ముంబై: కరోనా మహమ్మారి ముందుస్థాయికి సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి కంపెనీలు(ఎంఎస్‌ఎంఈలు) నెమ్మదిగా చేరుకుంటున్నట్లు రేటింగ్ దిగ్గజం క్రిసిల్ నివేదిక పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరం(2022–23)లో దాదాపు అన్ని సంస్థలూ 2020 స్థాయి ఆదాయాన్ని సాధించగలవని అంచనా వేసింది. అయితే అప్పటి మార్జిన్లను సగానికిపైగా కంపెనీలు అందుకోలేకపోవచ్చని అభిప్రాయపడింది.
విలువరీత్యా 43 శాతం సంస్థలు కరోనా ముందు ఏడాది స్థాయిలో లాభదాయకతను సాధించలేకపోవచ్చని తెలియజేసింది. పెరిగిన కొన్ని కమోడిటీ ధరల భారాన్ని కస్టమర్లకు బదిలీ చేయలేకపోవడం, రూపాయి క్షీణత వంటి అంశాలు ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు వివరించింది. ఎంఎస్‌ఎంఈ రంగంలోని 69 రంగాలు, 67 క్లస్టర్లు ఆధారంగా క్రిసిల్ నివేదికను రూపొందించింది. ఉమ్మడిగా వీటి ఆదాయం రూ. 56 లక్షల కోట్లుకాగా.. జీడీపీలో 20–25 శాతం వాటాకు సమానమని క్రిసిల్ తెలియజేసింది. నివేదిక ప్రకారం..
బౌన్స్‌బ్యాక్
ఆదాయాన్ని పరిగణిస్తే ఈ ఏడాది మొత్త ఎంఎస్‌ఎంఈ రంగం కరోనా ముందుస్థాయితో పోలిస్తే 1.27 రెట్లు వృద్ధిని సాధించే అవకాశముంది. అయితే విలువరీత్యా 43 శాతం కంపెనీలు 2020 స్థాయి నిర్వహణ మార్జిన్లు అందుకోలేకపోవచ్చు. వీటిలో 30 శాతం కెమికల్స్, పాలు, డెయిరీ, ప్యాకేజ్‌డ్ ఫుడ్స్ తదితర రంగాలకు చెందిన సంస్థలుకాగా.. చమురు, పాల ధరలు ప్రభావం చూపనున్నాయి. మిగిలిన 13 శాతంలో ఫార్మా(బల్క్ డ్రగ్స్), జెమ్స్ అండ్ జ్యువెలరీ నుంచి నమోదుకానున్నాయి.
రూపాయి పతనం మార్జిన్లను దెబ్బతీయనుంది. మహమ్మారికి ముందు డాలరుతో మారకంలో రూపాయి విలువ 70.9కాగా.. 2022 అక్టోబర్‌లో 82.3కు జారింది. ఇక ముడిచమురు ధరలు సైతం 2020లో బ్యారల్‌కు సగటున 61 డాలర్లుకాగా.. ఏప్రిల్– అక్టోబర్ మధ్య 104 డాలర్లకు చేరింది. చమురు, చమురు డెరివేటివ్స్‌ను కెమికల్స్, డైలు, పిగ్మెంట్స్, రోడ్ల నిర్మాణం తదితర రంగాలలో వినియోగించే సంగతి తెలిసిందే. దీంతో కెమికల్స్, రోడ్ల నిర్మాణం రంగంలో 2.5–3 శాతం మార్జిన్లు నీరసించే వీలుంది. పాలు, డెయిరీ తదితరాలలో ఈ ప్రభావం 0.5–1 శాతానికి పరి మితం కావచ్చు.
చదవండి: ఎలాన్ మస్క్‌కు భారీ ఝలకిచ్చిన ఉద్యోగులు.. ఇప్పుడేం చేస్తావ్!
Comments
Please login to add a commentAdd a comment