ఇవి షేర్లా.. బుల్లెట్‌ రైళ్లా... లాభాలతో ఇన్వెస్టర్ల ఉక్కిరి బిక్కిరి | IRCTC Shares Again Touched All Time High | Sakshi
Sakshi News home page

ఇవి షేర్లా.. బుల్లెట్‌ రైళ్లా... లాభాలతో ఇన్వెస్టర్ల ఉక్కిరి బిక్కిరి

Published Thu, Oct 14 2021 4:00 PM | Last Updated on Thu, Oct 14 2021 5:11 PM

IRCTC Shares Again Touched All Time High - Sakshi

వియ్‌ డోంట్‌ బ్రేక్‌ రికార్డ్స్‌, వియ్‌ క్రియేట్‌ రికార్డ్స్‌ ఈ క్యాప్షన్‌ ఓ సినిమా ప్రచారానికి సంబంధించింది. ఇప్పుడు ఇదే క్యాప్షన్‌ ఐఆర్‌సీటీసీ షేర్లకు అన్వయించే పరిస్థితి స్టాక్‌ మార్కెట్‌లో నెలకొంది. పాత రికార్డుల సంగతి దేవుడెరుగు వారానికో కొత్త రికార్డు నమోదు  చేస్తూ ముందుకు సాగుతోంది.

గత రెండు వారాలుగా స్టాక్‌ మార్కెట్‌లో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన ఐఆర్‌సీటీసీ షేర్లు మరోసారి దుమ్ము రేపాయి. ఈ కంపెనీ షేర్లతో ఒక్కసారిగా వచ్చిపడుతున్న లాభాలతో ఇన్వెస్టర్లు ఉక్కిరి బిక్కిరి అవుతుండగా మరోవైపు ఈ  దూకుడుకు కారణాలు వెతికే పనిలో మార్కెట్‌ విశ్లేషకులు ఉన్నారు. 

ఆల్‌టైం హై
ఆన్‌లైన్‌లో రైలు టిక్కెట్స్‌ బుకింగ్‌ సర్వీసును అందించే ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌, టూరిజం కార్పోరేషన్‌ లిమిటెడ్‌ సంస్థ షేర్లు బుల్లెట్‌ రైలును తలపిస్తున్నాయి. సరిగ్గా వారం రోజుల కిందట ఆల్‌టైం హై ధరగా ఒక్కో షేరు ధర రూ.4786లు పలికింది. దీంతో చాలా మంది విశ్లేషకులు ఇంత కంటే ధర పెరగడం కష్టమంటూ పేర్కొన్నారు. లాభాలు స్వీకరించాలనుకునే వారు ఇక్కడే షేర్లను అమ్మివేయడం బెటర్‌ అంటూ సూచించారు. కానీ వారి అందరి అంచనాలు వారం రోజుల వ్యవధిలో తలకిందులయ్యాయి.

ఐదు వేలు అలవోకగా
ఐఆర్‌సీటీసీ షేర్లకు 5000 దగ్గర రిసిస్టెన్స్‌ తప్పదని అంచనాలు నెలకొన్నాయి. ఐదు వేల మార్క్‌ చేరుకునేందుకు చాలా సమయం పడుతుందంటూ ఊహాగానాలు వెలువడ్డాయి. కానీ అదంతా తప్పని తేలియపోయింది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఒక్కో షేరు రూ. 4786 నుంచి రూ. 5480కి చేరుకుని సరికొత్త రికార్డు సృష్టించింది. గత వారం ఆల్‌టైం హై దగ్గర అనుమానంగా ఈ కంపెనీ షేర్లను కొన్నవారికి సైతం భారీ లాభాలను అందించింది ఐఆర్‌సీటీసీ.

ఏడాది క్రితం
సరిగ్గా ఏడాది కిందట అక్టోబరు 15న ఐఆర్‌సీటీసీ షేరు ధర రూ. 1329గా నమోదు అయ్యింది. అప్పటి నుంచి ప్యాసింజర్‌ రైలు తరహాలో నెమ్మదిగా షేరు ధర పెరుగుతూ వచ్చింది. 2021 జులై మొదటి వారంలో ఒక్కో షేరు ధర రూ. 2300లకు అటుఇటుగా నమోదు అయ్యింది. ఆ తర్వాత ఎక్స్‌ప్రెస్‌ వేగం అందుకుని కేవలం రెండు నెలల వ్యవధిలో అంటే సెప్టెంబరు మొదటి వారం నాటికి ఒక్కో షేరు ధర రూ. 3300లను టచ్‌ చేసింది. ఆ తర్వాత సూపర్‌ఫాస్ట్‌ వేగంతో నాలుగు వేలు,. బుల్లెట్‌ రైలు వేగంతో ఐదువేలు క్రాస్‌ చేసి ఆల్‌టైం హై రూ. 5480ని టచ్‌ చేసింది.
అందువల్లేనా
కోవిడ్‌ అనంతరం రైలు ప్రయాణాలు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. దేశం మొత్తం మీద ఆన్‌లైన్‌లై టిక్కెట్టు అందించే వ్యవస్థ ఐఆర్‌సీటీసీ ఒక్కటే ఉంది. కాబట్టి ఈ కంపెనీ పనితీరుకి ఢోకా లేదనే నమ్మకం ఇన్వెస్టర్లలో నెలకొందని జీసీఎల్‌ సెక్యూరిటీస్‌ వైస్‌ చైర్మన్‌ రవి సింఘాల్‌ అభిప్రాయపడ్డారు. మరోవైపు ఒక్క రైలు టిక్కెట్స్‌ అమ్మకమే కాకుండా దాదాపుగా అన్ని నగరాల్లో ఆతిధ్య సేవలు అందివ్వడం పైనా ఐఆర్‌సీటీసీ దృష్టి పెట్టిందని, ఇప్పటికే హోటల్‌ చెయిన్స్‌తో ఒప్పందాలు కూడా ఖరారు అయ్యాయని ఛాయిస్‌ బ్రోకింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సుమిత్‌ బగాడియా అంటున్నారు. 
లాభాలు ఇలా
సరిగ్గా ఏడాది కిందట ఐఆర్‌సీటీసీ షేరు ధర రూ. 1329గా నమోదు అయ్యింది. అప్పుడు రూ.1,32,900లను ఇన్వెస్ట్‌ చేసి వంద షేర్లు కొంటే ఇప్పుడు వాటి విలువ ఏకంగా రూ. 5,48,000 చేరుకుంది. అంటే ఏడాదిలో నికరంగా రూ. 4,16,900 లాభం అందింది. ఇక గత వారం రూ. 4,78,600 వెచ్చింది వంద షేర్లు కొన్న వారికి సైతం సుమారు రూ.70,000ల లాభం అందింది. స్టాక్‌మార్కెట్లో టాటా గ్రూపు జోరు మధ్య సైతం ఐఆర్‌సీటీసీ తన వేగాన్ని కొనసాగిస్తోంది. 


చదవండి: ఇదేం కెమిస్ట్రీ బాబు!... షేర్ల ధర అలా పెరిగింది.. కనక వర్షమే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement