Multi byagar
-
ఒక్క మాటతో ఆ కంపెనీ షేర్లు ఎక్కడికో దూసుకు పోయాయి!
షేర్ మార్కెట్ అదొక అర్థం కాని మయాజాలం. గ్రాఫులు , లెక్కలు, విశ్లేషణలు, మార్కెట్ పండితులు ఇలా ఎందరు ఎన్ని చెప్పినా అంచనాలు క్షణాల్లో పట్టు తప్పుతుంటాయ్. పదేళ్ల డేటాతో చేసిన విశ్లేషణ కంటే కూడా సెంటిమెంట్ పవర్ ఎక్కువ మార్కెట్లో. చాన్నాళ్ల తర్వాత మార్కెట్‌కి సెంటిమెంట్ రుచి చూపించి ఇన్వెస్టర్లకు రూపాయికి రూపాయి లాభం అది రెండు వారాల వ్యవధిలోనే అందించింది ఓ బ్రాండ్. ఒకప్పుడు ఇండియన్ రోడ్లపై రారాజులా వెలిగింది అంబాసిడర్ కారు. బిర్లాలకు చెందిన హిందూస్థాన్ మోటార్స్ సంస్థ ఈ కారును మార్కెట్లోకి తెచ్చింది. మార్కెట్లోకి రావడం ఆలస్యం ట్యాక్సీ డ్రైవర్ నుంచి సెలబ్రిటీల వరకు అందరి మనసును దోచుకుంది. 90వ దశకం వరకు సినిమాల్లో ఈ కారే కనిపించేది. అంబాసిడర్ అంటే స్టేటస్ సింబల్‌గా వెలిగిపోయింది. విదేశీ కార్లు ఇండియాలోకి వచ్చినా రాజకీయ నేతలు చాన్నాళ్ల పాటు అంబాసిడర్‌ని వదల్లేక పోయారు. అయితే ఆధునికతను సంతరించుకోక క్రమంగా అంబాసిడరే కనుమరుగై పోయింది. అంబాసిడర్ సెంటిమెంట్ పాత అంబాసిడర్‌కు కొత్తగా ఎలక్ట్రిక్ హంగులు అద్ది మార్కెట్లోకి తెస్తామంటూ హిందూస్థాన్ మోటార్స్ సంస్థ ఇటీవల ప్రకటించింది. ఈ మేరకు విదేశీ కంపెనీతో సంప్రదింపులు కూడా పూర్తయినట్టు వెల్లడించింది. రాబోయే ఎలక్ట్రిక్ అంబాసిడర్ కారు ప్రొటోటైప్ ఫోటోలు, వీడియోలు సైతం సోషల్ మీడియాలో హోరెత్తిపోయాయి. పాత కాలం అంబాసిడర్‌ను కొత్త లుక్‌లో చూసేందుకు దేశం యావత్తు ఆసక్తి చూపించింది. అంబాసిడర్ మీద ఓ పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యింది. షేర్ల ధరకు రెక్కలు గడిచిన ఐదేళ్లుగా హిందూస్తాన్ మోటార్స్ షేరు రూ. 7 నుంచి రూ 10 దగ్గరే తిరుగాడుతోంది. కేవలం రెండు సార్లు మాత్రమే స్వల్ప కాలం పాటు రూ.15 గరిష్టాలను అందుకుంది. అంబాసిడర్ సరికొత్త రూపంలో మార్కెట్లోకి రాబోతుందన్న వార్త వచ్చిన తర్వాత హిందూస్థాన్ మోటార్స్ షేర్లకు రెక్కలు వచ్చాయి. లాభాలే లాభాలు మే 24న హిందూస్థాన్ మోటార్స్ ఒక్క షేరు ధర రూ. 10.80 దగ్గర ఉండగా జూన్ 8న షేరు ధర రూ.22.05కి చేరుకుంది. కేవలం రెండు వారాల వ్యవధిలో షేరు ధర రెట్టింపు అయ్యింది. మే 24న ఎలక్ట్రిక్ అంబాసిడర్ వార్త విని లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన వారికి రెండు వారాలు తిరిగే సరికి మరో లక్ష లాభం కళ్ల చూడగలిగారు. ఇక ఎప్పటి నుంచో ఈ షేర్లను అట్టిపెట్టుకున్న వారు ఒక్క వార్తతో బూరెల బుట్టలో పడ్డట్టు అయ్యింది. చాలా కాలం పాలు లాభాలు అందివ్వని హిందూస్థాన్ మోటార్స్ షేర్లు ఒక్క వార్తతో తారా జువ్వలా లాభాల్లోకి దూసుకుపోయాయి. చదవండి: Ambassador Electric Car: ఇండియన్ రోడ్ల రారాజు.. అంబాసిడర్ కొత్త లుక్కు చూసారా? -
Multibagger: పెట్టుబడి లక్ష.. లాభం రూ.4 కోట్లు.. ఇన్వెస్టర్ల ఇంట లాభాల పంట
షేర్ మార్కెట్ అనగానే సెన్సెక్స్ 30, నిఫ్టీ 50 సూచీల కదలికపైనే అందరు దృష్టి సారిస్తారు. మార్కెట్లో బ్లూచిప్ కేటగిరలో ఉన్న బిగ్ కంపెనీల పనితీరు, ఆయా కంపెనీల్లో షేర్లు కొనేందుకు ఇన్వెస్టర్లు చూపుతున్న ఆసక్తిని ఈ సూచీలు పట్టి చూపుతాయి. కానీ మార్కెట్లో అనామకంగా స్మాల్ క్యాప్ కేటగిరిలో ఉన్న అనేక స్టాక్స్ ఊహించని లాభాలను అందిస్తాయి. మార్కెట్‌పై సరైన విశ్లేషణ చేసి ఈ కంపెనీల స్టాక్స్ కొంటే లాభల పంట పండటం కాదు కుంభవృష్టి కురుస్తుంది. ఫ్లోమిక్ గ్లోబల్ లాజిస్టిక్ స్టాక్ మార్కెట్లో స్మాల్క్యాప కేటగిరిలో లిస్టయిన కంపెనీల్లో ఫ్లోమిక్ గ్లోబల్ లాజిస్టిక్ ఒకటి. రెండేళ్ల క్రితం వరకు ఈ కంపెనీ గురించి పట్టించుకున్న వాళ్లే లేరు. కానీ ఈ రోజు ఈ కంపెనీ షేర్లు అందించిన లాభాలు చూసి మార్కెట్ వర్గాలు ఆశ్చర్యపోతున్నారు. అనతి కాలంలో సంక్షోభ సమయంలో భారీ లాభాలు అందించిన షేర్లుగా అందరి నోళ్లలో ఫ్లోమిక్ గ్లోబల్ పేరు నానుతోంది. రెండేళ్ల కిందట ఫ్లోమిక్ గ్లోబల్ లాజిస్టిక్ కంపెపీ 2019 మార్చి 28న మార్కెట్లో లిస్టయ్యింది. ఆ సమయంలో ఆ కంపెనీ షేరు విలువ కేవలం 35 పైసలు మాత్రమే. స్మాల్‌క్యాప్ కేటగిరిలో ఉన్న ఈ కంపెనీ షేర్లు కొనేందుకు ఆసక్తి చూపించిన వారు చాలా అరుదు అనే పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత కరోనా సంక్షోభం లాక్డౌన్ ఎఫెక్ట్‌తో ఈ కంపెనీ షేర్లలో పెరుగుదల కనిపించలేదు. గతేడాది నవంబరు మొదటి వారంలో ఈ కంపెనీ షేరు విలువ కేవలం రూ.1.14గా నమోదు అయ్యింది. ఇలా పట్టుకున్నారు సాధారణంగా మార్కెట్లో బ్లూ చిప్ కంపెనీల షేర్ల ధర ఎక్కువగా ఉంటుంది. మార్కెట్లో వీటి ధర కూడా ఎక్కువగా ఒడిదుడుకులకు లోనవుతూ ఉంటుంది. స్మాల్‌క్యాప్ షేర్లు ఇందుకు విరుద్దంగా తక్కువ ధరకే లభిస్తుంటాయి. అయితే తెలివైన ఇన్వెస్టర్లు మంచి ఫలితాలు సాధించే స్మాల్‌క్యాప్ కంపెనీలను ఇట్టే పట్టుకుంటారు. ఏడాదిలో ఫ్లోమిక్ గ్లోబల్ లాజిస్టిక్ కంపెనీ షేరు విలువ 25 పైసల నుంచి రూ.1.14కి చేరుకుంది. అంటే ఇంచుమించు మూడు వందల శాతం వృద్ధి నమోదు చేసింది. దీంతో మంచి వృద్ది కనబరుస్తూ తక్కువ ధరకే లభిస్తున్న ఫ్లోమిక్ గ్లోబల్ లాజిస్టిక్పై ఇన్వెస్టర్లు ఫోకస్ చేయడం మొదలు పెట్టారు. అంచనాలను మించి ఇన్వెస్టర్లు ఫ్లోమిక్ లాజిస్టిక్ షేర్లపై ఆసక్తి చూపించడంతో ఈ ఏడాది ఆరంభం నుంచి క్రమంగా షేర్ల ధర పెరుగుతూ 2021 జులైకి వచ్చే సరికి రూ.12.24 పైసులకు చేరుకుంది. ఇన్వెస్టర్లకు రూపాయికి పది రూపాయల లాభం ఇచ్చిన షేరుగా మార్కెట్లో గుర్తింపు పొందింది. అంతే ఇక అక్కడి నుంచి ఆకాశమే హద్దుగా ఈ కంపెనీ షేర్లు పెరుగుతూ వస్తున్నాయి. నవంబరు 13న ఈ కంపెనీ షేర్లు రూ.143.25గా ట్రేడవుతోంది. కేవలం ఆరు నెలల్లో కంపెనీ షేర్లు 1,779 శాతం వృద్ధిని నమోదు చేశాయి. లాభాలే లాభాలు నవంబరు మొదటి వారంలో ఈ కంపెనీ షేర్లు రూ.1.22లుగా ఉండగా నేడు రూ.143.25గా ఉంది. అంటే ఏడాది కిందట ఈ కంపెనీ షేర్లపై లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన వారికి ఏడాది తిరిగే సరికి దాదాపు కోటిన్నర రూపాయల రిటర్న్‌లు వచ్చినట్టయ్యింది. ఆరు నెలల క్రితం లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసిన వారు సైతం కనిస్టంగా కోటి రూపాయల వరకు లాభం కళ్ల జూశారు. ఇక అక్టోబరు 27న అయితే ఈ కంపెనీ ఆల్‌టైం హై ధర రూ.216ని టచ్ చేసింది. ఆ రోజు షేర్లు అమ్ముకున్నవారికి అయితే ఏకంగా లక్షకు రెండు కోట్ల రూపాయల వరకు రిటర్నులు వచ్చాయి. ఇక రెండేళ్ల క్రితం కంపెనీ ఆరంభంలో లక్ష పెట్టుబడి పెట్టిన వారికి అయితే ఏకంగా నాలుగు కోట్ల రూపాయలకు పైగా రిటర్న్స్ వచ్చాయి. చదవండి:మదుపరులపై కాసుల వర్షం కురిపించిన స్టాక్స్! -
స్టాక్ మార్కెట్లో తెలుగు కంపెనీ సత్తా.. ఇన్వెస్టర్ల ఇంట లాభాల పంట
Multibagger Olectra Greentech: స్టాక్ మార్కెట్ అంటేనే ఉత్తరాది పెత్తనం. అందులోనూ గుజరాతీల హవానే ఎక్కువ. ప్రధాన స్టాక్‌మార్కెట్ ముంబైలో ఉండటంతో మహరాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్‌కి చెందిన వారి మాటే అక్కడ ఎక్కువగా చెల్లుబాటు అవుతోంది. కానీ వారందరిని తలదన్నెలా లాభాల పంట పండిస్తూ అందరీ దృష్టిని ఆకర్షిస్తోంది తెలుగు వ్యక్తులు స్థాపించిన ఒలెక్ట్రా కంపెనీ. కేవలం ఏడాది వ్యవధిలోనే రూపాయికి పది రూపాయల లాభం చూపించి మల్టీ బ్యాగర్‌గా గుర్తింపు పొందింది. ఎలక్ట్రిక్ బస్సుల తయారీ సంస్థ ఓలెక్ట్రా గ్రీన్‌టెక్ కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్నాయి. నేషనల్ స్టాక్ ఎక్సేంజీలో స్మాల్‌క్యాప్ కెటగిరిలో ఉన్న ఈ కంపెనీ షేర్లు ఏడాది కాలంగా ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. గతేడాది 2020 నవంబరు 9న ఈ కంపెనీ ఒక్క షేరు విలువ రూ.59.55 దగ్గర ట్రేడ్ అయ్యింది. సరిగ్గా ఏడాది తిరిగే సరికి 2021 నవంబరు 9 మధ్యాహ్నం 2:30 గంటల సమయానికి ఈ కంపెనీ ఒక్క షేరు విలువ ఏకంగా రూ.649.90 దగ్గర ట్రేడ్ అవుతోంది. అంటే ఏడాది కాలంలో ఏకంగా 991 శాతం షేరు విలువ పెరిగింది. నికరంగా ఒక్కో షేరు ధర రూ.590 పెరిగింది. కోటికి పది కోట్ల రూపాయలు ఏడాది కిందట లక్ష రూపాయలు ఈ కంపెనీ షేర్లలో పెట్టుబడి పెట్టిన వారికి కేవలం ఏడాది వ్యవధిలోనే సుమారు పది లక్షల రూపాయల వరకు లాభం వచ్చినట్టయ్యింది. కోటి రూపాయలు పెట్టుబడి పెట్టిన వారికి పది కోట్ల రూపాయలను అందించింది. ఈ సీజన్లో మల్టీబ్యాగర్ షేర్లలో ఒకటిగా ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ నిలిచింది. కొత్తగా షేర్ మార్కెట్లోకి వచ్చిన వారికి స్టాక్ మార్కెట్లో లాభాల రుచిని చూపించింది. ప్రభుత్వ ప్రోత్సహకాలు వాతావరణ కాలుష్యం తగ్గించాలనే నినాదం ఎప్పటి నుంచో వినిపిస్తున్నా ఆచరణలో పెట్టింది తక్కువ. కానీ కరోనా సంక్షోభం తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. వాయు కాలుష్యం తగ్గించే లక్ష్యంతో ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకానికి ప్రభుత్వం దన్నుగా నిలుస్తోంది. ఫేమ్ 1, ఫేమ్ 2 పేరుతో ఈవీలకు ప్రోత్సహకాలు అందిస్తోంది. దీంతో ఈవీలకు ఒక్కసారిగా సానుకూల వాతావరణం ఏర్పడింది. ఎలక్ట్రిక్ బస్సుల తయారీలో ఒలెక్ట్రా ఉండటం ఈ కంపెనీ షేర్లకు వరంలా మారింది. పెట్రోలు ధరలు ప్రభుత్వ విధానాలు సానుకూలంగా ఉండటానికి తోడు చమురు ధరలు సైతం ఒలెక్ట్రా వృద్ధికి పరోక్షంగా సాయం అందించాయి. గత ఏడాది కాలంగా పెట్రోలు, డీజిలు ధరలు అడ్డు అదుపు లేకుండా పెరుగుతుంటంతో సామాన్యులు సైతం పెట్రోలు, డీజిల్‌కి ప్రత్యామ్నాయం ఏంటని ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఈవీ రంగంలో రోజుకో స్టార్టప్ వెలుగులోకి వస్తుంది. ఈవీ రంగంలో స్టార్టప్‌లకే పరిస్థితే ఎంతో ఆశజనకంగా ఉండగా.. 1992 నుంచి మార్కెట్లో ఉన్న ఒలెక్ట్రాకు అది మరింతగా లాభించింది. అందువల్లే ఇన్వెస్టర్లు ఒలెక్ట్రాపై నమ్మకం చూపించారు. ఏడాది కాలంగా షేరు వ్యాల్యూ పెరుగుతున్నా పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తూనే ఉన్నారు. హైదరాబాద్ కేంద్రంగా హైడ్రోమెకానిక్స్ విభాగంలో ప్రపంచ వ్యాప్తంగా అనే భారీ ప్రాజెక్టులు చేపడుతోంది మేఘా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్. తెలుగు వారు స్థాపించిన మేఘా సంస్థ సబ్సిడరీలో ఒకటి ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ కంపెనీ. హైదరాబాద్ కేంద్రంగా 1992లో ఈ సంస్థను స్థాపించారు. పాలిమర్ ఇన్సులేలర్లు, ఎలక్ట్రిక్ బస్సులను ఈ కంపెనీ తయారు చేస్తోంది. మార్కెట్లో చాలా కాలంగా ఉన్నప్పటికీ.. ఇటీవల ఈవీల వాడకం పెరగడంతో ఒక్కసారిగా ఒలెక్ట్రా లైమ్‌లైట్‌లోకి వచ్చింది. స్టాక్ మార్కెట్లో ఇప్పటి వరకు దక్షిణాదికి చెందిన ఐటీ, ఫార్మా కంపెనీలే హవా కొనసాగించగా ఇప్పుడు మాన్యుఫ్యాక్చరింగ్ విభాగం నుంచి ఒలెక్ట్రా సంచలనం సృష్టిస్తోంది. చదవండి: ఏపీఎస్ఆర్టీసీ నుంచి ఒలెక్ట్రాకు 100 బస్సుల ఆర్డర్ -
పెట్టుబడి 5 లక్షలు .. ఏడాది తిరిగేసరికి 18 లక్షలు!
ముంబై: స్టాక్ మార్కెట్లో జోమాటో పబ్లిక్ ఇష్యూ సంచలనం రేపింది. షేర్ మార్కెట్లో ట్రేడ్ అయిన మొదటి రోజే లక్ష కోట్ల రూపాయలను టచ్ చేసింది. ఒకే ఒక్క రోజులో షేరు ధర 60 శాతానికి పైగా పెరిగింది. జోమాటో తరహాలో తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు అందించి మల్టీబ్యాగర్లుగా నిలిచిన కంపెనీల గురించి తెలుసుకుందాం. లక్స్ బనియన్లు లక్స్‌పేరు వినగానే సినీ తారలు వాడే సబ్బు అనే అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ మందికి గుర్తుకు వస్తుంది. కానీ లక్స్ బ్రాండ్‌తో బనియన్లు, డ్రాయర్లు తయారు చేసే కంపెనీ కూడా ఉంది. టీవీలో ప్రకటనలు కూడా వస్తుంటాయి. ఈ ఏడాది ఇన్వెస్టర్లకు భారీ లాభాలను అందించిన కంపెనీగా లక్స్ నిలిచింది. గతేడాది ఈ కంపెనీ షేర్లు కొనుగోలు చేసి అట్టి పెట్టుకున్న వారు ఏడాది తిరిగేలోగా భారీ లాభాలను కళ్ల జూశారు. ఏడాదిలోనే బాంబే స్టాక్ మార్కెట్లో 2020 జులై 23న లక్స్ కంపెనీ షేర్ ధర రూ. 1,146.35గా నమోదు అయ్యింది. ఏడాది తిరిగే సరికి 2021 జులై 24న ఈ కంపెనీ షేర్ ధర రూ. 4,120కి చేరుకుంది. అంటే గతేడాది రూ. 5 లక్షలు పెట్టి ఈ కంపెనీ షేర్లు కొనుగోలు చేసిన వారికి ఏడాది తిరిగే లోగా ఈ షేర్ల విలువ రూ. 17.97 లక్షలకు చేరుకుంది. ఏడాది తిరిగే సరికి ఏ తీరుగా లెక్కించినా కనీసం పది లక్షల రూపాయల లాభాలను వాటాదారులకు ఈ కంపెనీ అందించింది. నిలకడైన పనితీరు గత కొంతకాలంగా లక్స్ కంపెనీ నిలకడగా ఫలితాలు సాధిస్తోంది. 2019-2020 ఆర్థిక సంవత్సరంలో రూ. 30 కోట్ల నికర లాభాలు రాగా 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 91 కోట్ల ఆదాయాన్ని పొందినట్టు కంపెనీ ప్రకటించింది. కంపెనీ పనితీరు మెరుగ్గా ఉండటం మార్కెట్లో బుల్ జోరు కొనసాగడంతో లక్స్ కంపెనీ తన ఇన్వెస్టర్లకు లాభాలను అందివ్వగలిగింది. పెట్టుబడులపై ఆసక్తి స్టాక్ మార్కెట్‌పై ఇండియన్లలో ఆసక్తి పెరుగుతోంది. గతంలో పోల్చితే డిమ్యాట్ అకౌంట్లు తెరుస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇంతకాలం నగదుపై రాబడి కోసం బ్యాంకులపై ఆధారపడిన వారు ఇప్పుడు స్టాక్ మార్కెట్ వైపు చూస్తున్నారు. -
కోవిద్ సంక్షోభంలోనూ మల్టీబ్యాగర్‌గా నిలిచింది..!
కోవిడ్-19 సృష్టించిన సంక్షోభంతో స్టాక్ మార్కెట్లో మార్చి నెలలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో అన్ని రంగాలకు చెందిన ప్రధాన షేర్లన్నీ కొన్నేళ్ల కనిష్టాన్ని దిగివచ్చాయి. అయితే ఒక్క షేరు మాత్రం ఈ సంక్షోభంలోనూ మల్టీబ్యాగర్‌గా నిలిచింది. అలాగే ఏకంగా షేరు ఏడాది గరిష్టాన్ని తాకింది. అదే బ్రిటానియా ఇండస్ట్రీస్ షేరు... కేవలం కరోనా సమయంలోనే కాకుండా దశాబ్ధ కాలం నుంచి బ్రిటానియా ఇన్వెస్టర్లకు మంచి రాబడులను ఇస్తుంది. గత పదేళ్లలో ఈ షేరు 2000 శాతం పెరిగింది. మూడేళ్లలో 90శాతం, గడచిన ఏడాదిలో 17శాతం పెరిగింది. మంగళవారం(జూన్ 02న) ట్రేడింగ్‌లో షేరు రూ.3451 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ షేరుకు 12 బ్రోకరేజ్ సంస్థలు ‘‘స్ట్రాంగ్ బై’’, 9 బ్రోకరేజ్ సంస్థలు ‘‘బై’’ రేటింగ్‌ను ఇచ్చాయి. మరో 9 బ్రోకింగ్ సంస్థలు ‘‘హోల్డ్ ’’ రేటింగ్‌ను కేటాయించాయి. మరోవైపు కేవలం 5 బ్రోకింగ్ సంస్థలు మాత్రమే ‘‘సెల్’’ రేటింగ్‌ను ఇచ్చాయి. బిస్కెట్లు భారతదేశపు అతిపెద్ద వినియోగదారుల ఉత్పత్తి విభాగంగా చెలామణి అవుతున్నాయి. బేకరీ పరిశ్రమ మొత్తం అమ్మకాల్లో బిస్కెట్లు, కుకీల వాటా 72 శాతం వాటా ఉన్నట్లు ఇండియన్‌రిటైల్ డామ్ తన నివేదికలో తెలిపింది. కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌తో బిస్కెట్లు, నూడల్స్ లాంటి వస్తువులకు భారీగా డిమాండ్ నెలకొంది. హోటల్స్ మూసివేత, స్ట్రీట్‌ఫుడ్‌పై నిషేధం తదితర కారణాలతో ఇంటి ఆహారం తర్వాత ప్యాక్ చేసిన బిస్కెట్లు ప్రజల ఆహారంలో భాగంగా మారాయి. వచ్చే మూడేళ్లలో బ్రిటానియా అత్యుత్తమ పనితీరు కనబరిచే అవకాశం ఉందని ఫిలిప్ క్యాపిటల్ బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. ఈపీఎస్ వార్షిక ప్రాతిపదిక 14శాతం చొప్పును వృద్దిని సాధింస్తుందని బ్రోకరేజ్ సంస్థ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో షేరుకు గతంలో కేటాయించిన ‘‘న్యూట్రల్’’ రేటింగ్‌ను ‘‘బై’’ రేటింగ్‌కు అప్‌గ్రేడ్ చేసింది. అలాగే షేరుకు టార్గెట్ ధర రూ.3,550గా నిర్ణయించింది. అంతేకాకుండా, కార్పొరేట్ పాలన ఆందోళనలను నిర్మూలించడానికి డైరెక్టర్ల బోర్డు తీసుకునే ఏ నిర్ణయం అయినా షేరు వ్యాల్యూయేషన్ మల్లీపుల్స్ రీ-రేటింగ్‌కు దారీతీయవచ్చని బ్రోకరేజ్ తన నివేదికలో తెలిపింది. -
గుర్తించారా.. షేరు గుర్రాలేవో!
మల్టీ బ్యాగర్స్‌ను గుర్తించటం అసాధ్యమేమీ కాదు కాకపోతే చాలా అంశాల్ని అధ్యయనం చెయ్యాలి ప్రమోటర్ ట్రాక్ రికార్డు నుంచి వృద్ధి అవకాశాల దాకా అన్నీ బాగున్నా ఇన్వెస్ట్ చేశాక ఓపిక వహించటం ముఖ్యం మల్టీ బ్యాగర్ అంటే తెలుసా? ఇవ్వాళ మీరు 100 రూపాయలకు కొన్న షేరు... వచ్చే కొన్ని సంవత్సరాల్లో ఎన్నో రెట్లు పెరిగిపోతుంది. అది రూ.వెయ్యికి చేరినా ఆశ్చర్యం లేదు. నిజానికి స్టాక్ మార్కెట్లో ఇలాంటి మల్టీ బ్యాగర్లు చాలా తక్కువే ఉంటాయి. కాకపోతే ఇలాంటివి పడితే మాత్రం దశ తిరిగిపోతుంది. స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే వారు ఎవరైనా... ఇలాంటి షేర్లను కనీసం ఒక్కటయినా పట్టుకోవాలని ఉంటుంది. అయితే, ఇప్పుడు సాధారణ షేరుగా కనిపిస్తున్నా రేప్పొద్దున్న అసాధారణంగా ఇన్ఫోసిస్ లాంటి షేరుగా ఎదిగే స్టాక్‌ను పట్టుకోవటమంటే అంత తేలికేమీ కాదు. మల్టీ బ్యాగర్ స్టాక్‌ను గుర్తించడమనేది కాస్త శ్రమతో కూడుకున్న వ్యవహారమే. దీనికి సమయం కూడా పడుతుంది. అయితే, కొన్ని కీలకమైన అంశాలను లోతుగా అధ్యయనం చేస్తే మల్టీ బ్యాగర్స్‌ను ఒడిసిపట్టుకోవటం అసాధ్యమేమీ కాదు. ఆ వివరాలు తెలియజేసేదే ఈ వారం ప్రాఫిట్ ప్రధాన కథనం... ప్రమోటర్ ట్రాక్ రికార్డు... నిరంతరం కొత్త ఉత్పత్తులు, ఆవిష్కరణలు మొదలైన వాటితో అమ్మకాలు పెంచుకుంటూ కంపెనీని వృద్ధి పథంలో నడిపించే విషయంలో ప్రమోటర్‌కు ఉండే నిబద్ధతే అన్నిటికన్నా ముఖ్యం. ఇందుకోసం వ్యాపార నిర్వహణలో ప్రమోటర్లు, మేనేజ్మెంట్ తీరు ఎలా ఉందన్నది పరిశీలించాలి. ఉదాహరణకు యాపిల్ సంస్థనే తీసుకుంటే మ్యూజిక్‌లో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన ఐపాడ్ దగ్గరే స్టీవ్ జాబ్స్ ఆగిపోయి ఉండొచ్చు. కానీ, అక్కడితో ఆగిపోకుండా ఐఫోన్, ఐప్యాడ్ వంటి మరింత విప్లవాత్మకమైన మార్పులతో దూసుకెళ్లడం వల్లే యాపిల్ టాప్-పెర్ఫార్మింగ్ స్టాక్‌గా ఉందిప్పుడు. ఇలాంటి షేర్స్‌ను కనుగొనాలంటే.. ఆయా సంస్థల యాజమాన్యాల నిబద్ధతను పరిశీలించాలి. కంపెనీ వార్షిక నివేదికలు, కాన్ఫరెన్స్ కాల్ ట్రాన్స్క్రిప్ట్లు క్షుణ్నంగా చదివితే... తప్పొప్పుల విషయంలో యాజమాన్యం స్పందనెలా ఉంది? పనితీరు సరిగ్గాలేకుంటే బాధ్యత తీసుకుంటోందా? లేదా కుంటి సాకులు చెప్పి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందా? అన్నవి చూడాలి. ఇలాంటి విషయాల్లోనే యాజమాన్యం నిబద్ధత తెలుస్తుంది. ఒకవేళ ఏదైనా క్వార్టర్లో పనితీరు బాగా లేకపోతే మెరుగుపర్చుకునేందుకు తీసుకుంటున్న చర్యల విషయంలో నిజాయితీగా వ్యవహరిస్తున్న పక్షంలో సదరు కంపెనీని పరిశీలించవచ్చు. వృద్ధికి అవకాశాలెలా ఉన్నాయి? కంపెనీ అమ్మకాలు సగటు స్థాయిని మించి ఉన్నాయేమో పరిశీలించాలి. ఇంకో విధంగా చెప్పాలంటే.. రాబోయే అయిదేళ్ల కాలంలో ఏదైనా కంపెనీ వార్షిక ప్రాతిపదికన 20% నుంచి 25% మేర వృద్ధి చెందగలదని గట్టి సంకేతాలుంటే... మీరు సరైన స్టాక్‌ను పట్టుకున్నట్లే. అవకాశాలను అత్యంత వేగంగా అందుకుని ఎదిగే నేర్పున్నవే మల్టీ బ్యాగర్ షేర్లు. దేశీ యంగా పేజ్ ఇండస్ట్రీస్, ఐషర్ మోటార్స్ వంటివి ఇందుకు మంచి ఉదాహరణలు. ఇవి గడిచిన అయిదేళ్లలో అమ్మకాలు, లాభాల్లో 30 శాతానికి పైగా వృద్ధి కనబరుస్తున్నాయి. ఈపీఎస్.. పీఈ నిష్పత్తి బాగున్నాయా! కంపెనీని ఎంచుకునేటప్పుడు బేసిక్ ఎర్నింగ్స్ పర్ షేరు (బేసిక్ ఈపీఎస్), ప్రైస్ మల్టిపుల్స్ వంటివి చూడాలి. త్రైమాసికాల వారీగా కంపెనీ ప్రకటించే బేసిక్ ఈపీఎస్‌ను బట్టి స్టాక్స్ ధరలు మారుతుంటాయి. ఈపీఎస్ విలువను బట్టి ప్రైస్ టు ఎర్నింగ్స్ (పీఈ), ప్రైస్ టు సేల్స్ విలువ (పీఎస్) నిష్పత్తులు తెలుస్తాయి. ఇవి రెండూ మార్కెట్లో కంపెనీ వేల్యుయేషన్ గురించి చెబుతాయి. సంస్థ మంచి పనితీరు కనపరుస్తూ.. షేరు ధర కన్నా ఈపీఎస్ మెరుగ్గా ఉంటున్న పక్షంలో ఆ కంపెనీ స్టాక్‌పై దృష్టి పెట్టవచ్చు. ఇక, మూడు నెలలకోసారి ప్రకటించే ఆర్థిక ఫలితాల్లో ఆదాయం, స్థూల లాభం అంశాలు కంపెనీ పనితీరు గురించి చెబుతాయి కనుక వీటిని అధ్యయనం చేయాలి. వ్యాపార మోడల్‌కు భవిష్యత్తుందా? కంపెనీ తయారు చేసే ఉత్పత్తులు, అందించే సేవలకు కనీసం మరికొన్నేళ్ళ పాటైనా సరైన డిమాండ్ ఉంటుందా.. అమ్మకాలు పెరుగుతాయా అన్నది చూడాలి. నిర్దిష్ట రంగంలో సదరు కంపెనీదే ఆధిపత్యం ఉంటే మంచిదే. క్రిసిల్, జిలెట్, నెస్లే వంటివి ఇందుకు ఉదాహరణలు. కస్టమర్లను ఆకర్షించగలిగే శక్తి ఆయా బ్రాండ్లకుండాలి. ఇంటర్నెట్ విప్లవంతో అమెజాన్ లాంటివి వెలుగులోకి వచ్చాయి. అయితే, ప్రాచుర్యం గల బ్రాండ్లన్నీ కూడా మల్టీ బ్యాగర్స్ అని భావించడానికి లేదు. దీనితో పాటు మరికొన్ని ప్రమాణాలు కూడా చూడాలి. పెట్టుబడి అవసరాలెంత? కంపెనీ ఏదైనా సరే... కనీస పెట్టుబడులతో గరిష్ట రాబడులు అందించగలిగేదిగా ఉండాలి. సాధారణంగా ఇన్ఫ్రా.. రియల్ ఎస్టేట్ వంటి రంగాల సంస్థలతో పోలిస్తే టెక్నాలజీ, ఫార్మా, వినియోగ వస్తువుల వంటి కంపెనీల విస్తరణకు పెట్టుబడి వ్యయాలు తక్కువగానే ఉంటాయి. రుణభారం సముచిత స్థాయిలో ఉండి, కార్యకలాపాల విస్తరణకు అవసరమైన నిధులు అంతర్గతంగానైనా సమకూర్చుకోగలిగే ఆరోగ్యకరమైన ఆర్థిక స్థితిలో ఉన్న కంపెనీలను ఎంచుకోవాలి. నిధులు కావాల్సినపుడల్లా షేర్ హోల్డర్ల వాటాలు, ప్రయోజనాలు దెబ్బతినేలా ఈక్విటీలు జారీ చేస్తూ ఉంటాయి కొన్ని. కొన్నయితే రుణభారాన్ని మోయలేని స్థాయికి పెంచుకుంటూ పోతుంటాయి. ఈ రెండు రకాల కంపెనీలూ మంచివి కాదనే చెప్పాలి. అధిక వడ్డీ రేటుతో అత్యధిక రుణభారం, చెల్లింపుల సమస్యలున్న కంపెనీల షేర్లు.. ఏదైనా తేడా వస్తే కుప్పకూలే అవకాశం ఉంది. బ్యాలెన్స్ షీటు పటిష్టంగా ఉండి.. రుణభారం ఈక్విటీలో 30 శాతం కన్నా తక్కువగా ఉన్న సంస్థలనైతే పరిశీలించవచ్చు. మెరుగైన మార్జిన్లున్నాయా? లాభాల మార్జిన్లు తగ్గకుండా అదే స్థాయిలో కొనసాగించేందుకు.. అంతకు మించి మెరుగుపర్చుకునేందుకు కంపెనీ ఏం చేస్తోంది? చాలా మటుకు ఇన్వెస్టర్లు ప్రస్తుతం ఉన్న ధోరణులే భవిష్యత్‌లోనూ కొనసాగవచ్చని భావిస్తుంటారు. ఏదైనా కంపెనీ గడచిన అయిదేళ్లలో సగటున 8-12 శాతం మార్జిన్లు సాధిస్తే... వచ్చే అయిదేళ్లలో కూడా అదే మార్జిన్లు కొనసాగవచ్చని భావిస్తారు. అయితే, ట్రెండ్‌ను దాటి మరింత అధిక మార్జిన్లు (అంటే 15-20 శాతం మేర) సాధించగలిగే సత్తా ఉన్న సంస్థలను మరికాస్త లోతుగా అధ్యయనం చేసి, వాటి షేర్లను పట్టుకోగలిగితే లాభదాయకమే. పరిశోధన.. అభివృద్ధి కార్యకలాపాలేంటి? ఏ కంపెనీలయినా ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులు, వినూత్న సర్వీసులు అందించగలిగితేనే వృద్ధి చెందుతాయి. ఇందుకోసం అవి పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై (ఆర్అండ్డీ) కూడా కొంత వెచ్చించాల్సి ఉంటుంది. ఫలితాల గురించి అంచనాలు వేసుకోవడం కొంత సంక్లిష్టమైనప్పటికీ.. ఎదుగుదల కోసం కంపెనీ ఏ స్థాయిలో ఆర్ అండ్డీపై ఖర్చు పెడుతోందన్న గణాంకాలు కూడా భవిష్యత్‌లో దాని వృద్ధి అవకాశాల గురించి కాస్త సంకేతాలు ఇవ్వగలవు. అన్నీ బాగున్నా సరే... సరే! పైన చెప్పినవన్నీ చూసి ఆయా షేర్లలో ఇన్వెస్ట్ చేశారనుకోండి. అక్కడితోనే అయిపోదు. షేర్ మార్కెట్లో ఓపిక ముఖ్యం. మీరు ఇవ్వాళ ఇన్వెస్ట్ చేయగానే రేపు అది పెరిగిపోవాలనుకుంటే కష్టం. షేర్లలో ఇన్వెస్ట్ చేశాక కాస్త సమయం ఇవ్వాలి. ఒకవేళ మార్కెట్ పరిస్థితులు బాగులేకుంటే ఆయా షేర్లు మీరు ఇన్వెస్ట్ చేశాక దారుణంగా పతనమైపోవచ్చు. అంతమాత్రాన వాటిని విక్రయించేసి నష్టాలతో బయటపడటం అనవసరం. ఆ షేరుకు సంబంధించి అన్నీ బాగుండి... మార్కెట్ స్థితి గతులవల్ల మాత్రమే పడిన పక్షంలో... దానిపై మీకు నమ్మకముంటే బాగా పడి తక్కువ ధరకు వస్తున్నపుడు ఇంకొన్ని కొనుగోలు చేసి యావరేజ్ చెయ్యొచ్చు. కాస్త ఓపిక పడితే మంచి షేర్లు పెరగకపోవన్నది గమనించాలి.