ముంబై: ఆఖర్లో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో స్టాక్ సూచీల ర్యాలీ తొమ్మిదోరోజూ కొనసాగింది. గడిచిన రెండేళ్లలో సూచీలు వరుసగా తొమ్మిది రోజుల పాటు ర్యాలీ చేయడం ఇదే తొలిసారి. జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న బలహీన సంకేతాల కారణంగా ఇంట్రాడేలో సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. సెన్సెక్స్ ఉదయం 29 పాయింట్ల నష్టంతో 60,364 వద్ద మొదలైంది.
ట్రేడింగ్‌లో 405 పాయింట్ల పరిధిలో కదలాడి 60,081 వద్ద కనిష్టాన్ని 60,487 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 38 పాయింట్ల స్వల్ప లాభంతో 60,431 వద్ద ముగిసింది. నిఫ్టీ అయిదు పాయింట్లను కోల్పోయి 17,807 వద్ద 17,635 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 17,730 వద్ద కనిష్టాన్ని 17,842 వద్ద గరిష్టాన్ని తాకింది. ఆఖరికి 16 పాయింట్లు పెరిగి 17,828 వద్ద స్థిరపడింది. ఐటీ, ఫార్మా, ఇంధన, మీడియా రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.
బీఎస్‌ఈ మిడ్ క్యాప్ సూచీ 0.33%, స్మాల్ క్యాప్ సూచీ 0.16 శాతం చొప్పున లాభపడ్డాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 26 పైసలు బలపడి 81.85 వద్ద స్థిరపడింది.విదేశీ ఇన్వెస్టర్లు రూ.222 కోట్ల షేర్లను కొన్నారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.274 కోట్ల షేర్లను అమ్మేశారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా నేడు మార్కెట్లకు సెలవు. శని, ఆది వారాలు సాధారణ సెలవు దినాలు కావడంతో ఎక్సే్చంజీలు తిరిగి సోమవారం యథావిధిగా ప్రారంభమవుతాయి. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి.
‘‘టీసీఎస్ క్యూ4 ఆర్థిక ఫలితాల సందర్భంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసులు, బీమా విభాగం(బీఎఫ్‌ఎస్‌ఐ) పనితీరు, అవుట్‌లుక్‌పై యాజమాన్యం ఆందోళనకర వ్యాఖ్యలతో దేశీయ ఐటీ రంగ షేర్లన్నీ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. మరోవైపు అమెరికాలో ద్రవ్యోల్బణం దిగివచ్చినప్పటికీ.., బ్యాంకింగ్ సంక్షోభం కారణంగా మాంద్యం పరిస్థితులు తలెత్తవచ్చని ఎఫ్‌ఓఎంసీ మినిట్స్ సూచించడంతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా కదలాడాయి. ఈ జాతీయ, అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment