ముంబై: గరిష్ట స్థాయిల వద్ద ఆఖరి గంటలో లాభాల స్వీకరణ చోటుచేసుకోవడంతో స్టాక్ సూచీలు మంగళవారం ఆరంభంలో ఆర్జించిన భారీ లాభాలను కోల్పోయి స్వల్పలాభాలతో గట్టెక్కాయి. ఇంట్రాడేలో 680 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ చివరికి 31 పాయింట్ల స్వల్ప లాభంతో 71,386 వద్ద నిలిచింది. నిఫ్టీ ట్రేడింగ్‌లో 211 పాయింట్లు ఆర్జించింది. ఆఖరికి 32 పాయింట్లు్ల పెరిగి 21,545 వద్ద నిలిచింది.
ఉదయం లాభాలతో మొదలైన సూచీలు మధ్యాహ్నం వరకు స్థిరమైన లాభాలతో ముందుకు కదిలాయి. అయితే ఆఖరి గంటన్నరలో అమ్మకాలు వెల్లువెత్తడంతో ఇంట్రాడే గరిష్టం నుంచి దాదాపు ఒక శాతం దిగివచ్చాయి. బ్యాంకింగ్, మీడియా, ఎఫ్‌ఎంసీజీ, సర్విసెస్ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఆటో, మెటల్, ఐటీ, ఫార్మా, రియల్టీ, ఇంధన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. చిన్న తరహా షేర్లకు డిమాండ్ లభించడంతో బీఎస్‌ఈ స్మాల్ క్యాప్ సూచీ 0.37% లాభపడింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.991 కోట్ల షేర్లను అమ్మేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.104 కోట్ల షేర్లను కొన్నారు.
ఆసియాలో జపాన్ (1%), సింగపూర్ (0.50%), చైనా (0.20%) మినహా మిగిలిన అన్ని దేశాల స్టాక్ సూచీలు అరశాతం మేర నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు అరశాతానికి పైగా పతనమయ్యాయి. అమెరికా మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అధిక వాల్యుయేషన్ ఆందోళనలు, ఆసియా మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు మన మార్కెట్లో లాభాల స్వీకరణకు పురిగొల్పాయని జియోజిత్ ఫైనాన్సియల్ సర్విసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.
మార్కెట్లో మరిన్ని సంగతులు
► సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియాతో 10 బిలియన్ డాలర్ల విలీనంపై సందిగ్ధత నెలకొనడంతో జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ షేరు 8% పతనమైన రూ.256 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 13% క్షీణించి రూ.242 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. షేరు భారీ పతనంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.2,036 కోట్లు నష్టపోయి రూ.24,613 కోట్లకు దిగివచ్చింది.
► బజాజ్ ఆటో రూ.4,000 కోట్ల బైబ్యాక్ ప్రకటించడంతో కంపెనీ షేరు 2% పెరిగి రూ.7,094 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 6% ఎగసి రూ.7,420 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. ఈ క్రమంలో సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించింది.
► జ్యోతి సీఎన్‌సీ ఆటోమేషన్ ఐపీఓకు తొలి రోజు విశేష స్పందన లభించింది. ఇష్యూ ప్రారంభమైన తొలి కొన్ని గంటల్లోనే షేర్లు పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయ్యాయి. పబ్లిక్ ఇష్యూలో భాగంగా కంపెనీ మొత్తం 1.75 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా 4.40 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. మొత్తంగా మొదటి రోజే 2.51 రెట్ల ఓవర్ సబ్‌స్రై్కబ్ అయ్యింది. ఇందులో రిటైల్ విభాగం 8.25 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల విభాగం 3.63 రెట్లు, క్యూఐబీ కోటా 2 రెట్లు సబ్‌స్రై్కబ్ అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment