లేదోననే అనుమానంతో వాళ్ల తల్లిదండ్రులు కూడా వాళ్లను కోచింగ్ సెంటర్లకు పంపిస్తారు. ఇక కోచింగ్ సెంటర్ల నిర్వాహకుల బతకనేర్పరితనం గురించి చెప్పనే అక్కర్లేదు. ఎప్పుడో చదవబోయే కోర్సుల కోసం బొడ్డూడని దశ నుంచే కోచింగ్ మొదలుపెడతారు. వీరికి జతగా ఇంకొందరు ఘనాపాటీలు ఉంటారు. విద్యార్థుల కష్టాలను తీర్చే ఆపద్బాంధవుల్లా ప్రతి సబ్జెక్టుకూ ‘మేడీజీ’ పేరిట మేడ్డిఫికల్ట్ గైడ్లు ఎడాపెడా అచ్చోసి పడేస్తారు. టెక్స్ట్ పుస్తకాలు, గైడ్లు, కోచింగులకు తల్లిదండ్రులు ఎటూ అప్పుల పాలవుతారు. తమ పిల్లలకు కోరుకున్న కోర్సుల్లో చేరడానికి తగిన ర్యాంకులు వస్తే సరేసరి... ఆనందబాష్పాలు రాలుస్తారు. చదువుల భారం మోయలేక చతికలబడి, ర్యాంకుల్లో వెనుకబడ్డారో తల్లిదండ్రులు డిప్రెషనల్‌లో పడిపోయి, ఆ డిప్రెషన్‌ను పిల్లల నెత్తికి సరఫరా చేస్తారు. తల్లిదండ్రుల్లోని ఇలాంటి ధోరణి కారణంగానే ఒక్కోసారి ఆత్మహత్యల వంటి అనర్థాలు తలెత్తుతూ ఉంటాయి. విజన్ ఉండాలి గురూ! ఇలాంటి అనర్థాలను అరికట్టాలంటే, పూర్తిగా టీచింగులు, కోచింగులనే నమ్ముకోరాదు. విజన్ గల విద్యార్థులకు ఈ విషయం ముందే తెలుసు. అందుకే వాళ్లకు రివిజన్ ప్రాధాన్యం కూడా తెలుసు. వాళ్లంతా బుద్ధిమంతులు కదా! ఎప్పటి పాఠాలను అప్పుడే చదివేసుకుంటారు. చదివేసుకున్నంత మాత్రాన పూర్తిగా వంటబట్టేస్తే అవి పాఠాలెలా అవుతాయి? అవి వంటబట్టాలంటే పునశ్చరణ తప్పదు. పరీక్షలకు ఎంత ముందుగా రివిజన్ ప్రారంభిస్తే అంత మంచిది. రివిజన్‌లోనూ రకరకాల పద్ధతులు ఉన్నాయి. అన్ని పద్ధతులూ అందరికీ సరిపడవు. ఎవరికి సరిపడే పద్ధతిని వారు ఎంచుకోవాల్సిందే. ఒకరిని చూసి మరొకరు రివిజన్ పద్ధతిని కాపీ కొడితే ఫలితాల్లో తేడా వచ్చే ప్రమాదం లేకపోలేదు. విద్యార్థుల్లో కొందరు ఉంటారు... వాళ్లు ‘బట్టి’విక్ర‘మార్కులు’. సబ్జెక్టును ఎంతగా బట్టీ పడితే అంతగా మార్కులు కొట్టేయవచ్చని వారి ప్రగాఢ విశ్వాసం. ఇలాంటి వాళ్లు సబ్జెక్టును వీలైనంతగా నెమరు వేసుకుంటూనే ఉంటారు. ఒక్కోసారి వాళ్ల అంచనా సత్ఫలితాలనే ఇస్తూ ఉంటుంది. అయితే, అది వారి అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. ప్రశ్నల్లో కాస్త తేడా వచ్చినా, ఇలాంటి ‘బట్టి’విక్ర‘మార్కులు’ బోల్తాపడతారు. ఫలితాలు వచ్చాక భోరుమంటారు. ఇంకొందరు ఉంటారు... వీళ్లు క్షీరనీర న్యాయాన్ని పాటిస్తారు. సబ్జెక్టులోని సారాంశాన్ని క్షుణ్ణంగా గ్రహిస్తారు. చదువుల సరస్సులో వీళ్లు రాయంచల్లాంటి వాళ్లు. వీళ్లు ర్యాంకులను నమ్ముకోవడం కాదు, ర్యాంకులే వీళ్లను నమ్ముకుంటాయి. యాంటీ రివిజనిస్టులు విద్యార్థుల్లో సినిమాలు, షికార్లు, క్రికెట్ మ్యాచ్‌లు... వంటి నానా కళాపోషణ కార్యక్రమాల్లో తెగ బిజీగా ఏడాదంతా కులాసాగా, ధిలాసాగా గడిపేసే వాళ్లూ ఉంటారు. ఇలాంటి వాళ్లు తల్లిదండ్రులకే కాదు, పాఠాలు చెప్పే టీచర్లకూ తగని తలనొప్పిగా ఉంటారు. వీళ్లకు చదువంటేనే పెద్దగా గిట్టదు. మొక్కుబడిగా నాలుగు ముక్కలు చదివినా, రివిజన్ అంటే అస్సలు గిట్టదు. అర్ధరాత్రి వరకు మెలకువగా ఉంటూ, గుంపులు గుంపులుగా ఒకచోట గుమిగూడి పుస్తకాలతో కుస్తీ పడుతూ గ్రూప్ స్టడీస్ చేసేవాళ్లపై ఇలాంటి వాళ్లు సెటైర్లు వేస్తుంటారు. రివిజన్ చేసే సాటి క్లాస్‌మేట్స్‌ను ‘రివిజనిస్టులు’ అని పేరుపెట్టి ఆటపట్టిస్తుంటారు. ఇలాంటి యాంటీ రివిజనిస్టులు కూడా పరీక్షల్లో గట్టెక్కడానికి నానా మార్గాలను అన్వేషిస్తూనే ఉంటారు. వాళ్ల దృష్టిలో రివిజన్ కంటే విజన్ ముఖ్యం. విజన్ ఉన్నవాళ్ల విజయాన్ని ఎవరూ ఆపలేరనేది వారి ప్రగాఢ విశ్వాసం. ఇలాంటి వాళ్లు పరీక్షల్లో ఎలాంటి ప్రశ్నలు రావచ్చు అనేదానిపై కొంత కసరత్తు చేస్తారు. అలాగని, సమాధానాలు చదువుతారని అనుకోవద్దు. వాళ్లెప్పుడూ అలాంటి అఘాయిత్యాలకు పాల్పడరు. పరీక్షల్లో రాగలవని గుర్తించిన ప్రశ్నలకు సమాధానాలను ఇంచక్కా స్లిప్పులుగా తయారు చేస్తారు. వాటిని ఇన్విజిలేటర్ల కళ్లు గప్పి పరీక్ష హాల్లోకి రవాణా చేసే మార్గాలను పకడ్బందీగా ముందే ఏర్పాటు చేసుకుంటారు. అదృష్టం కలిసొస్తే అప్పుడప్పుడు ఇలాంటి వాళ్లు కూడా పరీక్షల్లో పాసైపోతూ ఉంటారు. పెద్దలకూ ఉండాలి... నేర్చుకున్న పాఠాల పునశ్చరణ పిల్లలకేనా? విజన్, రివిజన్ పెద్దలకూ ఉండాలి. పాఠాలనే కాదు, గుణపాఠాలనూ క్రమం తప్పకుండా నెమరు వేసుకోవాలి. లేకపోతే బతుకు పరీక్షలో ఫెయిల్ కాక తప్పదు. చదువంటే బడిలో చెప్పే పాఠాలేనా? ఇళ్లల్లోని పెద్దలు స్వానుభవంతో చెప్పే సుద్దులు కూడా బతుకు పాఠాలే! వాళ్లేదో చాదస్తం కొద్దీ అలా చెబుతుంటార్లే అనుకొని నిర్లక్ష్యం చేస్తే, ఎప్పుడో ఒకప్పుడు ఎదురుదెబ్బలు తినక తప్పదు. ఎవరో కవి చెప్పినట్లు బతుకు పూల బాట కాదు. అందులో ముళ్లుంటాయి, రాళ్లుంటాయి. ఎక్కడికక్కడ ఎగుడుదిగుళ్లు ఉండనే ఉంటాయి. ఎగుడుదిగుళ్ల బతుకుబాటలో నడవడం అంత తేలిక కాదు. అడుగడుగు ఆచి తూచి వేయాల్సిందే! అలాంటి బాటలో వడివడిగా నడిచే చాకచక్యాన్ని అలవరచుకున్న వాళ్లే జీవిత గమ్యాలను చేరుకోగలరు. అలాంటి వాళ్లే విశ్రాంత జీవితంలో ‘జీవితమే సఫలము’ అని తృప్తిగా పాడుకోగలరు. విశ్రాంత జీవితం ప్రశాంతంగా గడపాలంటే, ఒంట్లో జవసత్వాలు ఉన్నప్పుడే మనిషికి తనదైన విజన్ కావాలి. జీవన గమనంలో నేర్చుకున్న ప్రతి పాఠాన్నీ రివిజన్ చేసుకునే నిబద్ధత కావాలి. విజన్‌ను, రివిజన్‌ను నమ్ముకున్న వాళ్లు జీవనసంధ్యలో లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డును సాధించినట్లే! - పన్యాల జగన్నాథదాసు -
‘రహస్య’ నిబంధనలపై పునఃపరిశీలన
న్యూఢిల్లీ: అధికార రహస్యాల చట్టంలోని నిబంధనలను పునఃపరిశీలించాలని ముగ్గురు సభ్యుల ఉన్నతస్థాయి కమిటీ నిర్ణయించింది. ఆర్టీఐ, అధికార రహస్యాల చట్టంపై సమీక్షకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కమిటీ గురువారం తొలిసారి సమావేశమైంది. రహస్యాల చట్టాన్ని సవరించాలంటూ ఇంతకుముందు వచ్చిన పలు సలహాలను పరిశీలించాలని కమిటీలో నిర్ణయించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యానికి సంబంధించిన పత్రాలు బయపెట్టాలన్న డిమాండ్ నేపథ్యంలో కేంద్రం హోం, న్యాయ, సిబ్బంది వ్యవహారాల శాఖ కార్యదర్శులతో కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. -
ఆగస్టు 15 గిఫ్ట్.. పెట్రోలు ధర తగ్గింపు?
పెట్రోలు ధర లీటరుకు రెండు రూపాయల వరకు తగ్గే అవకాశం కనిపిస్తోంది. బ్రెంట్ క్రూడాయిల్ ధర 103 డాలర్ల కంటే దిగువకు పడిపోయింది. ఇరాక్ సంక్షోభం సమయంలో ఈ క్రూడాయిల్ బ్యారెల్‌కు దాదాపు 115 డాలర్లు ఉండేది. ఇప్పుడు గణనీయంగా దీని ధర తగ్గడంతో ఈ మేరకు వినియోగదారులకు ప్రయోజనం కల్పించాలని చమురు కంపెనీలు భావిస్తున్నాయి. ఆగస్టు ఒకటో తేదీన లీటరు పెట్రోలు ధర రూ. 1.09 మేర తగ్గింది. సాధారణంగా ప్రతి 15 రోజులకు ఒకసారి పెట్రో ధరలను సమీక్షిస్తుంటారు. డీజిల్ ధరను నెలకు 50 పైసల వంతున పెంచుతున్నారు. ఇప్పటికే ఆగస్టు ఒకటోతేదీన ఒకసారి ధరలను సవరించారు కాబట్టి, మళ్లీ ఆగస్టు 15వ తేదీన ధర తగ్గింపును ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా వినియోగదారులకు ఈ కానుక అందుతుందని భావిస్తున్నారు.