ముంబై: స్టాక్ మార్కెట్లో లాభాల పరంపర కొనసాగుతోంది. ప్రోత్సాహకర కార్పొరేట్ క్యూ4 ఆదాయాలు, మెరుగైన స్థూల ఆర్థిక గణాంకాలు దన్నుతో సూచీలు మూడు నెలల గరిష్టం వద్ద ముగిశాయి. అధిక వెయిటేజీ షేర్లు రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్ షేర్లు రాణించడంతో పాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు కొనసాగడం కలిసొచ్చాయి. ఒకరోజు సెలవు తర్వాత ప్రారంభమైన సూచీలు లాభాలతో మొదలయ్యాయి.
సెన్సెక్స్ 190 పాయింట్లు పెరిగి 61,302 వద్ద, నిఫ్టీ 60 పాయింట్లు బలపడి 18,125 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఆటో, ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఒక దశలో సెన్సెక్స్ 374 పాయింట్లు ర్యాలీ చేసి 61,486 వద్ద, నిఫ్టీ 115 పాయింట్లు దూసుకెళ్లి 18,180 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. అయితే యూరప్ మార్కెట్ల బలహీన ట్రేడింగ్ ప్రభావంతో చివర్లో కొంత లాభాల స్వీకరణ చోటు చేసుకుంది.
ఆఖరికి సెన్సెక్స్ 242 పాయింట్ల లాభంతో 61,355 వద్ద స్థిరపడింది. ఈ సూచీకిది వరుసగా ఎనిమిదోరోజూ లాభాల ముగింపు. నిఫ్టీ 83 పాయింట్లు పెరిగి 18,148 వద్ద ముగిసింది. కాగా ఈ ఇండెక్స్‌కిది అయిదోరోజూ లాభం ముగింపు కావడం విశేషం. వరుస ర్యాలీ క్రమంలో సూచీలు మూడు నెలల గరిష్టానికి చేరుకున్నాయి. ఎఫ్‌ఎంసీసీ, టెలీకమ్యూనికేషన్స్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.
విస్తృత స్థాయి మార్కెట్లో బీఎస్‌ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు అరశాతానికి పైగా లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1997 కోట్ల షేర్లను, సంస్థాగత ఇన్వెస్టర్ల రూ.394 కోట్ల షేర్లను కొన్నారు. డాలర్ మారకంలో రూపాయి విలువ ఐదుపైసలు బలహీనపడి 81.87 వద్ద స్థిరపడింది. ఫెడ్ రిజర్వ్ ద్రవ్య విధాన సమావేశ ప్రారంభానికి ముందు(మంగళవారం రాత్రి) ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి.
‘‘ప్రోత్సాహకర కార్పొరేట్ క్యూ4 ఆదాయాలు, మెరుగైన స్థూల ఆర్థిక గణాంకాలు దన్నుతో దేశీయ స్టాక్ సూచీలు లాభాలు గడించాయి. ప్రస్తుతం సాంకేతికంగా నిఫ్టీకి ఎగువ స్థాయిలో 18180 – 18200 శ్రేణిలో కీలక నిరోధం కలిగి ఉంది. దిగువ స్థాయిలో 18050 – 18000 పరిధిలో తక్షణ మద్దతు కలిగి ఉందని’’ జియోజిత్ ఫైనాన్స్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.
మార్కెట్లో మరిన్ని సంగతులు
♦ డిజిటల్ ట్రాన్స్‌ఫర్‌మేషన్ ప్లాట్‌ఫామ్ న్యూజెన్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ షేరు 16 శాతం పెరిగి రూ.566 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో 18 శాతం ఎగిసి రూ.595 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. మార్చి క్వార్టర్‌లో కంపెనీ నికర లాభం 63% వృద్ధితో రూ.79 కోట్లను సాధించడం ఈ షేరుకు డిమాండ్ పెరిగింది.
♦ ఏప్రిల్‌లో ఎన్‌ఎండీసీ ఉత్పత్తి, అమ్మకాలు రెండంకెల వృద్ధిని సాధించడంతో ఈ ప్రభుత్వ రంగ కంపెనీ షేరు రాణించింది. బీఎస్‌ఈలో ఒకటిన్నర శాతం బలపడి రూ.110 వద్ద స్థిరపడింది.
♦ కేంద్రం ముడి చమురు ఉత్పత్తిపై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఓఎన్‌జీసీ షేరు మూడున్నర శాతం లాభపడి రూ.164 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment