
ముంబై: స్టాక్ సూచీలు వరుస నష్టాల నుంచి కోలుకున్నాయి. ఎన్నికల అప్రమత్తత, విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి, ద్రవ్యోల్బణం వంటి ప్రతికూలతలున్నా.., అధిక వెయిటేజీ రిలయన్స్, ఐటీసీ, భారతీ ఎయిర్‌టెల్ షేర్ల రాణించి సూచీలకు దన్నుగా నిలిచాయి. ఫలితంగా శుక్రవారం సెన్సెక్స్ 260 పాయింట్లు లాభపడి 72,664 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 98 పాయింట్లు పెరిగి 22,055 వద్ద నిలిచింది.
ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. ఇటీవల మార్కెట్ పతనంతో కనిష్టాలకు దిగివచి్చన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. లండన్ మెటల్ ఎక్సే్చంజీలో బేస్ మెటల్ ధరలు అనూహ్యంగా పెరగడంతో మెటల్ షేర్లకు డిమాండ్ నెలకొంది. అలాగే యుటిలిటీ, పవర్, ఆయిల్ అండ్ గ్యాస్, కమోడిటీ, టెలికం, ఆటో షేర్లు రాణించాయి.
ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 542 పాయింట్లు ఎగసి 72,947 వద్ద, నిఫ్టీ 174 పాయింట్లు బలపడి 22,131 వద్ద ఇంట్రాడే గరిష్టాలను అందుకున్నాయి. మరోవైపు ఐటీ, బ్యాంకులు, టెక్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అమెరికా ఆర్థిక గణాంకాలు ఆర్థిక ఫలితాలపై ఆశావహ అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. కాగా, ప్రతి రెండు షేర్లకు ఒక షేరు బోనస్ ప్రకటించడంతో బీపీసీఎల్ షేరు 4.5% లాభపడి రూ.619 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో 5% పెరిగి రూ.622 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది.