భారత్, చైనా వంటి సుమారు 106 దేశాలు మధ్య ఆదాయ ఉచ్చు (మిడిల్ ఇన్‌కమ్ ట్రాప్)లో పడే ప్రమాదం ఉందని ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన ఓ నివేదికలో పేర్కొంది. దీని నుంచి తప్పించుకోవడానికి పెట్టుబడులు, ఆవిష్కరణలతో పాటు.. కొత్త టెక్నాలజీలను కూడా అభివృద్ధి చేయడం మీద దృష్టి సారించే 3i (ఇన్వెస్ట్‌మెంట్, ఇన్నోవేషన్, ఇన్‌ఫ్యూజన్) విధానాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందని వెల్లడించింది.
ఇండియా వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం అయినప్పటికీ.. ప్రస్తుత ట్రెండ్ ఇలంగో కొనసాగితే దేశ తలసరి ఆదాయం అమెరికా ఆదయ స్థాయిలలో నాలుగింట ఒక వంతుకు చేరుకోవడానికి దాదాపు 75 సంవత్సరాలు పట్టే అవకాశం ఉందని వరల్డ్ బ్యాంక్ తన నివేదికలో స్పష్టం చేసింది.
2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దార్శనికతను ప్రపంచ బ్యాంక్ తన 'వరల్డ్ డెవలప్‌మెంట్ రిపోర్ట్ 2024'లో.. స్వాతంత్య్ర శతాబ్దిగా ప్రస్తావించింది. భారతదేశం ఆర్థిక వ్యవస్థలో పరివర్తన సాధించాలని ఆశిస్తున్నప్పటికీ.. అది కొంత క్లిష్టంగా కనిపిస్తున్నట్లు వెల్లడించింది.
ఇప్పటికి కూడా అనేక దేశాలు గత శతాబ్దానికి చెందిన ప్లేబుక్‌ను ఉపయోగిస్తున్నాయి. ప్రధానంగా పెట్టుబడులను విస్తరించేందుకు రూపొందించిన విధానాలపై ఆధారపడుతూ ఉన్నయని.. ప్రపంచ బ్యాంక్ గ్రూప్ చీఫ్ ఎకనామిస్ట్ ఇండెర్మిట్ గిల్ పేర్కొన్నారు. ఇది మొదటి గేర్‌లోనే కారు నడుపుతూ వేగంగా ముందుకు వెళ్లాలనుకోవడంలాంటిదని అన్నారు.
ఇది ఇలాగే కొనసాగితే.. అమెరికా తలసరి ఆదాయంలో నాలుగింట ఒక వంతుకు చేరుకోవడానికి ఇండియాకు 75 ఏళ్ళు, చైనాకు 10 సంవత్సరాలు, ఇండోనేషియా దాదాపు 70 సంవత్సరాలు పడుతుందని గిల్ అన్నారు. చైనా, ఇండియా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా వంటి దేశాలు రాబోయే కొన్ని దశాబ్దాల్లో తీవ్రమైన అడ్డంకులను ఎదుర్కునే అవకాశం ఉందని ఆయన అన్నారు. 1990 నుంచి కేవలం 34 దేశాలు మాత్రమే మిడిల్ ఇన్‌కమ్ ట్రాప్ నుంచి తప్పించుకోగలిగాయని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment