సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ డిపోలు క్రమంగా లాభాలు ఆర్జించడం మొదలుపెట్టాయి. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత 19 డిపోలు లాభాలను సమకూర్చుకున్నాయి. మొత్తం 97 డిపోలున్న సంస్థ ప్రతినెలా రూ.100 కోట్లకు తగ్గకుండా నష్టాలు చవిచూస్తున్న నేపథ్యంలో ఇది వెలుగురేఖలా కనిపిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌లో కేవలం 4 డిపోలు, మే నెలలో ఎనిమిది డిపోలు లాభాలు చవిచూడగా, జూన్‌లో లాభాలు సాధించిన డిపోల సంఖ్య 19కి చేరినట్టు అధికారులు తేల్చారు. జూన్‌లో ఈ డిపోల మొత్తం లాభాలు రూ.7.43 కోట్లు. జూన్‌కు సంబంధించి ఆర్టీసీ సంస్థ మొత్తం నష్టాలు రూ.52.67 కోట్లు. వెరసి మొత్తం రూ.40 కోట్ల వరకు నష్టాలు తగ్గినట్టు తెలుస్తోంది.
2014 తర్వాత..?
రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 జూన్‌లో తొలిసారి లాభ నష్టాలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలు విడివిడిగా చూపాయి. ఆ నెలలో తెలంగాణ ఆర్టీసీ రూ.7.87 కోట్ల లాభాలను తెచ్చిపెట్టినట్టు లెక్కల్లో తేల్చారు. కానీ, సరైన పర్యవేక్షణ, ప్రణాళిక లేకుండా వ్యవహరించటం, భారీగా పెరిగిన సిబ్బంది జీతాలు, ఒకేసారి పెద్ద సంఖ్యలో తాత్కాలిక ఉద్యోగుల క్రమబద్ధీకరణ వెరసి... ఆర్టీసీ నష్టాలబాట పట్టింది.
ఏడాదికి రూ.వంద కోట్లలోపు నష్టాలతో మొదలై క్రమంగా అది రూ.2 వేల కోట్లకు చేరింది. రెండుమూడు పర్యాయాలు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం, మూడు నాలుగు నెలల్లో లాభాల్లోకి రాకుంటే ఆర్టీసీని ప్రైవేటీకరిస్తామంటూ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఇటీవల హెచ్చరించడంతో ఆర్టీసీ పనితీరులో మార్పు కనిపించడమేకాక లాభాలబాటపట్టింది.
డీజిల్ సెస్.. వంద రోజుల ప్రణాళిక
ఆర్టీసీ ఎండీ సజ్జనార్ రెండు నెలల క్రితం 100 రోజుల ప్రణాళిక ప్రారంభించి అధికారులు, సిబ్బందికి లక్ష్యాలు నిర్దేశించారు. దీంతో డిపోలలో నష్టాలు, ఖర్చులకు కొంత బ్రేక్ పడింది. డీజిల్ ఖర్చు భారీగా పెరిగినందున సజ్జనార్ డీజిల్ సెస్ ప్రవేశపెట్టారు. నెల రోజుల వ్యవధిలో మళ్లీ సెస్ సవరించారు. జూన్‌లో ఈ సవరింపు అమలులోకి రావడంతో రోజువారీ ఆదాయం రూ.2 కోట్ల కంటే ఎక్కువగా పెరుగుదల నమోదైంది.
జూన్ నెలాఖరులో భారీ వర్షాలు కురవటంతో ప్రయాణికుల సంఖ్య తగ్గి ఆదాయానికి కొంత గండిపడింది. లేని పక్షంలో కనీసం మరో 10 డిపోలు లాభాల్లోకి వచ్చేవని అధికారులు పేర్కొంటున్నారు. వానాకాలంలో సెప్టెంబర్ వరకు సాధారణంగా ఆదాయం పడిపోతుంది. మళ్లీ అక్టోబర్ తర్వాత పుంజుకోవటం సహజం.
2022 మే నెలలో డిపోలవారీ లాభాలు
పరిగి: రూ.2.53 లక్షలు, జహీరాబాద్: రూ.6 లక్షలు, నిజామాబాద్–1 డిపో రూ.11.75 లక్షలు, మిర్యాలగూడ: 38.53 లక్షలు, పికెట్: 62.46 లక్షలు, హైదరాబాద్–1 డిపో: 1.45 కోట్లు, హైదరాబాద్–2 డిపో: 1.28 కోట్లు, యాదగిరిగుట్ట: 2.62 కోట్లు చొప్పున లాభాలు సాధించాయి. వెరసి ఈ ఎనిమిది డిపోలు 6.5 కోట్ల లాభాలు సాధించిపెట్టాయి.
తాజాగా లాభాల్లోకి వచ్చిన 19 డిపోలు ఇవే
హైదరాబాద్–1, 2, పికెట్, మణుగూరు, దేవరకొండ, భద్రాచలం, కరీంనగర్, జగిత్యాల, వేములవాడ, యాదగిరిగుట్ట, పరిగి, వరంగల్–1, సత్తుపల్లి, నిర్మల్, గోదావరిఖని, నిజామాబాద్–1, సూర్యాపేట, నల్లగొండ, కోదాడ.
Comments
Please login to add a commentAdd a comment