ప్రపంచమార్కెట్లలో కరోనా ప్రళయం కొనసాగుతూనే ఉంది. మహా పతనాల బాటలో స్టాక్‌మార్కెట్లు శుక్రవారం కూడా మరింత అధఃపాతాళానికి పడిపోయాయి. భారత్‌లో తొలి కరోనా మరణం నమోదు కావడంతో మార్కెట్ మరోమారు అత్యంత ఘోరంగా కుప్పకూలింది. అయితే, అంతేవేగంతో నేలక్కొట్టిన బంతిలా మార్కెట్ దూసుకెళ్లి ఇన్వెస్టర్లకు అసలుసిసలు రోలర్ కోస్టర్ రైడ్‌ను చూపించింది. గడిచిన 12 ఏళ్లలో ఎన్నడూ జరగని రీతిలో తొలిసారి మన స్టాక్ మార్కెట్లో మళ్లీ ట్రేడింగ్ నిలిపేయాల్సిన పరిస్థితి తలెత్తింది.
ఒకానొక దశలో సెన్సెక్స్ 3,389 పాయింట్లు నష్టపోయి... ఆ కనిష్ట స్థాయి నుంచి 5,380 పాయింట్లు దూసుకెళ్లడం తీవ్రమైన ఒడిదుడుకులకు నిదర్శనం. చివరకు 1,325 పాయింట్లు లాభపడి 34,103 వద్ద ముగిసింది. ఒకేరోజు ఇంత ఘోరంగా పడిపోవడం, మళ్లీ ఈస్థాయిలో రికవరీ.. ఈ రెండూ కూడా కొత్త రికార్డులే కావడం గమనార్హం. కాగా, శుక్రవారం ఆరంభంలో 15 నిమిషాల్లోనే రూ.12.9 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద తుడిచిపెట్టుకుపోగా... చివరికి ఈ నష్టాలన్నింటినీ పూడ్చుకోవడంతోపాటు రూ.3.5 లక్షల కోట్ల మార్కెట్ విలువ పెరగడం విశేషం!!
శుక్రవారం స్టాక్ మార్కెట్ చిత్ర, విచిత్ర గతులతో ఇన్వెస్టర్లకు, ట్రేడర్లకు చుక్కలు చూపించింది. ఆరంభంలోనే సెన్సెక్స్, నిఫ్టీలు 10 శాతం నష్టపోవడంతో 45 నిమిషాల పాటు ట్రేడింగ్‌ను నిలిపేశారు. ఆ తర్వాత సెన్సెక్స్, నిఫ్టీలు నష్టాల్లో ట్రేడైనా, మెల్లగా కోలుకొని, లాభాల్లోకి వచ్చాయి. కోవిడ్–19 వైరస్ భయాలున్నప్పటికీ, వేల్యూ బయింగ్, షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు చోటు చేసుకోవడం, సానుకూల అంతర్జాతీయ సంకేతాల దన్నుతో భారీ లాభాల్లో ముగిసింది. ఇంట్రాడేలో 3,389 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ చివరకు 1,325 పాయింట్ల లాభంతో 34,103 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 1,035 పాయింట్లు క్షీణించిన నిఫ్టీ చివరకు 365 పాయింట్ల లాభంతో 9,955 పాయింట్ల వద్దకు చేరింది. శాతం పరంగా చూస్తే, సెన్సెక్స్ 4%, నిఫ్టీ 3.8% లాభపడ్డాయి. అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. కరోనా భయాలను అరికట్టడానికి ఆర్‌బీఐతో కలిసి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోగలదని ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్టమూర్తి సుబ్రమణ్యన్ భరోసానివ్వడం సానుకూల ప్రభావం చూపించింది.
5,380 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్.....
కోవిడ్ 19 వైరస్ కల్లోలం ఆర్థిక మాంద్యానికి దారితీస్తుందనే భయాలతో గురువారం ప్రపంచ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు 10–12 శాతం, అమెరికా స్టాక్ సూచీలు 8 శాతం మేర క్షీణించాయి. ఈ ప్రభావంతో శుక్రవారం ఆసియా మార్కెట్లు నష్టాల్లోనే ఆరంభమయ్యాయి. ఈ ప్రభావంతో సెన్సెక్స్ 1,564 పాయింట్లు, నిఫ్టీ 482 పాయింట్ల నష్టాలతో మొదలయ్యాయి. పదినిమిషాల్లోనే సెన్సెక్స్ 3,389 పాయింట్ల నష్టంతో 29,389 పాయింట్లకు, నిఫ్టీ, 1,035 పాయింట్ల నష్టంతో 8,555 పాయింట్లకు పడిపోయాయి. ఈ రెండు సూచీలు 10 శాతం లోయర్ సర్క్యూట్ లిమిట్‌ను తాకడంతో ట్రేడింగ్‌ను 45 నిమిషాలు నిలిపేశారు. ఉ.10.20ని. తర్వాత మళ్లీ ట్రేడింగ్ ఆరంభమైంది. నష్టాలు మెల్లగా రికవరీ అయ్యాయి. మధ్యాహ్నం తర్వాత లాభాల్లోకి వచ్చిన సూచీలు దూసుకుపోయాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,991 పాయింట్ల లాభంతో 34,769 పాయింట్లకు, నిఫ్టీ 569 పాయింట్లతో 10,159 పాయింట్లకు చేరాయి. ఇంట్రాడే కనిష్ట స్థాయి నుంచి చూస్తే, సెన్సెక్స్ 4,714 పాయింట్లు, నిఫ్టీ 1,410 పాయింట్లు రికవరీ అయ్యాయి. మొత్తంమీద సెన్సెక్స్ రోజంతా 5,380 పాయింట్లు, నిఫ్టీ 1,604 పాయింట్ల రేంజ్‌లో కదలాడాయి.
అధ్వాన వారం...
ఇక వారం పరంగా చూస్తే, సెన్సెక్స్, నిఫ్టీలు భారీ స్థాయిలోనే నష్టపోయాయి. భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో అధ్వాన వారాల్లో ఒకటిగా ఈ వారం నిలిచిపోతుంది. హోలీ కారణంగా మంగళవారం సెలవు కావడంతో నాలుగు రోజులే జరిగిన ఈ వారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 3,473 పాయింట్లు, నిఫ్టీ 1,034 పాయింట్లు చొప్పున పతనమయ్యాయి. ఈ రెండు సూచీలు చెరో 9 శాతం నష్టపోయాయి. ఈ రెండు సూచీలు ఈ వారం జరిగిన నాలుగు ట్రేడింగ్ సెషన్లలో రెండింటిలో ఒక్క రోజులో అత్యధిక పాయింట్లు నష్టపోయాయి.
సెన్సెక్స్ ఆరంభం 31,214 (–1,564)
కనిష్టం 29,389 (–3,389)
గరిష్టం 34,769 (+1,991)
కనిష్టం నుంచి 5,380 పాయింట్ల రికవరీ
ముగింపు 34,103 (+1,325)
మరిన్ని విశేషాలు...
► సెన్సెక్స్ షేర్లలో 5 షేర్లే నష్టపోగా, మిగిలిన 25 షేర్లు లాభాల్లో ముగిశాయి.
► ఎస్‌బీఐ 14% లాభంతో రూ. 242 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో భారీగా పెరిగిన షేర్ ఇదే కావడం గమనార్హం.
► దాదాపు 1,300కు పైగా షేర్లు ఇంట్రాడేలో ఏడాది కనిష్టానికి పడిపోయాయి. బజాజ్ ఫిన్‌సర్వ్, మారుతీ, జిల్లెట్ ఇండియా, బజాజ్ ఆటో తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.
► ఈ నెల 17న జరిగే బోర్డ్ సమావేశంలో షేర్ల బైబ్యాక్ అంశాన్ని పరిశీలించనుండటంతో సన్ ఫార్మా షేర్ 8% లాభంతో రూ.384కు పెరిగింది.
► టెలికం రంగానికి ప్రభుత్వం ప్యాకేజీని ప్రకటించగలదన్న వార్తల కారణంగా భారతీ ఎయిర్‌టెల్ 5 శాతం, వొడాఫోన్ ఐడియా షేరు 34 శాతం మేర లాభపడ్డాయి. ఈ కంపెనీలకు రుణాలిచ్చిన పలు ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల షేర్లు కూడా భారీగానే ఎగబాకాయి.
లాభాలు ఎందుకంటే...
వాల్యూ బయింగ్...
ఈ వారంలో స్టాక్ మార్కెట్ దాదాపు 8 శాతం మేర నష్టపోయింది. ఈ నష్టాల కారణంగా పలు షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. కొనుగోళ్లకు ఆకర్షణీయంగా ఉండటంతో ఇన్వెస్టర్లు భారీగా కొనుగోళ్లకు ఎగబడ్డారు.
‘ఉద్దీపన’ ఊసులు.. లాభాల్లో ప్రపంచ మార్కెట్లు
కోవిడ్–19 వైరస్ కల్లోలంతో అంతర్జాతీయంగా మాంద్యం తప్పదన్న భయాలు నెలకొన్నాయి. దీనిని నివారించేందుకు అమెరికాతో సహా పలు దేశాలు ఉద్దీపన చర్యలపై కసరత్తు చేస్తున్నాయి. శుక్రవారం నాడే అమెరికా ప్రభుత్వం ఉద్దీపన చర్యలను ప్రకటించే అవకాశాలున్నాయన్న అంచనాలతో అమెరికా స్టాక్ సూచీల ఫ్యూచర్లు భారీగా లాభపడ్డాయి. ఈ ప్రభావంతో ఆసియా మార్కెట్లు నష్టాల నుంచి రికవరీ కాగా, యూరప్ మార్కెట్లు 3 శాతం లాభాల్లో ఆరంభమయ్యాయి. ఈ సానుకూల అంతర్జాతీయ సంకేతాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చాయి.
జోష్‌నిచ్చిన గణాంకాలు...
జనవరిలో తయారీ రంగం స్వల్పంగా పుంజుకుందని, అలాగే ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం రెండు నెలల కనిష్టానికి పడిపోయిందని గణాంకాలు వెల్లడించాయి. దీంతో ఆర్‌బీఐ వడ్డీరేట్లను తగ్గించగలదన్న అంచనాలు నెలకొన్నాయి. దీంతో కొనుగోళ్లు జోరుగా సాగాయి. .
రూపాయి రికవరీ....
గురువారం భారీగా నష్టపోయిన రూపాయి శుక్రవారం కోలుకుంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 47 పైసలు పుంజుకొని 73.81కు రికవరీ కావడం సానుకూల ప్రభావం చూపించింది.
భారత్‌లో కోవిడ్ ప్రభావం తక్కువే...
భారత్‌లో కోవిడ్–19 వైరస్ సోకిన వారి సంఖ్య 75కు పెరిగింది. వీరిలో 17 మంది విదేశీయులు. ఇతర దేశాలతో పోల్చితే భారత్‌పై కోవిడ్ ప్రభావం తక్కువగానే ఉంది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ బాధితుల సంఖ్య 1.30 లక్షలకు, మరణించిన వారి సంఖ్య 4.900కు చేరింది.
15 నిమిషాల్లో... 12 లక్షల కోట్లు హాం ఫట్!
సెన్సెక్స్, నిఫ్టీలు ఆరంభంలోనే 10 శాతం మేర నష్టపోయాయి. సెన్సెక్స్ 3,389 పాయింట్లు, నిఫ్టీ 1,035 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. 15 నిమిషాల్లో 12 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. ఉదయం. గం.10.20ని. లకు ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.12.9 లక్షల కోట్లు హరించుకుపోయి రూ.1,12,78,173 కోట్లకు పడిపోయింది. మధ్యాహ్నం తర్వాత సూచీలు లాభాల్లోకి మళ్లాయి. చివరకు భారీ లాభాల్లో ముగిశాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపద రూ.3.55 లక్షల కోట్లు ఎగసి రూ.1,29,26,243 కోట్లకు పెరిగింది. కాగా గత నాలుగు ట్రేడింగ్ సెషన్లలో రూ.15 లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోయింది.
రూపాయికి ఆర్‌బీఐ బూస్ట్
ముంబై: ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) విషయంలో భయాందోళన పడాల్సింది ఏదీ లేదని, ఇందుకు తగిన చర్యలు అన్నింటినీ తీసుకుంటున్నామనీ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ఇచ్చిన హామీ శుక్రవారం రూపాయికి వరమయ్యింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో డాలర్ మారకంలో రూపాయి విలువ ఒకేరోజు 48 పైసలు బలపడి 73.80 వద్ద ముగిసింది. ఒకదశలో 74.50 స్థాయినీ చూసింది. సోమవారం 2 బిలియన్ డాలర్లను బ్యాంకింగ్‌కు విక్రయించనున్నట్లు కూడా ఆర్‌బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. గురు, శుక్రవారాల్లో ఇంట్రాడేలో 74.50ని చూసినా, ఇప్పటి వరకూ కనిష్ట స్థాయి ముగింపు 74.39 మాత్రమే.
పసిడికీ ‘వైరస్’
70 డాలర్లకు పైగా పతనం
న్యూయార్క్: పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర శుక్రవారం అంతర్జాతీయ మార్కెట్– నైమెక్స్‌లో భారీ పతనాన్ని చూసింది. ఈ వార్తరాసే 11 గంటల సమయంలో పసిడి ధర 71 డాలర్ల నష్టంతో (4.5%) 1,520 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో 1,504 డాలర్ల స్థాయికీ పడిపోయింది. 2020లో ఈ స్థాయికి పసిడి ధరలు పడిపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గడచిన 52 వారాల్లో 1,266 డాలర్ల కనిష్టాన్ని చూసిన బంగారం ధర, వాణిజ్య యుద్ధం, భౌగోళిక ఉద్రిక్తతలు, కోవిడ్–19 భయాలతో మూడు వారాల క్రితం 1,704.30 గరిష్ట స్థాయిలనూ చూసింది.
కారణమేమిటి?: ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో బడా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను సురక్షిత సాధనాల నుంచి వేగంగా మార్చేస్తున్నారు. భారీగా పెరిగిన బంగారం ధర నేపథ్యంలో... వారి ఇన్వెస్ట్‌మెంట్లను శుక్రవారం ఈక్విటీల్లోకి మళ్లించినట్లు సంకేతాలు అందుతున్నాయి. దేశీయంగానూ భారీ తగ్గుదల: దేశీయంగానూ పసిడి ధర దిగివస్తోంది. ఈ వార్త రాసే సమయానికి దేశీయ ఫ్యూచర్స్ ఎంసీఎక్స్‌లో పసిడి 10 గ్రాములు పూర్తి స్వచ్ఛత ధర రూ.1,885 తగ్గి, రూ.40,321 వద్ద ట్రేడవుతోంది. శుక్రవారం పలు దేశీయ స్పాట్ మార్కెట్లలో పసిడి ధర రూ.1,500 వరకూ పడింది. కాగా, డాలర్ మారకంలో రూపాయి మారకం విలువ బలహీనత వల్ల ధర మరింతగా పడడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment