సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న వివిధ విభాగాల అధిపతులు, సీనియర్ ప్రొఫెసర్లకు ప్రత్యేక ఓరియంటేషన్ కార్యక్రమాలు నిర్వహించాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. సెప్టెంబర్ 21 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించాలని భావిస్తున్నామని మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి తెలిపారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ పునశ్చరణ బాధ్యతలు తీసుకుంటోందని వెల్లడించారు. ఇటీవల జరిగిన ఉన్నత విద్య పాలక మండలి సమావేశంలో ఈ మేరకు చర్చించినట్టు స్పష్టం చేశారు. ఈ వివరాలను లింబాద్రి మంగళవారం మీడియాకు వివరించారు.
అధ్యాపకుల ఆలోచనా ధోరణిని విస్తృతపర్చేందుకు..
దేశవ్యాప్తంగా ఉన్నత విద్య కోర్సు ల్లో అనేక మార్పులు చోటు చేసు కుంటున్నాయి. అంతర్జాతీయ విద్యా ప్రమాణాల వైపు వెళ్ళాలనే ఆకాంక్ష బలపడుతోంది. ప్రపంచంలోని ప్రఖ్యాత యూనివర్సిటీలు కూడా ఆన్‌లైన్ కోర్సులను అందిస్తున్నాయి. డిజిటల్ యూనివర్సిటీ ప్రాధ్యానత అన్ని స్థాయిలను ఆకర్షిస్తోంది. వివిధ సబ్జెక్టుల మేళవింపుతో, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా శాస్త్రీయ విద్యా విధానం విస్తృత స్థాయిలో అందుబాటులోకి వస్తోంది.
మరోవైపు ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకూ కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. స్వదేశీ యూనివర్సిటీలు వీటి పోటీని తట్టుకుని నిలబడాల్సిన అవసరం ఏర్పడింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మన రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఉన్న అధ్యాపకుల ఆలోచనాధోరణిని మరింత విస్తృతపర్చేందుకు ప్రత్యేక ఓరియంటేషన్ చేపడుతున్నట్టు లింబాద్రి తెలిపారు.
శిక్షణ ఇలా...
- విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ప్రధాన విభాగాల ముఖ్య అధికారులను వర్సిటీల వీసీలతో కలిసి ఉన్నత విద్యా మండలి ఎంపిక చేస్తుంది. ఇలా అన్ని యూనివర్శిటీల నుంచి తొలి దశలో వంద మందిని ఎంపిక చేసే అవకాశం ఉంది.
- సీనియర్ అధ్యాపకుడు భవిష్యత్‌లో ఉన్నత విద్యలో కీలకపాత్ర పోషిస్తాడు. ఈ కారణంగా బోధనపై నవీన మెళకువలే కాకుండా, నాయకత్వ లక్షణాలు అవసరం. గ్లోబల్ లీడర్‌గా ఉన్నత విద్యను అర్థం చేసుకునే స్థాయి కల్పిస్తారు.
- మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఈ దిశగా ప్రత్యేక ఓరియంటేషన్ మెళకువలను నిష్ణాతులు రూపొందిస్తారు. వీటిని అనుభజ్ఞులైన అధికారులు పరిశీలిస్తా రు. అర్థమయ్యేలా వివరించే అధికారులతో ప్రత్యేక బోధన తరగతులు నిర్వహిస్తారు.
- అధ్యాపకులతో మొదలయ్యే ఈ పునశ్చరణ తరగతులు తర్వాత దశలో వీసీల వరకూ విస్తరించాలని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment