సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రోత్సాహంతో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లో వర్జీనీయా పొగాకు డిమాండ్ పెరగడంతో పొగాకు పంట ఈ ఏడాది రైతు ఇంట సిరులు కురిపించింది. ఈ ఏడాది పొగాకు వేలంలో కేజీ పొగాకు రికార్డు స్థాయిలో ధర పలికింది.
బ్రైట్ గ్రేడ్, లోగ్రేడ్ అన్న తేడా లేకుండా అన్ని గ్రేడ్‌లకు రికార్డు ధరలు రావడంతో కేజీ పొగాకు సరాసరి ధర రూ.214గా నమోదైంది. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం పొగాకు బోర్డుపై ప్రత్యేక ఒత్తిడి తెచ్చి పొగాకు ముక్క (స్క్రాప్)ను వేలం కేంద్రాల్లోనే అమ్ముకునే వెసులుబాటు కలి్పంచడం, అదనపు పొగాకు పంట అమ్మకాలపై జరిమానాలు రద్దు చేయడంతో రైతుల ఆదాయం రెట్టింపు అయింది.
భారీగా పెరిగిన ఉత్పత్తి ..
పొగాకు బోర్డు ఒంగోలు రీజియన్ పరిధిలో ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలో 11 పొగాకు వేలం కేంద్రాలున్నాయి. వీటిలో కందుకూరు–1, కందుకూరు–2, కలిగిరి, డిసి పల్లి వేలం కేంద్రాలు నెల్లూరు జిల్లాలో ఉండగా, ఒంగోలు–1, ఒంగోలు–2, పొదిలి, కనిగిరి, కొండెపి, వెల్లంపల్లి, టంగుటూరు ప్రకాశం జిల్లా పరిధిలో ఉన్నాయి. వీటిని ఎస్‌బిఎస్ (సదరన్ బ్లాక్ సాయిల్), ఎస్‌ఎల్‌ఎస్ (సదరన్ లైట్ సాయిల్)గా విభజించారు.
వీటిలో ఎస్‌బిఎస్ పరిధిలో 5 వేలం కేంద్రాలుంటే, ఎస్‌ఎల్‌ఎస్ పరిధిలో 6 వేలం కేంద్రాలున్నాయి. ఎస్‌బిఎస్, ఎస్‌ఎల్‌ఎస్ పరిధిలో 2022–23 పంట సీజన్‌కు సంబంధించి 89.35మిలియన్ కేజీల పొగాకును అమ్ముకునేందుకు బోర్డు అనుమతి ఉంది. కాని ఇప్పటికే 122.34మిలియన్ కేజీల పొగాకు అమ్మకాలు జరిగాయి. పలు వేలం కేంద్రాల్లో ఈ నెలాఖరు వరకు వేలం జరిగే అవకాశం ఉండడంతో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. అంటే ఈ ఏడాది దిగుబడులు అధికంగా వచ్చినట్లు అర్ధమవుతుంది.
రికార్డు ధరలు ఈ ఏడాదే..
గత రెండేళ్ల నుంచి రికార్డు «పొగాకు మార్కెట్ ఆశాజనకంగా ఉన్నా.. ఈ ఏడాదిలోనే మార్కెట్‌లో రికార్డు ధరలు నమోదయ్యాయి. ఒంగోలు రీజియన్ పరిధిలో ఈ సీజన్‌లో బ్రైట్ గ్రేడ్ కేజీ పొగాకు అత్యధిక రూ. 288 పలికినా ప్రస్తుతం స్థిరంగా రూ. 280 ధర వస్తుంది.
అయితే ఈ ఏడాది గ్రేడ్‌లతో సంబంధం లేకుండా దాదాపు అన్ని గ్రేడ్‌లకు రేట్లు పెరగడంతో సరాసరి రేట్లు మొదటిసారి డబుల్ సెంచరీ దాటాయి. ఎస్‌బిఎస్, ఎస్‌ఎల్‌ఎస్ పరిధిలో ప్రస్తుతం కేజీ పొగాకు సరాసరి ధర రూ 214.47గా నమోదైంది. అంటే క్వింటా పొగాకు సరాసరిన రూ 21,300 వరకు ధర రావడం గమనార్హం.
రెండింతలైన బ్యారన్ కౌలు..
ఈ ఏడాది పొగాకు సాగులో వచి్చన లాభాలతో మరోసారి రైతులు పొగాకు పంట సాగుపై ఆసక్తి చూపుతున్నారు. దీంతో పొలాలు, బ్యారన్‌లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. దీంతో గతేడాది రూ.15వేలు ఉన్న పొలం కౌలు ప్రస్తుతం రూ.30వేల వరకు చెల్లించేందుకు వెనుకాడడం లేదు. అదే సందర్బంలో గతేడాది రూ.1లక్ష ఉన్న బ్యారన్ కౌలు ఈ ఏడాది రూ.2లక్షలు పలుకుతుంది.
