
న్యూఢిల్లీ: టెలికం రంగంలో ఒకటి, రెండు సంస్థల గుత్తాధిపత్యానికి అవకాశం లేదని ఆ శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ స్పష్టం చేశారు. ప్రభుత్వరంగ బీఎస్‌ఎన్‌ఎల్ స్థిరమైన కంపెనీగా అవతరించనుందని చెప్పారు. వొడాఫోన్ ఐడియా సంస్థ కస్టమర్లను కోల్పోతూ, ఆర్థికంగా బలహీనపడుతుండడంతో, టెలికం రంగం ఇక ద్విఛత్రాధిపత్యం (డ్యుయోపలీ) కిందకు వెళుతుందన్న ఆందోళనలు వ్యక్తం అవుతుండడంతో మంత్రి స్పందించారు. ఈ ఆందోళలను ఆయన తోసిపుచ్చారు.
ప్రస్తుతం టెలికం మార్కెట్లో జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాతోపాటు, ప్రభుత్వరంగం నుంచి బీఎస్‌ఎన్‌ఎల్ ఉన్న విషయం తెలిసిందే. నిర్వహణ పరంగా బీఎస్‌ఎన్‌ఎల్ నిలదొక్కుకుంటున్నట్టు మంత్రి వైష్ణవ్ చెప్పారు. ‘‘బీఎస్‌ఎన్‌ఎల్ నిర్వహణ లాభాలను ప్రస్తుతం ఆర్జిస్తోంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ది టర్న్‌అరౌండ్ స్టోరీ (పరిస్థితి మారిపోవడం). బీఎస్‌ఎన్‌ఎల్ భారత 4జీ, 5జీ టెక్నాలజీని వినియోగించబోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇదే తరహా సాంకేతిక పరిజ్ఞానాల కంటే మెరుగైనవి’’అని మంత్రి వివరించారు.
నాలుగు సంస్థలు వర్ధిల్లుతాయా లేక మూడు రాణిస్తూ, ఒకటి సమస్యలను ఎదుర్కొంటుందా? అన్న ప్రశ్నకు మార్కెట్ నిర్ణయిస్తుందన్నారు. సరైన ఏర్పాట్లు, వసతులు ఉంటే వచ్చే ఐదేళ్లలో భారత్ అతిపెద్ద సెమీ కండక్టర్ తయారీ కేంద్రంగా అవతరిస్తుందంటూ, ఈ దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. సెమీ కండక్టర్ పరిశ్రమకు రూ.76,000 కోట్ల ప్రోత్సాహకాలను కేంద్రం ప్రకటించడం తెలిసిందే.
ఇదీ చదవండి: Ameera Shah: కూతురొచ్చింది! చిన్న ల్యాబ్‌ను రూ.వేల కోట్ల సంస్థగా మార్చింది..
Comments
Please login to add a commentAdd a comment