బట్టి విక్రమార్కులు | Exams and overtime | Sakshi
Sakshi News home page

బట్టి విక్రమార్కులు

Published Tue, Feb 2 2016 12:50 AM | Last Updated on Sun, Sep 3 2017 4:46 PM

బట్టి  విక్రమార్కులు

బట్టి విక్రమార్కులు

పరీక్షలకు ఇంకా టైముంది గానీ, సిలిబస్‌ను పూర్తిచేయడానికి మాత్రం ఇది తగినంత సమయం కాదనే విద్యార్థుల మనోగతం. మార్చి, సెప్టెంబర్ బడుద్ధాయి బ్యాచ్ సంగతి వదిలేద్దాం. పరీక్షలంటే వాళ్లకు ఏమాత్రం లక్ష్యం ఉండదు. ఒక్క ఊపులోనే పరీక్షలు గట్టెక్కేయాలనే పట్టుదల ఉన్న బుద్ధిమంతుల గురించి ఆలోచిద్దాం. వాళ్లందరికీ ఇది రివిజన్ సీజన్. అనగా పునశ్చరణ రుతువు. స్కూళ్లల్లో, కాలేజీల్లో పాఠాలు సరిగా చెప్పినా, చెప్పకపోయినా సిలబస్‌ను పూర్తిగా చదివి తీరాల్సిందేననే ఆత్మజ్ఞానం ఇలాంటి విద్యార్థులకు ఎక్కువగానే ఉంటుంది. స్కూళ్లు, కాలేజీలలో చెప్పే పాఠాలతో పరీక్షల్లో ర్యాంకులు వస్తాయో లేదోననే అనుమానంతో వాళ్ల తల్లిదండ్రులు కూడా వాళ్లను కోచింగ్ సెంటర్లకు పంపిస్తారు. ఇక కోచింగ్ సెంటర్ల నిర్వాహకుల బతకనేర్పరితనం గురించి చెప్పనే అక్కర్లేదు. ఎప్పుడో చదవబోయే కోర్సుల కోసం  బొడ్డూడని దశ నుంచే కోచింగ్ మొదలుపెడతారు. వీరికి జతగా ఇంకొందరు ఘనాపాటీలు ఉంటారు. విద్యార్థుల కష్టాలను తీర్చే ఆపద్బాంధవుల్లా ప్రతి సబ్జెక్టుకూ ‘మేడీజీ’ పేరిట మేడ్డిఫికల్ట్ గైడ్లు ఎడాపెడా అచ్చోసి పడేస్తారు. టెక్స్‌ట్ పుస్తకాలు, గైడ్లు, కోచింగులకు తల్లిదండ్రులు ఎటూ అప్పుల పాలవుతారు. తమ పిల్లలకు కోరుకున్న కోర్సుల్లో చేరడానికి తగిన ర్యాంకులు వస్తే సరేసరి... ఆనందబాష్పాలు రాలుస్తారు. చదువుల భారం మోయలేక చతికలబడి, ర్యాంకుల్లో వెనుకబడ్డారో తల్లిదండ్రులు డిప్రెషనల్‌లో పడిపోయి, ఆ డిప్రెషన్‌ను పిల్లల నెత్తికి సరఫరా చేస్తారు. తల్లిదండ్రుల్లోని ఇలాంటి ధోరణి కారణంగానే ఒక్కోసారి ఆత్మహత్యల వంటి అనర్థాలు తలెత్తుతూ ఉంటాయి.

విజన్ ఉండాలి గురూ!
ఇలాంటి అనర్థాలను అరికట్టాలంటే, పూర్తిగా టీచింగులు, కోచింగులనే నమ్ముకోరాదు. విజన్ గల విద్యార్థులకు ఈ విషయం ముందే తెలుసు. అందుకే వాళ్లకు రివిజన్ ప్రాధాన్యం కూడా తెలుసు. వాళ్లంతా బుద్ధిమంతులు కదా! ఎప్పటి పాఠాలను అప్పుడే చదివేసుకుంటారు. చదివేసుకున్నంత మాత్రాన పూర్తిగా వంటబట్టేస్తే అవి పాఠాలెలా అవుతాయి? అవి వంటబట్టాలంటే పునశ్చరణ తప్పదు. పరీక్షలకు ఎంత ముందుగా రివిజన్ ప్రారంభిస్తే అంత మంచిది. రివిజన్‌లోనూ రకరకాల పద్ధతులు ఉన్నాయి. అన్ని పద్ధతులూ అందరికీ సరిపడవు. ఎవరికి సరిపడే పద్ధతిని వారు ఎంచుకోవాల్సిందే. ఒకరిని చూసి మరొకరు రివిజన్ పద్ధతిని కాపీ కొడితే ఫలితాల్లో తేడా వచ్చే ప్రమాదం లేకపోలేదు. విద్యార్థుల్లో కొందరు ఉంటారు... వాళ్లు ‘బట్టి’విక్ర‘మార్కులు’. సబ్జెక్టును ఎంతగా బట్టీ పడితే అంతగా మార్కులు కొట్టేయవచ్చని వారి ప్రగాఢ విశ్వాసం. ఇలాంటి వాళ్లు సబ్జెక్టును వీలైనంతగా నెమరు వేసుకుంటూనే ఉంటారు. ఒక్కోసారి వాళ్ల అంచనా సత్ఫలితాలనే ఇస్తూ ఉంటుంది. అయితే, అది వారి అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. ప్రశ్నల్లో కాస్త తేడా వచ్చినా, ఇలాంటి ‘బట్టి’విక్ర‘మార్కులు’ బోల్తాపడతారు. ఫలితాలు వచ్చాక భోరుమంటారు. ఇంకొందరు ఉంటారు... వీళ్లు క్షీరనీర న్యాయాన్ని పాటిస్తారు. సబ్జెక్టులోని సారాంశాన్ని క్షుణ్ణంగా గ్రహిస్తారు. చదువుల సరస్సులో వీళ్లు రాయంచల్లాంటి వాళ్లు. వీళ్లు ర్యాంకులను నమ్ముకోవడం కాదు, ర్యాంకులే వీళ్లను నమ్ముకుంటాయి.

