న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్(ఎస్‌బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికం(క్యూ1)లో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం 178 శాతం దూసుకెళ్లి రూ. 16,884 కోట్లను తాకింది. ఒక త్రైమాసికంలో ఇది అత్యధికంకాగా.. గతేడాది(2022–23) ఇదే కాలంలో కేవలం రూ. 6,068 కోట్లు ఆర్జించింది.
ఇందుకు మొండి రుణాలు తగ్గడం, వడ్డీ ఆదాయం పుంజుకోవడం దోహదపడ్డాయి. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన సైతం నికర లాభం రూ. 7,325 కోట్ల నుంచి రూ. 18,537 కోట్లకు దూసుకెళ్లింది. మొత్తం ఆదాయం రూ. 94,524 కోట్ల నుంచి రూ. 1,32,333 కోట్లకు ఎగసింది. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 3.91 శాతం నుంచి 2.76 శాతానికి, ఎన్‌పీఏలు 1 శాతం నుంచి 0.71 శాతానికి తగ్గాయి. నికర వడ్డీ మార్జిన్లు 0.24 శాతం మెరుగై 3.47 శాతంగా నమోదయ్యాయి. కనీస మూలధన నిష్పత్తి 1.13 శాతం పుంజుకుని 14.56 శాతాన్ని తాకింది.
వడ్డీ ఆదాయం ప్లస్
క్యూ1లో ఎస్‌బీఐ మొత్తం ఆదాయం(స్టాండెలోన్) సైతం రూ. 74,989 కోట్ల నుంచి రూ. 1,08,039 కోట్లకు జంప్ చేసింది. వడ్డీ ఆదాయం రూ. 72,676 కోట్ల నుంచి రూ. 95,975 కోట్లకు బలపడింది. అయితే నికర వడ్డీ ఆదాయం 25 శాతం ఎగసి రూ. 38,905 కోట్లను తాకింది. పొదుపు ఖాతాల్లో 63 శాతం, రిటైల్ ఆస్తులలో 35 శాతం యోనో(డిజిటల్) ద్వారా పొందినట్లు బ్యాంక్ చైర్మన్ దినేష్ ఖారా పేర్కొన్నారు.
ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్‌లో దాదాపు రూ. 490 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు వెల్లడించారు. అయితే సంస్థ ఐపీవో ప్రణాళికలను పునరుద్ధరించే యోచనలో లేనట్లు స్పష్టం చేశారు. రుణ నష్టాలకు ప్రొవిజన్లు 38 శాతం తగ్గి రూ. 2,652 కోట్లకు చేరాయి. గతేడాది క్యూ4(జనవరి–మార్చి)లో నమోదైన రూ. 1,278 కోట్లతో పోలిస్తే 107 శాతం అధికమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment