తాళ్లరేవు: మహిళా సంఘాల ఆర్థిష్టేక పరిపుష్టే ధ్యేయంగా, గ్రామీణ మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన చేయూత మహిళా మార్ట్ లాభాల బాటలో నడుస్తోంది. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరంగిలో ఏర్పాటు చేసిన ఈ మార్ట్ ప్రారంభించిన సుమారు నాలుగు నెలల వ్యవధిలోనే రూ.కోటిన్నరకు పైగా విక్రయాలతో రికార్డు సృష్టించింది. మంగళవారం నాటికి రూ.1.55 కోట్ల మేర అత్యధిక సరాసరి విక్రయాల ద్వారా కోరంగిలోని చేయూత మహిళా మార్ట్ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది.
తాళ్లరేవు మండలంలోని సుమారు 2,200 మహిళా సంఘాల్లోని దాదాపు 22 వేల మంది మహిళల భాగస్వామ్యంతో ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీన రూ.70 లక్షల పెట్టుబడితో కోరంగి మహిళా మార్ట్‌ను ప్రారంభించారు. కార్పొరేట్ మార్ట్‌లకు ఏమాత్రం తీసిపోని విధంగా దీనిలో అన్ని సౌకర్యాలూ కల్పించారు. ఇక్కడ పూర్తిగా మహిళలే వ్యాపార లావాదేవీలు సాగిస్తారు. మహిళా గ్రూపుల సభ్యులతో పాటు ఇతర ప్రజలు కూడా ఈ మార్ట్‌లో సరకులు కొనుగోలు చేస్తున్నారు.
ప్రజలకు అవసరమైన అన్ని రకాల నిత్యావసర వస్తువులతో పాటు, స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన వివిధ రకాల వస్తువులను సైతం ఇక్కడ విక్రయిస్తున్నారు. సరసమైన ధరలకు విక్రయిస్తూండటంతో ఈ మార్ట్‌లో అన్ని వర్గాల ప్రజలూ సరకులు కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా మార్ట్ లాభాల బాటలో నడుస్తోంది. దీనిపై స్వయం సహాయక సంఘాల మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అందరి సహకారంతో..
కోరంగిలోని చేయూత మార్ట్ లాభాల బాటలో నడుస్తోంది. ప్రారంభించిన రెండు నెలల్లోనే విక్రయాలు రూ.కోటి దాటగా, మూడు నెలలు పూర్తయ్యేసరికి రూ.కోటిన్నర పైగా అమ్మకాలు చేసి, రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. మంచి లాభాలు వస్తున్నాయి. గ్రామ సంఘాల అసిస్టెంట్లు, కమ్యూనిటీ కో ఆర్డినేటర్లు, జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారుల సహాయ సహకారాలతో ఈ ఘనత సాధించాం. – రెడ్డి సన్యాసిరావు, ఏపీఎం, వైఎస్సార్ క్రాంతి పథం
ప్రజల నుంచి విశేష స్పందన
అన్ని రకాల నిత్యావసరాలతో పాటు కార్పొరేట్ మార్ట్‌లలో ఉండే అత్యాధునిక వస్తువులు సైతం మా వద్ద అందుబాటు ధరల్లో లభ్యమవుతున్నాయి. దీంతో ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. ప్రజల ఆకాంక్షల మేరకు వారికి అవసరమైన వస్తువులను సైతం మావద్ద ఉంచుతున్నాం. ఉదయం నుంచి రాత్రి వరకూ స్టోర్ తెరచి ఉంచడంతో ఆశించిన స్థాయిలో విక్రయాలు జరుగుతున్నాయి. – తాతపూడి మహేష్, స్టోర్ మేనేజర్, చేయూత మహిళా మార్ట్
చాలా ఆనందంగా ఉంది
కోరంగిలోని చేయూత మహిళా మార్ట్ లాభాల బాటలో నడవడం చాలా ఆనందంగా ఉంది. మా మార్ట్‌లో సుమారు 10 మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. వస్తువుల విక్రయాల నుంచి సరఫరా వరకూ అన్నీ మహిళలే చేస్తారు. మార్ట్ నిర్వహణకు సంబంధించి మహిళా సంఘాల సభ్యులతో కొనుగోలు, పర్యవేక్షణ, నిర్వహణ, తనిఖీలకు నాలుగు కమిటీలు వేశాం. వ్యాపార లావాదేవీలు పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నాం. వ్యాపార రంగంలో సైతం మహిళలు సత్తా చాటుకునే విధంగా తోడ్పాటు అందించిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు. – దండుప్రోలు నూకరత్నం, ప్రెసిడెంట్, చేయూత మహిళా మార్ట్, కోరంగి, తాళ్లరేవు మండలం
Comments
Please login to add a commentAdd a comment