యాంటీ రివిజనిస్టులు
విద్యార్థుల్లో సినిమాలు, షికార్లు, క్రికెట్ మ్యాచ్‌లు... వంటి నానా కళాపోషణ కార్యక్రమాల్లో తెగ బిజీగా ఏడాదంతా కులాసాగా, ధిలాసాగా గడిపేసే వాళ్లూ ఉంటారు. ఇలాంటి వాళ్లు తల్లిదండ్రులకే కాదు, పాఠాలు చెప్పే టీచర్లకూ తగని తలనొప్పిగా ఉంటారు. వీళ్లకు చదువంటేనే పెద్దగా గిట్టదు. మొక్కుబడిగా నాలుగు ముక్కలు చదివినా, రివిజన్ అంటే అస్సలు గిట్టదు. అర్ధరాత్రి వరకు మెలకువగా ఉంటూ, గుంపులు గుంపులుగా ఒకచోట గుమిగూడి పుస్తకాలతో కుస్తీ పడుతూ గ్రూప్ స్టడీస్ చేసేవాళ్లపై ఇలాంటి వాళ్లు సెటైర్లు వేస్తుంటారు. రివిజన్ చేసే సాటి క్లాస్‌మేట్స్‌ను ‘రివిజనిస్టులు’ అని పేరుపెట్టి ఆటపట్టిస్తుంటారు. ఇలాంటి యాంటీ రివిజనిస్టులు కూడా పరీక్షల్లో గట్టెక్కడానికి నానా మార్గాలను అన్వేషిస్తూనే ఉంటారు. వాళ్ల దృష్టిలో రివిజన్ కంటే విజన్ ముఖ్యం. విజన్ ఉన్నవాళ్ల విజయాన్ని ఎవరూ ఆపలేరనేది వారి ప్రగాఢ విశ్వాసం. ఇలాంటి వాళ్లు పరీక్షల్లో ఎలాంటి ప్రశ్నలు రావచ్చు అనేదానిపై కొంత కసరత్తు చేస్తారు. అలాగని, సమాధానాలు చదువుతారని అనుకోవద్దు. వాళ్లెప్పుడూ అలాంటి అఘాయిత్యాలకు పాల్పడరు. పరీక్షల్లో రాగలవని గుర్తించిన ప్రశ్నలకు సమాధానాలను ఇంచక్కా స్లిప్పులుగా తయారు చేస్తారు. వాటిని ఇన్విజిలేటర్ల కళ్లు గప్పి పరీక్ష హాల్లోకి రవాణా చేసే మార్గాలను పకడ్బందీగా ముందే ఏర్పాటు చేసుకుంటారు. అదృష్టం కలిసొస్తే అప్పుడప్పుడు ఇలాంటి వాళ్లు కూడా పరీక్షల్లో పాసైపోతూ ఉంటారు.

పెద్దలకూ ఉండాలి...
నేర్చుకున్న పాఠాల పునశ్చరణ పిల్లలకేనా? విజన్, రివిజన్ పెద్దలకూ ఉండాలి. పాఠాలనే కాదు, గుణపాఠాలనూ క్రమం తప్పకుండా నెమరు వేసుకోవాలి. లేకపోతే బతుకు పరీక్షలో ఫెయిల్ కాక తప్పదు. చదువంటే బడిలో చెప్పే పాఠాలేనా? ఇళ్లల్లోని పెద్దలు స్వానుభవంతో చెప్పే సుద్దులు కూడా బతుకు పాఠాలే! వాళ్లేదో చాదస్తం కొద్దీ అలా చెబుతుంటార్లే అనుకొని నిర్లక్ష్యం చేస్తే, ఎప్పుడో ఒకప్పుడు ఎదురుదెబ్బలు తినక తప్పదు. ఎవరో కవి చెప్పినట్లు బతుకు పూల బాట కాదు. అందులో ముళ్లుంటాయి, రాళ్లుంటాయి. ఎక్కడికక్కడ ఎగుడుదిగుళ్లు ఉండనే ఉంటాయి. ఎగుడుదిగుళ్ల బతుకుబాటలో నడవడం అంత తేలిక కాదు. అడుగడుగు ఆచి తూచి వేయాల్సిందే! అలాంటి బాటలో వడివడిగా నడిచే చాకచక్యాన్ని అలవరచుకున్న వాళ్లే జీవిత గమ్యాలను చేరుకోగలరు. అలాంటి వాళ్లే విశ్రాంత జీవితంలో ‘జీవితమే సఫలము’ అని తృప్తిగా పాడుకోగలరు. విశ్రాంత జీవితం ప్రశాంతంగా గడపాలంటే, ఒంట్లో జవసత్వాలు ఉన్నప్పుడే మనిషికి తనదైన విజన్ కావాలి. జీవన గమనంలో నేర్చుకున్న ప్రతి పాఠాన్నీ రివిజన్ చేసుకునే నిబద్ధత కావాలి. విజన్‌ను, రివిజన్‌ను నమ్ముకున్న వాళ్లు జీవనసంధ్యలో లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును సాధించినట్లే!
 - పన్యాల జగన్నాథదాసు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement