ముంబై: స్టాక్ మార్కెట్‌లో జోమాటో పబ్లిక్ ఇష్యూ సంచలనం రేపింది. షేర్ మార్కెట్‌లో ట్రేడ్ అయిన మొదటి రోజే లక్ష కోట్ల రూపాయలను టచ్ చేసింది. ఒకే ఒక్క రోజులో షేరు ధర 60 శాతానికి పైగా పెరిగింది. జోమాటో తరహాలో తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు అందించి మల్టీబ్యాగర్లుగా నిలిచిన కంపెనీల గురించి తెలుసుకుందాం.
లక్స్ బనియన్లు
లక్స్‌పేరు వినగానే సినీ తారలు వాడే సబ్బు అనే అడ్వర్‌టైజ్‌మెంట్ ఎక్కువ మందికి గుర్తుకు వస్తుంది. కానీ లక్స్ బ్రాండ్‌తో బనియన్లు, డ్రాయర్లు తయారు చేసే కంపెనీ కూడా ఉంది. టీవీలో ప్రకటనలు కూడా వస్తుంటాయి. ఈ ఏడాది ఇన్వెస్టర్లకు భారీ లాభాలను అందించిన కంపెనీగా లక్స్ నిలిచింది. గతేడాది ఈ కంపెనీ షేర్లు కొనుగోలు చేసి అట్టి పెట్టుకున్న వారు ఏడాది తిరిగేలోగా భారీ లాభాలను కళ్ల జూశారు.
ఏడాదిలోనే
బాంబే స్టాక్ మార్కెట్‌లో 2020 జులై 23న లక్స్ కంపెనీ షేర్ ధర రూ. 1,146.35గా నమోదు అయ్యింది. ఏడాది తిరిగే సరికి 2021 జులై 24న ఈ కంపెనీ షేర్ ధర రూ. 4,120కి చేరుకుంది. అంటే గతేడాది రూ. 5 లక్షలు పెట్టి ఈ కంపెనీ షేర్లు కొనుగోలు చేసిన వారికి ఏడాది తిరిగే లోగా ఈ షేర్ల విలువ రూ. 17.97 లక్షలకు చేరుకుంది. ఏడాది తిరిగే సరికి ఏ తీరుగా లెక్కించినా కనీసం పది లక్షల రూపాయల లాభాలను వాటాదారులకు ఈ కంపెనీ అందించింది.
నిలకడైన పనితీరు
గత కొంతకాలంగా లక్స్ కంపెనీ నిలకడగా ఫలితాలు సాధిస్తోంది. 2019-2020 ఆర్థిక సంవత్సరంలో రూ. 30 కోట్ల నికర లాభాలు రాగా 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 91 కోట్ల ఆదాయాన్ని పొందినట్టు కంపెనీ ప్రకటించింది. కంపెనీ పనితీరు మెరుగ్గా ఉండటం మార్కెట్‌లో బుల్ జోరు కొనసాగడంతో లక్స్ కంపెనీ తన ఇన్వెస్టర్లకు లాభాలను అందివ్వగలిగింది.
పెట్టుబడులపై ఆసక్తి
స్టాక్ మార్కెట్‌పై ఇండియన్లలో ఆసక్తి పెరుగుతోంది. గతంలో పోల్చితే డిమ్యాట్ అకౌంట్లు తెరుస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇంతకాలం నగదుపై రాబడి కోసం బ్యాంకులపై ఆధారపడిన వారు ఇప్పుడు స్టాక్ మార్కెట్ వైపు చూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment