న్యూఢిల్లీ: ఆటో రంగ దేశీ దిగ్గజం టాటా మోటార్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికంలో టర్న్‌అరౌండ్ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో రూ. 3,301 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 4,951 కోట్ల నికర నష్టం ప్రకటించింది.
లగ్జరీకార్ల బ్రిటిష్ అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్‌రోవర్(జేఎల్‌ఆర్)తోపాటు వాణిజ్య వాహన బిజినెస్ పుంజుకోవడం కంపెనీ పటిష్ట పనితీరుకు దోహదపడ్డాయి. ఇక మొత్తం ఆదాయం సైతం రూ. 71,228 కోట్ల నుంచి రూ. 1,01,528 కోట్లకు జంప్‌చేసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 77,784 కోట్ల నుంచి రూ. 98,267 కోట్లకు ఎగశాయి. ఈ కాలంలో టాటా మోటార్స్ స్టాండెలోన్ నష్టం రూ. 181 కోట్ల నుంచి రూ. 64 కోట్లకు తగ్గింది. మొత్తం ఆదాయం రూ. 14,793 కోట్ల నుంచి రూ. 15,733 కోట్లకు బలపడింది.
జేఎల్‌ఆర్ జూమ్...
ప్రస్తుత సమీక్షా కాలంలో జేఎల్‌ఆర్ ఆదాయం 57 శాతం జంప్‌చేసి 6.9 బిలియన్ పౌండ్లను తాకగా.. 43.5 కోట్ల పౌండ్ల పన్నుకు ముందు లాభం ఆర్జించింది. కొత్త ఏడాదిని పటిష్టంగా ప్రారంభించినట్లు జేఎల్‌ఆర్ కొత్త సీఈవో అడ్రియన్ మార్డెల్ పేర్కొన్నారు. క్యూ1లో రికార్డ్ క్యాష్‌ఫ్లోను సాధించినట్లు వెల్లడించారు. ఈ ఏడాది మొత్తం క్యూ1 స్థాయి పనితీరు చూపగలమని విశ్వసిస్తున్నట్లు గ్రూప్ సీఎఫ్‌వో పీబీ బాలాజీ పేర్కొన్నారు.
ఇదీ చదవండి ➤ SEBI Notices To Yes Bank Ex CEO: యస్ బ్యాంక్ రాణా కపూర్‌కు సెబీ నోటీసు.. రూ. 2.22 కోట్లు కట్టాలి
కాగా.. వాణిజ్య వాహన విభాగం ఆదాయం 4.4 శాతం పుంజుకుని రూ. 17,000 కోట్లను తాకింది. దేశీయంగా హోల్‌సేల్ అమ్మకాలు 14 శాతం క్షీణించి 82,400 యూనిట్లకు చేరగా.. రిటైల్ విక్రయాలు ఇదే స్థాయిలో నీరసించి 77,600 యూనిట్లకు పరిమితమయ్యాయి. ప్రయాణికుల వాహన విభాగం ఆదాయం 11 శాతం ఎగసి రూ. 12,800 కోట్లను తాకినట్లు కంపెనీ ఈడీ గిరీష్ వాగ్ తెలియజేశారు. అమ్మకాలు 8 శాతం వృద్ధితో 1,40,400 యూనిట్లకు చేరినట్లు వెల్లడించారు.
బలమైన జూన్ త్రైమాసిక ఆదాయాలతో బుధవారం (జులై 26) ట్రేడింగ్‌లో ఎన్‌ఎస్‌ఈలో టాటా మోటార్స్ షేర్లు 4 శాతానికి పైగా జంప్ చేసి 52 వారాల గరిష్ట స్థాయి రూ.665.40కి చేరుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment