Multi Bagger Share: Hindustan Motors Share Prices Surged Due to Electric Ambassador Car - Sakshi
Sakshi News home page

ఒక్క మాటతో ఆ కంపెనీ షేర్లు ఎక్కడికో దూసుకు పోయాయి!

Published Thu, Jun 9 2022 2:10 PM | Last Updated on Thu, Jun 9 2022 5:40 PM

Multi Bagger Share: Hindustan Motors Share Prices Surged due to Electric Ambassador Car - Sakshi

షేర్‌ మార్కెట్‌ అదొక అర్థం కాని మయాజాలం. గ్రాఫులు , లెక్కలు, విశ్లేషణలు, మార్కెట్‌ పండితులు ఇలా ఎందరు ఎన్ని చెప్పినా  అంచనాలు క్షణాల్లో పట్టు తప్పుతుంటాయ్‌. పదేళ్ల డేటాతో చేసిన విశ్లేషణ కంటే కూడా సెంటిమెంట్‌ పవర్‌ ఎక్కువ మార్కెట్‌లో. చాన్నాళ్ల తర్వాత మార్కెట్‌కి సెంటిమెంట్‌ రుచి చూపించి ఇన్వెస్టర్లకు రూపాయికి రూపాయి లాభం అది రెండు వారాల వ్యవధిలోనే అందించింది ఓ బ్రాండ్‌.

ఒకప్పుడు ఇండియన్‌ రోడ్లపై రారాజులా వెలిగింది అంబాసిడర్‌ కారు. బిర్లాలకు చెందిన హిందూస్థాన్‌ మోటార్స్‌ సంస్థ ఈ కారును మార్కెట్‌లోకి తెచ్చింది. మార్కెట్‌లోకి రావడం ఆలస్యం ట్యాక్సీ డ్రైవర్‌ నుంచి సెలబ్రిటీల వరకు అందరి మనసును దోచుకుంది. 90వ దశకం వరకు సినిమాల్లో ఈ కారే కనిపించేది. అంబాసిడర్‌ అంటే స్టేటస్‌ సింబల్‌గా వెలిగిపోయింది. విదేశీ కార్లు ఇండియాలోకి వచ్చినా రాజకీయ నేతలు చాన్నాళ్ల పాటు అంబాసిడర్‌ని వదల్లేక పోయారు. అయితే ఆధునికతను సంతరించుకోక క్రమంగా అంబాసిడరే కనుమరుగై పోయింది.

అంబాసిడర్ సెంటిమెంట్‌
పాత అంబాసిడర్‌కు కొత్తగా ఎలక్ట్రిక్‌ హంగులు అద్ది మార్కెట్‌లోకి తెస్తామంటూ హిందూస్థాన్‌ మోటార్స్‌ సంస్థ ఇటీవల ప్రకటించింది. ఈ మేరకు విదేశీ కంపెనీతో సంప్రదింపులు కూడా పూర్తయినట్టు వెల్లడించింది. రాబోయే ఎలక్ట్రిక్‌ అంబాసిడర్‌ కారు ప్రొటోటైప్‌ ఫోటోలు, వీడియోలు సైతం సోషల్ మీడియాలో హోరెత్తిపోయాయి. పాత కాలం అంబాసిడర్‌ను కొత్త లుక్‌లో చూసేందుకు దేశం యావత్తు ఆసక్తి చూపించింది. అంబాసిడర్‌ మీద ఓ పాజిటివ్‌ వైబ్‌ క్రియేట్‌ అయ్యింది.

షేర్ల ధరకు రెక్కలు
గడిచిన ఐదేళ్లుగా హిందూస్తాన్‌ మోటార్స్‌ షేరు రూ. 7 నుంచి రూ 10 దగ్గరే తిరుగాడుతోంది. కేవలం రెండు సార్లు మాత్రమే స్వల్ప కాలం పాటు రూ.15 గరిష్టాలను అందుకుంది. అంబాసిడర్‌ సరికొత్త రూపంలో మార్కెట్‌లోకి రాబోతుందన్న వార్త వచ్చిన తర్వాత హిందూస్థాన్‌ మోటార్స్‌ షేర్లకు రెక్కలు వచ్చాయి. 

లాభాలే లాభాలు
మే 24న హిందూస్థాన్‌ మోటార్స్‌ ఒక్క షేరు ధర రూ. 10.80 దగ్గర ఉండగా జూన్‌ 8న షేరు ధర రూ.22.05కి చేరుకుంది. కేవలం రెండు వారాల వ్యవధిలో షేరు ధర రెట్టింపు అయ్యింది. మే 24న ఎలక్ట్రిక్‌ అంబాసిడర్‌ వార్త విని లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన వారికి రెండు వారాలు తిరిగే సరికి మరో లక్ష లాభం కళ్ల చూడగలిగారు. ఇక ఎప్పటి నుంచో ఈ షేర్లను అట్టిపెట్టుకున్న వారు ఒక్క వార్తతో బూరెల బుట్టలో పడ్డట్టు అయ్యింది. చాలా కాలం పాలు లాభాలు అందివ్వని హిందూస్థాన్‌ మోటార్స్‌ షేర్లు ఒక్క వార్తతో తారా జువ్వలా లాభాల్లోకి దూసుకుపోయాయి. 

చదవండి: Ambassador Electric Car: ఇండియన్ రోడ్ల రారాజు.. అంబాసిడర్ కొత్త లుక్కు చూసారా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement