మార్కెట్‌... ఆద్యంతం ఊగిసలాట | Stock Market: Sensex Skids 236 Points Nifty Ends At 16, 125 Amid Volatility | Sakshi
Sakshi News home page

మార్కెట్‌... ఆద్యంతం ఊగిసలాట

Published Wed, May 25 2022 2:14 AM | Last Updated on Wed, May 25 2022 2:14 AM

Stock Market: Sensex Skids 236 Points Nifty Ends At 16, 125 Amid Volatility - Sakshi

ముంబై: స్టాక్‌ మార్కెట్‌లో రెండోరోజూ ఒడిదుడుకుల ట్రేడింగ్‌ కొనసాగింది. ఆరంభ లాభాల్ని నిలుపుకోవడంతో విఫలమైన సూచీలు మంగళవారమూ పతనాన్ని చవిచూశాయి. ట్రేడింగ్‌లో 638 పాయింట్లు బలపడిన సెన్సెక్స్‌ చివరికి 236 పాయింట్ల నష్టంతో 54,053 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 183 పాయింట్లు లాభపడింది. మార్కెట్‌ ముగిసే సరికి 90 పాయింట్లను కోల్పోయి 16,125 వద్ద నిలిచింది.

ఆర్థిక షేర్లు మినహా అన్ని రంగాల షేర్లూ నష్టపోయాయి. ఐటీ షేర్లు ఎక్కువగా క్షీణించాయి. బీఎస్‌ఈ స్మాల్, మిడ్‌క్యాప్‌ సూచీలు ఒకశాతం చొప్పున పతనమయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,393 కోట్ల షేర్లు అమ్మేయగా.., దేశీయ ఇన్వెస్టర్లు రూ.1,948 కోట్ల షేర్లను కొన్నారు. యూఎస్‌ ఫెడ్‌ మినిట్స్‌ వెల్లడి(బుధవారం రాత్రి)కి ముందు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభనష్టాల మధ్య ట్రేడ్‌ అవుతున్నాయి.

‘‘దేశీయ మార్కెట్‌ దిద్దుబాటు దశలో ఉంది. అధిక వ్యాల్యుయేషన్లు సాధారణ స్థాయికి దిగివచ్చాయి. అయితే ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పెంపు ర్యాలీకి ప్రతిబంధకాలు మారాయి. విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ, రూపాయి బలహీనత సెంటిమెంట్‌ను మరింత బలహీనపరుస్తున్నాయి’’ అని ఈక్వైరీ క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్స్‌ చీప్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారి సామ్రాట్‌ దాస్‌గుప్తా అభిప్రాయపడ్డారు. 

వీనస్‌ లిస్టింగ్‌ భేష్‌ 
వీనస్‌ పైప్స్‌–ట్యూబ్స్‌ షేరు లిస్టింగ్‌ రోజే అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. ఇష్యూ ధర రూ.326 ధరతో పోలిస్తే బీఎస్‌ఈలో ఈ షేరు మూడు శాతం ప్రీమియంతో రూ.335 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే భారీగా కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఎమినిది శాతం ఎగసి రూ.352 వద్ద అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. 

డెల్హివరీ కూడా...
లాజిస్టిక్స్, సప్లై చైన్‌ సేవల కంపెనీ డెల్హివరీ ఐపీఓ లిస్టింగ్‌  హిట్‌ అయ్యింది. ఇష్యూ ధర రూ.487తో పోలిస్తే 1% లాభంతో రూ.493 లిస్టయ్యింది. 17% బలపడి రూ.569 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరికి పదిశాతం లాభంతో రూ.537 వద్ద ముగిసింది. మార్కెట్‌ ముగిసే సరికి కంపెనీ విలువ రూ.38,924 కోట్లుగా నమోదైంది.

ఈ–ముద్ర ఐపీవో సక్సెస్‌ 
డిజిటల్‌ సిగ్నేచర్‌ సర్టిఫికెట్ల సేవలందించే సంస్థ ఈ–ముద్ర పబ్లిక్‌ ఇష్యూ విజయవంతమైంది. ఇష్యూ చివరి రోజు మంగళవారానికల్లా 2.72 రెట్లు అధికంగా సబ్‌స్క్రిప్షన్‌ లభించింది. ఐపీవోలో భాగంగా కంపెనీ 1,13,64,784 షేర్లను ఆఫర్‌ చేయగా.. 3.09 కోట్లకుపైగా షేర్ల కోసం బిడ్స్‌ దాఖలయ్యాయి. ఎన్‌ఎస్‌ఈ గణాంకాల ప్రకారం అర్హతగల కొనుగోలుదారుల(క్విబ్‌) విభాగంలో 4.05 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 1.28 రెట్లు అధికంగా బిడ్స్‌ దాఖలయ్యాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement