ముంబై: స్టాక్ మార్కెట్లో వరుసగా ఆరో రోజూ కొనుగోళ్ల పర్వం కొనసాగింది. ఫలితంగా సెన్సెక్స్ 7 నెలల తర్వాత తొలిసారి 40,000 మార్కును అందుకుంది. నిఫ్టీ 11,800 స్థాయి పైకి చేరుకుంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి విరివిరిగా కొనుగోళ్లు జరగడంతో సూచీల ర్యాలీ సాఫీగా సాగింది. ర్యాలీకి ఐటీ షేర్లు ప్రాతినిధ్యం వహించాయి. అలాగే ఫార్మా, బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగ షేర్లకు కూడా ఆశించిన స్థాయిలో కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా ఇంట్రాడేలో సెన్సెక్స్ 40,469 పాయింట్ల వద్ద, నిఫ్టీ 11,905 పాయింట్ల వద్ద గరిష్టాలను తాకాయి. అయితే చివరి గంటలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. ఫలితంగా 304 పాయింట్ల లాభంతో 40,183 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 96 పాయింట్లను ఆర్జించి 11,835 వద్ద ముగిసింది. మరోవైపు మీడియా, ఎఫ్‌ఎంసీజీ షేర్లు మాత్రం నష్టాలను చవిచూశాయి. గడిచిన ఆరు ట్రేడింగ్ సెషన్స్‌లో సెన్సెక్స్ 2,210 పాయింట్లను, నిఫ్టీ 612 పాయింట్లను ఆర్జించాయి.
అదరగొట్టిన ఐటీ షేర్లు
నేడు సూచీల భారీ లాభార్జనలో ఐటీ షేర్ల పాత్ర ఎంతైనా ఉంది. ఐటీ దిగ్గజం టీసీఎస్ కంపెనీ క్యూ2 ఫలితాలు అంచనాలను మించాయి. అలాగే రూ.16వేల కోట్ల బైబ్యాక్ ప్రకటనతో ఇండెక్స్‌ల్లో అధిక వెయిటేజీ కలిగిన టీసీఎస్ షేరు నేడు 3శాతం లాభపడింది. ఈ అక్టోబర్ 13న జరిగే బోర్డు సమావేశంలో బైబ్యాక్ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామనే ప్రకటనతో విప్రో షేరు 7% ర్యాలీ చేసింది. ఇదే రంగంలోని ప్రధాన షేర్లైన ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా షేర్లు 3–2 శాతం ర్యాలీ చేశాయి. మొత్తం మీద బీఎస్‌ఈ ఐటీ ఇండెక్స్ 3 శాతం పెరిగింది.
ప్రపంచ మార్కెట్ల సానుకూల సంకేతాలు
అమెరికా అధ్యక్ష ఎన్నికలలోపు కొంతైనా సహాయక ప్యాకేజీని ప్రభుత్వం ప్రకటించవచ్చనే వార్తలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లో సానుకూల సంకేతాల వాతావరణం నెలకొంది. ఆసియాలో కొన్ని మార్కెట్లు నెల గరిష్టం వద్ద ముగిశాయి. యూరప్ మార్కెట్లు లాభంతో ప్రారంభమయ్యాయి. అమెరికా ఫ్యూచర్లు సైతం అరశాతం లాభంతో కదలాడాయి. ప్రపంచమార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలు మన మార్కెట్‌కు కలిసొచ్చాయి.
కొనసాగుతున్న ఎఫ్‌ఐఐల కొనుగోళ్లు
భారత ఈక్విటీ మార్కెట్ పట్ల విదేశీ ఇన్వెస్టర్లు సానుకూల వైఖరిని కలిగి ఉన్నారు. లాక్‌డౌన్ ఎత్తివేత తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా రికవరీ అవుతుందనే అంచనాలు వారిని ఆకర్షిస్తున్నాయి. అందుకు సంకేతంగా ఈ వారం ప్రారంభం నుంచి ఎఫ్‌ఐఐలు మన మార్కెట్లో భారీ ఎత్తున కొనుగోళ్లు జరుపుతున్నారు.
ఐటీ సెక్టార్ మెరుగైన క్యూ2 ఫలితాల ప్రకటనతో మార్కెట్లో సానుకూల వాతావరణాన్ని నెలకొల్పింది. అలాగే పలు కంపెనీల బైబ్యాక్‌లు ఇన్వెస్టర్లను ఉత్సాహపరిచాయి. అమెరికా, భారత్‌లో ఉద్దీపన ప్యాకేజీ ప్రకటన అంచనాలు సెంటిమెంట్‌ను మరింత బలపరిచాయి.
– వినోద్ నాయర్, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్
40,000 పైకి సెన్సెక్స్
Published Fri, Oct 9 2020 6:08 AM | Last Updated on Fri, Oct 9 2020 6:08 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment