ముంబై: ఆర్థిక వ్యవస్థ రికవరీ సంకేతాలను ప్రతిబింబిస్తూ మార్కెట్లో మళ్లీ కొనుగోళ్లు నెలకొన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల లాభాల ట్రేడింగ్ కూడా ఇన్వెస్టర్లకు విశ్వాసాన్నిచ్చింది. ఫలితంగా సూచీల మూడురోజుల నష్టాలకు సోమవారం చెక్ పడింది. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగ షేర్ల ర్యాలీ అండతో సెన్సెక్స్ 144 పాయింట్ల లాభంతో 39,758 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 27 పాయింట్లు పెరిగి 11,669 వద్ద నిలిచింది.
లాక్‌డౌన్ తర్వాత తొలిసారి అక్టోబర్‌లో జీఎస్‌టీ వసూళ్లు రూ.1 లక్ష కోట్లను దాటడంతో పాటు ఇదే నెలలో ప్రధాన వాహన కంపెనీల విక్రయాలు రెండింతల వృద్ధిని సాధించాయి. దీంతో వ్యవస్థలో తిరిగి డిమాండ్ ఊపందుకుందనే సంకేతాలు ఇన్వెస్టర్లకు ఉత్సాహానిచ్చింది. మరోవైపు ప్రపంచమార్కెట్లు నెలరోజుల కనిష్టం నుంచి కోలుకోవడం మన మార్కెట్‌కు కలిసొచ్చింది. చైనాతో పాటు ఐరోపా దేశాలు మెరుగైన తయారీ రంగ గణాంకాలను ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లు లాభాలబాట పట్టాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 39,968 వద్ద గరిష్టాన్ని తాకగా.. 39,335 దిగువన కనిష్టాన్ని చవిచూసింది. నిఫ్టీ 11,726– 11,557 పాయింట్ల మధ్య కదలాడింది. అయితే ఐటీ, ఫార్మా, మెటల్, ఆటో షేర్లు మాత్రం అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.
రూ.లక్ష కోట్లకు పైగా రిలయన్స్ సంపద ఆవిరి
రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 9 శాతం పతనంతో కంపెనీ రూ.లక్ష కోట్లకు పైగా మార్కెట్ క్యాప్‌ను కోల్పోయింది. క్యూ2 ఫలితాలు మార్కెట్‌ను మెప్పించకపోవడంతో షేరు అమ్మకాల ఒత్తిడికి లోనైంది. ఒక దశలో షేరు 9.50 శాతం నష్టపోయి రూ.1,860 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని పతనమైంది. చివరికి 9% నష్టంతో రూ.1,877 వద్ద స్థిరపడింది. షేరు భారీ పతనంలో కంపెనీ రూ.1.19లక్షల కోట్ల విలువైన మార్కెట్ క్యాప్‌ను నష్టపోయింది.
ఆరుశాతం పెరిగిన ఐసీఐసీఐ షేరు
రెండో త్రైమాసికంలో ఐసీసీఐసీఐ నికరలాభం నాలుగు రెట్లు పెరగడంతో బ్యాంకు షేరు సోమవారం 6శాతం లాభంతో రూ.417 వద్ద ముగిసింది. దేశీయ రెండో అతిపెద్ద బ్యాంకు సోమవారం సెప్టెంబర్ క్వార్టర్ ఫలితాలను ప్రకటించింది. కరోనా సంబంధిత కేటాయింపులు తక్కువగా ఉండడంతో పాటు ఆదాయ వృద్ధి పెరగడంతో ఈ ద్వితియా క్వార్టర్‌లో కంపెనీ రూ.4,882 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. షేరు భారీ ర్యాలీతో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.16,957 కోట్లు పెరిగి రూ.2,87,668 వద్ద స్థిరపడింది.
నిరాశపరిచిన ఈక్విటాస్ లిస్టింగ్...
ఇటీవల పబ్లిక్ ఇష్యూకి వచ్చిన ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిస్టింగ్ ఇన్వెస్టర్లను నిరాశపరచింది. ఇష్యూ ధరతో పోలిస్తే బీఎస్‌ఈలో 6 శాతం తక్కువగా రూ.31 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఒక దశలో 9 శాతం నష్టపోయి రూ.30.10 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. అయితే మిడ్‌సెషన్ తర్వాత బ్యాంకింగ్ రంగ షేర్లకు లభించిన కొనుగోళ్ల మద్దతులో భాగంగా నష్టాలను తగ్గించుకోగల్గింది. చివరికి 1 శాతం నష్టంతో రూ.32.75 వద్ద స్థిరపడింది.
రెండు నెలల కనిష్టానికి రూపాయి
ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో సోమవారం డాలర్ మారకంలో రూపాయి విలువ 32 పైసలు పతనంతో 74.42 వద్ద ముగిసింది. గడచిన రెండు నెలల్లో రూపాయి ఇంత తక్కువ స్థాయిని చూడలేదు. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, డాలర్ల కోసం డిమాండ్ రూపాయి సెంటిమెంట్‌ను దెబ్బతీసినట్లు ఫారెక్స్ ట్రేడర్లు పేర్కొన్నారు. రూపాయికి ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ).
Comments
Please login to add a commentAdd a comment