ఈ ఫొటోలోని పొగాకు రైతు పేరు రావూరు వెంగళరెడ్డి. ఆత్మకూరు మండలం బోయలచిరివెళ్ళకు చెందిన ఆయన గత 13 సంవత్సరాలుగా పొగాకు పండిస్తున్నాడు. రెండు బ్యారెన్లు పంట సాగు చేస్తే గతేడాది పెద్దగా మిగిలిందేమీ లేదు. ఈ క్రమంలో 2022–23 వ్యవసాయ సీజన్‌లో తనకు సొంతంగా ఉన్న బ్యారెన్‌తో పాటు మర్రిపాడు మండలం డీసీపల్లిలో మరో ఆరు బ్యారెన్లు కౌలుకు తీసుకుని పొగాకు సాగు చేశాడు.
ఇందుకోసం రూ.70 లక్షలు బ్యాంకుల వద్ద, ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు చేశాడు. అంతకు ముందే అతనికి రూ. 70 లక్షల అప్పు ఉంది. అయితే ముందెన్నడూలేని విధంగా పొగాకు ధరలు పెరగడంతో గతంలో తనకున్న అప్పులన్నీ తీరి మరో పాతిక లక్షల రూపాయల ఆదాయం మిగిలిందని రైతు వెంగళరెడ్డి ఆనందంతో చెప్పాడు.
మర్రిపాడు మండలం డీసీపల్లికి చెందిన ఈ రైతు పేరు గోపిరెడ్డి రమణారెడ్డి. 30 ఏళ్లకుపైగా పొగాకు సాగు చేస్తున్నాడు. మూడు దశాబ్దాలకుపైగా పొగాకు సాగు చేస్తున్నా కుటుంబ అవసరాలు తీర్చడానికే తప్ప ఆరి్థకంగా పెద్దగా ఆదాయం మిగలలేదు. ఈనేపథ్యంలో 2022–23 వ్యవసాయ సీజన్‌లో తనకున్న ఒక్క బ్యారెన్‌తో పాటు మరో మూడు బ్యారెన్లు కౌలుకు తీసుకుని పొగాకు పంట సాగు చేశారు. ఈ ఏడాది వేలంలో ధరలు అమాంతం పెరిగిపోవడంతో అన్ని ఖర్చులు పోను రూ.60 లక్షలకుపైగా ఆదాయం మిగిలిందని సంతోషంగా చెప్పాడు.
పొగాకు రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం..
పొగాకు రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ రైతులకు మేలు చేసింది. మార్కెట్‌లో డిమాండ్ లేని సమయంలో రైతులను ఆదుకునేందుకు 2020–21 సీజన్‌లో నేరుగా మార్క్‌ఫెడ్‌ని రంగంలోకి దించి పొగాకు కొనుగోలు చేయించింది. ఈ ప్రభావంతో 2021–22 సీజన్ నుంచి పొగాకు మార్కెట్‌లో ఊహించని ధరలు రైతులకు లభిస్తున్నాయి.
ప్రస్తుతం 2022–23 సీజన్ అయితే రికార్డు ధరలతో అదరగొట్టింది. ఇదిలా ఉంటే బోర్డుపై ఒత్తిడి తేవడంతో అదనపు అమ్మకాలపై విధించే 5శాతం ఫెనాల్టీ ని రద్దు చేశారు. ఇప్పటి వరకు అదనపు పొగాకును అమ్ముకోవాలంటే 5శాతం ఫెనాల్టీ చొప్పున అంటే ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం క్వింటాకు రూ.1,500 నుంచి రూ.1,800 వరకు బోర్డుకు చెల్లించాల్సి వచ్చేది.
దీని వల్ల ఒక్కొక్క రైతుకు సరాసరిన రూ 40వేల నుంచి 60వేల వరకు లబ్ధి జరిగింది. ఇక స్క్రాప్(పొగాకు ముక్క)ను ఈ ఏడాది నేరుగా వేలం కేంద్రాల్లో అమ్ముకునేందుకు అవకాశం కల్పించింది. ప్రస్తుతం ఉన్న డిమాండ్ దృష్ట్యా పొగాకు ముక్కను కూడా వ్యాపారులు కేజీ రూ 150 వరకు వెచి్చంచి కొనుగోలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment