గుర్తించారా.. షేరు గుర్రాలేవో! | special story on Multi byagar | Sakshi
Sakshi News home page

గుర్తించారా.. షేరు గుర్రాలేవో!

Published Mon, Oct 17 2016 1:03 AM | Last Updated on Mon, Sep 4 2017 5:25 PM

గుర్తించారా.. షేరు గుర్రాలేవో!

గుర్తించారా.. షేరు గుర్రాలేవో!

మల్టీ బ్యాగర్స్‌ను గుర్తించటం అసాధ్యమేమీ కాదు
 కాకపోతే చాలా అంశాల్ని అధ్యయనం చెయ్యాలి
 ప్రమోటర్ ట్రాక్ రికార్డు నుంచి వృద్ధి అవకాశాల దాకా
 అన్నీ బాగున్నా ఇన్వెస్ట్ చేశాక ఓపిక వహించటం ముఖ్యం

 
 మల్టీ బ్యాగర్ అంటే తెలుసా? ఇవ్వాళ మీరు 100 రూపాయలకు కొన్న షేరు... వచ్చే కొన్ని సంవత్సరాల్లో ఎన్నో రెట్లు పెరిగిపోతుంది. అది రూ.వెయ్యికి చేరినా ఆశ్చర్యం లేదు. నిజానికి స్టాక్ మార్కెట్లో ఇలాంటి మల్టీ బ్యాగర్లు చాలా తక్కువే ఉంటాయి. కాకపోతే ఇలాంటివి పడితే మాత్రం దశ తిరిగిపోతుంది. స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే వారు ఎవరైనా... ఇలాంటి షేర్లను కనీసం ఒక్కటయినా పట్టుకోవాలని ఉంటుంది. అయితే, ఇప్పుడు సాధారణ షేరుగా కనిపిస్తున్నా రేప్పొద్దున్న అసాధారణంగా ఇన్ఫోసిస్ లాంటి షేరుగా ఎదిగే స్టాక్‌ను పట్టుకోవటమంటే అంత తేలికేమీ కాదు. మల్టీ బ్యాగర్ స్టాక్‌ను గుర్తించడమనేది కాస్త శ్రమతో కూడుకున్న వ్యవహారమే. దీనికి సమయం కూడా పడుతుంది. అయితే, కొన్ని కీలకమైన అంశాలను లోతుగా అధ్యయనం చేస్తే మల్టీ బ్యాగర్స్‌ను ఒడిసిపట్టుకోవటం అసాధ్యమేమీ కాదు. ఆ వివరాలు తెలియజేసేదే ఈ వారం ప్రాఫిట్ ప్రధాన కథనం...
 
 ప్రమోటర్ ట్రాక్ రికార్డు...
 నిరంతరం కొత్త ఉత్పత్తులు, ఆవిష్కరణలు మొదలైన వాటితో అమ్మకాలు పెంచుకుంటూ కంపెనీని వృద్ధి పథంలో నడిపించే విషయంలో ప్రమోటర్‌కు ఉండే నిబద్ధతే అన్నిటికన్నా ముఖ్యం. ఇందుకోసం వ్యాపార నిర్వహణలో ప్రమోటర్లు, మేనేజ్‌మెంట్ తీరు ఎలా ఉందన్నది పరిశీలించాలి. ఉదాహరణకు యాపిల్ సంస్థనే తీసుకుంటే మ్యూజిక్‌లో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన ఐపాడ్ దగ్గరే స్టీవ్ జాబ్స్ ఆగిపోయి ఉండొచ్చు. కానీ, అక్కడితో ఆగిపోకుండా ఐఫోన్, ఐప్యాడ్ వంటి మరింత విప్లవాత్మకమైన మార్పులతో దూసుకెళ్లడం వల్లే యాపిల్ టాప్-పెర్ఫార్మింగ్ స్టాక్‌గా ఉందిప్పుడు. ఇలాంటి షేర్స్‌ను కనుగొనాలంటే.. ఆయా సంస్థల యాజమాన్యాల నిబద్ధతను పరిశీలించాలి. కంపెనీ వార్షిక నివేదికలు, కాన్ఫరెన్స్ కాల్ ట్రాన్‌స్క్రిప్ట్‌లు క్షుణ్నంగా చదివితే... తప్పొప్పుల విషయంలో యాజమాన్యం స్పందనెలా ఉంది? పనితీరు సరిగ్గాలేకుంటే బాధ్యత తీసుకుంటోందా? లేదా కుంటి సాకులు చెప్పి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందా? అన్నవి చూడాలి. ఇలాంటి విషయాల్లోనే యాజమాన్యం నిబద్ధత తెలుస్తుంది. ఒకవేళ ఏదైనా క్వార్టర్‌లో పనితీరు బాగా లేకపోతే మెరుగుపర్చుకునేందుకు తీసుకుంటున్న చర్యల విషయంలో నిజాయితీగా వ్యవహరిస్తున్న పక్షంలో సదరు కంపెనీని పరిశీలించవచ్చు.
 
 వృద్ధికి అవకాశాలెలా ఉన్నాయి?
 కంపెనీ అమ్మకాలు సగటు స్థాయిని మించి ఉన్నాయేమో పరిశీలించాలి. ఇంకో విధంగా చెప్పాలంటే.. రాబోయే అయిదేళ్ల కాలంలో ఏదైనా కంపెనీ వార్షిక ప్రాతిపదికన 20% నుంచి 25% మేర వృద్ధి చెందగలదని గట్టి సంకేతాలుంటే... మీరు సరైన స్టాక్‌ను పట్టుకున్నట్లే. అవకాశాలను అత్యంత వేగంగా అందుకుని ఎదిగే నేర్పున్నవే మల్టీ బ్యాగర్ షేర్లు. దేశీ యంగా పేజ్ ఇండస్ట్రీస్, ఐషర్ మోటార్స్ వంటివి ఇందుకు మంచి ఉదాహరణలు. ఇవి గడిచిన అయిదేళ్లలో అమ్మకాలు, లాభాల్లో 30 శాతానికి పైగా వృద్ధి కనబరుస్తున్నాయి.
 
 ఈపీఎస్.. పీఈ నిష్పత్తి బాగున్నాయా!
 కంపెనీని ఎంచుకునేటప్పుడు బేసిక్ ఎర్నింగ్స్ పర్ షేరు (బేసిక్ ఈపీఎస్), ప్రైస్ మల్టిపుల్స్ వంటివి చూడాలి. త్రైమాసికాల వారీగా కంపెనీ ప్రకటించే బేసిక్ ఈపీఎస్‌ను బట్టి స్టాక్స్ ధరలు మారుతుంటాయి. ఈపీఎస్ విలువను బట్టి ప్రైస్ టు ఎర్నింగ్స్ (పీఈ), ప్రైస్ టు సేల్స్ విలువ (పీఎస్) నిష్పత్తులు తెలుస్తాయి. ఇవి రెండూ మార్కెట్లో కంపెనీ వేల్యుయేషన్ గురించి చెబుతాయి. సంస్థ మంచి పనితీరు కనపరుస్తూ.. షేరు ధర కన్నా ఈపీఎస్ మెరుగ్గా ఉంటున్న పక్షంలో ఆ కంపెనీ స్టాక్‌పై దృష్టి పెట్టవచ్చు. ఇక, మూడు నెలలకోసారి ప్రకటించే ఆర్థిక ఫలితాల్లో ఆదాయం, స్థూల లాభం అంశాలు కంపెనీ పనితీరు గురించి చెబుతాయి కనుక వీటిని అధ్యయనం చేయాలి.
 
 వ్యాపార మోడల్‌కు భవిష్యత్తుందా?
 కంపెనీ తయారు చేసే ఉత్పత్తులు, అందించే సేవలకు కనీసం మరికొన్నేళ్ళ పాటైనా సరైన డిమాండ్ ఉంటుందా.. అమ్మకాలు పెరుగుతాయా అన్నది చూడాలి. నిర్దిష్ట రంగంలో సదరు కంపెనీదే ఆధిపత్యం ఉంటే మంచిదే. క్రిసిల్, జిలెట్, నెస్లే వంటివి ఇందుకు ఉదాహరణలు. కస్టమర్లను ఆకర్షించగలిగే శక్తి ఆయా బ్రాండ్లకుండాలి. ఇంటర్నెట్ విప్లవంతో అమెజాన్ లాంటివి వెలుగులోకి వచ్చాయి. అయితే, ప్రాచుర్యం గల బ్రాండ్లన్నీ కూడా మల్టీ బ్యాగర్స్ అని భావించడానికి లేదు. దీనితో పాటు మరికొన్ని ప్రమాణాలు కూడా చూడాలి.
 
 
  పెట్టుబడి అవసరాలెంత?
 కంపెనీ ఏదైనా సరే... కనీస పెట్టుబడులతో గరిష్ట రాబడులు అందించగలిగేదిగా ఉండాలి. సాధారణంగా ఇన్‌ఫ్రా.. రియల్ ఎస్టేట్ వంటి రంగాల సంస్థలతో పోలిస్తే టెక్నాలజీ, ఫార్మా, వినియోగ వస్తువుల వంటి కంపెనీల విస్తరణకు పెట్టుబడి వ్యయాలు తక్కువగానే ఉంటాయి. రుణభారం సముచిత స్థాయిలో ఉండి, కార్యకలాపాల విస్తరణకు అవసరమైన నిధులు అంతర్గతంగానైనా సమకూర్చుకోగలిగే ఆరోగ్యకరమైన ఆర్థిక స్థితిలో ఉన్న కంపెనీలను ఎంచుకోవాలి. నిధులు కావాల్సినపుడల్లా షేర్ హోల్డర్ల వాటాలు, ప్రయోజనాలు దెబ్బతినేలా ఈక్విటీలు జారీ చేస్తూ ఉంటాయి కొన్ని. కొన్నయితే రుణభారాన్ని మోయలేని స్థాయికి పెంచుకుంటూ పోతుంటాయి. ఈ రెండు రకాల కంపెనీలూ మంచివి కాదనే చెప్పాలి. అధిక వడ్డీ రేటుతో అత్యధిక రుణభారం, చెల్లింపుల సమస్యలున్న కంపెనీల షేర్లు.. ఏదైనా తేడా వస్తే కుప్పకూలే అవకాశం ఉంది. బ్యాలెన్స్ షీటు పటిష్టంగా ఉండి.. రుణభారం ఈక్విటీలో 30 శాతం కన్నా తక్కువగా ఉన్న సంస్థలనైతే పరిశీలించవచ్చు.
 
  మెరుగైన మార్జిన్లున్నాయా?
 లాభాల మార్జిన్లు తగ్గకుండా అదే స్థాయిలో కొనసాగించేందుకు.. అంతకు మించి మెరుగుపర్చుకునేందుకు కంపెనీ ఏం చేస్తోంది? చాలా మటుకు ఇన్వెస్టర్లు ప్రస్తుతం ఉన్న ధోరణులే భవిష్యత్‌లోనూ కొనసాగవచ్చని భావిస్తుంటారు. ఏదైనా కంపెనీ గడచిన అయిదేళ్లలో సగటున 8-12 శాతం మార్జిన్లు సాధిస్తే... వచ్చే అయిదేళ్లలో కూడా అదే మార్జిన్లు కొనసాగవచ్చని భావిస్తారు. అయితే, ట్రెండ్‌ను దాటి మరింత అధిక మార్జిన్లు (అంటే 15-20 శాతం మేర) సాధించగలిగే సత్తా ఉన్న సంస్థలను మరికాస్త లోతుగా అధ్యయనం చేసి, వాటి షేర్లను పట్టుకోగలిగితే లాభదాయకమే.
 
 పరిశోధన.. అభివృద్ధి కార్యకలాపాలేంటి?
 ఏ కంపెనీలయినా ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులు, వినూత్న సర్వీసులు అందించగలిగితేనే వృద్ధి చెందుతాయి. ఇందుకోసం అవి పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై (ఆర్‌అండ్‌డీ) కూడా కొంత వెచ్చించాల్సి ఉంటుంది. ఫలితాల గురించి అంచనాలు వేసుకోవడం కొంత సంక్లిష్టమైనప్పటికీ.. ఎదుగుదల కోసం కంపెనీ ఏ స్థాయిలో ఆర్ అండ్‌డీపై ఖర్చు పెడుతోందన్న గణాంకాలు కూడా భవిష్యత్‌లో దాని వృద్ధి అవకాశాల గురించి కాస్త సంకేతాలు ఇవ్వగలవు.
 
 అన్నీ బాగున్నా సరే...
 సరే! పైన చెప్పినవన్నీ చూసి ఆయా షేర్లలో  ఇన్వెస్ట్ చేశారనుకోండి. అక్కడితోనే అయిపోదు. షేర్ మార్కెట్లో ఓపిక ముఖ్యం. మీరు ఇవ్వాళ ఇన్వెస్ట్ చేయగానే రేపు అది పెరిగిపోవాలనుకుంటే కష్టం. షేర్లలో ఇన్వెస్ట్ చేశాక కాస్త సమయం ఇవ్వాలి. ఒకవేళ మార్కెట్ పరిస్థితులు బాగులేకుంటే ఆయా షేర్లు మీరు ఇన్వెస్ట్ చేశాక దారుణంగా పతనమైపోవచ్చు. అంతమాత్రాన వాటిని విక్రయించేసి నష్టాలతో బయటపడటం అనవసరం. ఆ షేరుకు సంబంధించి అన్నీ బాగుండి... మార్కెట్ స్థితి గతులవల్ల మాత్రమే పడిన పక్షంలో... దానిపై మీకు నమ్మకముంటే బాగా పడి తక్కువ ధరకు వస్తున్నపుడు ఇంకొన్ని కొనుగోలు చేసి యావరేజ్ చెయ్యొచ్చు. కాస్త ఓపిక పడితే మంచి షేర్లు పెరగకపోవన్నది గమనించాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement