వెలుగులో పీఎస్‌యూ బ్యాంకు షేర్లు
- 45 పాయింట్లు క్షీణించి 27,206 పాయింట్లకు సెన్సెక్స్
- 11 పాయింట్లు నష్టపోయి 8,224కు చేరిన నిఫ్టీ
ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులమయంగా సాగిన గురువారం నాటి ట్రేడింగ్‌లో స్టాక్ మార్కెట్ స్వల్ప నష్టాల్లో ముగిసింది. బుధవారం బాగా పెరిగిన షేర్లలో లాభాల స్వీకరణ, ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉండడం ట్రేడింగ్‌పై ప్రభావం చూపిందని నిపుణులు పేర్కొన్నారు. మొత్తం మీద బీఎస్‌ఈ సెన్సెక్స్ 45 పాయింట్ల నష్టంతో 27,206 పాయింట్ల వద్ద, నిఫ్టీ 11 పాయింట్ల నష్టంతో 8,224 పాయింట్ల వద్ద ముగిశాయి.
డాలర్‌తో రూపాయి మారకం విలువ పుంజుకోవడంతో ఎగుమతి ఆధారిత ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో తదితర ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ జరగడం, కంపెనీల క్యూ4 ఫలితాలు అంతంతమాత్రంగానే ఉండడం, కీలక బిల్లుల ఆమోదంపై అనిశ్చితి, వర్షాలు సాధారణం కన్నా తక్కువగానే కురుస్తాయన్న అంచనాలు ట్రేడింగ్‌పై ప్రభావం చూపాయి. టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం కొత్త కనిష్ట స్థాయిలకు చేరడంతో కీలక రేట్ల కోతపై అంచనాలు పెరిగాయి. ఫలితంగా ఇన్వెస్టర్లు బ్యాంక్ షేర్లను భారీగా కొనుగోలు చేశారు.
దీనితోపాటు స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరిపారు. దీంతో స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప నష్టాలనే నమోదు చేశాయి. ఐటీ, కన్సూమర్ డ్యూరబుల్స్, టెక్నాలజీ, క్యాపిటల్ గూడ్స్, ఆరోగ్య సంరక్షణ షేర్లు నష్టపోగా, పీఎస్‌యూ బ్యాంకింగ్, రియల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్, వాహన, లోహ, విద్యుత్ షేర్లు పెరిగాయి. టర్నోవర్ బీఎస్‌ఈలో రూ.2,965 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈలో రూ.16,096 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.2,16,908 కోట్లుగా నమోదైంది.