నష్టాల్లోంచి లాభాల్లోకి సూచీలు
సెన్సెక్స్ లాభం 305 పాయింట్లు
76 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
కలిసొచ్చిన ప్రపంచ మార్కెట్ల రికవరీ
ముంబై: దేశీయ స్టాక్ సూచీలు రెండు రోజుల నష్టాల నుంచి గట్టెక్కాయి. ఐటీ, ఆటో షేర్లు రాణించడంతో పాటు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో రికవరీ ర్యాలీ కలిసిరావడంతో మంగళవారం అరశాతం లాభపడ్డాయి. సెన్సెక్స్ 305 పాయింట్లు పెరిగి 73,095 వద్ద నిలిచింది. నిఫ్టీ 76 పాయింట్లు బలపడి 22,200 స్థాయి చేరువులో 22,198 వద్ద స్థిరపడింది. ఉదయం బలహీనంగా మొదలైన సూచీలు ప్రథమార్థంలో నష్టాలతో ట్రేడయ్యాయి. మిడ్ సెషన్ నుంచి ఐటీ, ఆటో, మెటల్, ఫార్మా, ప్రైవేట్ బ్యాంకుల షేర్లు రాణించడంతో నష్టాల్లోంచి లాభాల్లోకి మళ్లాయి. ఒక దశలో సెన్సెక్స్ 371 పాయింట్లు దూసుకెళ్లి 73,161 వద్ద, నిఫ్టీ 96 పాయింట్లు పెరిగి 22,218 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకున్నాయి. కమోడిటీ, ఫైనాన్షియల్ సర్విసెస్, టెలీ కమ్యూనికేషన్, యుటిలిటీ, ఇంధన షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.
బీఎస్‌ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.25 %, 0.10 % నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,509 కోట్ల షేర్లు అమ్మారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2,861 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. యూరప్ మార్కెట్లు అరశాతం లాభపడ్డాయి. అమెరికా స్టాక్ ఫ్యూచర్లు అరశాతం లాభంతో ట్రేడవుతున్నాయి. కాగా పేటీఎం షేరు ఆరంభ లాభాలు నిలుపుకోలేకపోయింది. ఇంట్రాడేలో 5% ఎగసి రూ.449 వద్ద అప్పర్ సర్క్యూట్ తాకింది. అయితే ఆరంభ లాభాలు నిలుపుకోవడంలో విఫలమైంది. చివరికి 0.11% నష్టపోయి రూ. 427.50 వద్ద నిలిచింది.
ట్రేడింగ్‌లో రూ.449 వద్ద గరిష్టాన్ని, రూ.413.55 వద్ద కనిష్టాన్ని తాకింది. టీసీఎస్ షేరు 2.50% ర్యాలీ చేసి రూ.4103 వద్ద ముగిసింది. అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ యూబీఎస్ ఈ షేరు రేటింగ్‌ను ‘న్యూట్రల్’ నుంచి ‘బై’కు అప్‌గ్రేడ్ చేయడంతో పాటు టార్గెట్ ధరను రూ.4,000 నుంచి రూ.4,700కు పెంచింది. ట్రేడింగ్‌లో 3.25% పెరిగి రూ.4,125 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది.
Comments
Please login to add a commentAdd a comment