బ్యాంక్, ఆర్థిక రంగ షేర్ల కొనుగోళ్ల జోరుతో సోమవారం స్టాక్ మార్కెట్ లాభపడింది. అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉండటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ ఏకంగా 52 పైసలు పుంజుకొని 74.32కు చేరడం, కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ, వినోద రంగ పరిశ్రమ (సినిమా హాళ్లు తెరవడానికి)మరిన్ని వెసులుబాట్లు కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండటం, మూడు ప్రైవేట్ బ్యాంక్‌లను ఎఫ్‌టీఎస్‌ఈ గ్లోబల్ ఇండెక్స్‌లో చేర్చడం సానుకూల ప్రభావం చూపించాయి. సెన్సెక్స్ 364 పాయింట్లు లాభపడి 38,799 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 95 పాయింట్లు పెరిగి 11,466 పాయింట్ల వద్ద ముగిశాయి. ఈ రెండు సూచీలు ఆరు నెలల గరిష్ట స్థాయికి చేరాయి.
అప్రమత్తత అవసరం...
సెన్సెక్స్ లాభాల్లోనే ఆరంభమైంది. రోజు గడుస్తున్న కొద్దీ లాభాలు అంతకంతకూ పెరుగుతూనే పోయాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 460 పాయింట్లు, నిఫ్టీ 125 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. నిధుల వరద పారుతుండటంతో మార్కెట్ జోరుగా పెరుగుతోందని, ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
ప్లాస్మా చికిత్సకు అమెరికా ఎఫ్‌డీఏ ఓకే...
కరోనా వైరస్ సోకిన రోగులకు ప్లాస్మా చికిత్స చేయడానికి అమెరికా ఎఫ్‌డీఏ ఆమోదం తెలిపింది. మరోవైపు కరోనా వ్యాక్సిన్‌ను ఇంగ్లాండ్ నుంచి దిగుమతి చేసుకోవడానికి కొన్ని నిబంధనలను సడలించాలని అమెరికా ప్రభుత్వం యోచిస్తోందన్న వార్తలు వచ్చాయి. ఫలితంగా అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు ముందే కరోనా వ్యాక్సిన్‌ను ఉపయోగించే అవకాశాలున్నాయి. ఈ రెండు అంశాల కారణంగా ప్రపంచ మార్కెట్లు పరుగులు పెట్టాయి. ఆసియా మార్కెట్లు 1 శాతం యూరప్ మార్కెట్లు 2 శాతం రేంజ్‌లో లాభపడ్డాయి.
► కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్ 3.5% లాభంతో రూ.1,387 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే.
► దాదాపు 200కు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు చేరాయి. హీరో మోటొకార్ప్, ఆఫిల్ ఇండియా, ఇమామి, సనోఫి ఇండియా, ఎస్‌ఆర్‌ఎఫ్, ఆర్తి డ్రగ్స్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.
► ముంబై ఇంటర్నేషనల్ ఏయిర్‌పోర్ట్‌లో 74 శాతం వాటాను రూ.15,000 కోట్లకు కొనుగోలు చేయనున్నదన్న వార్తల కారణంగా అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్ 7 శాతం లాభంతో రూ.249 వద్ద ముగిసింది. ఈ గ్రూప్‌లోని ఇతర షేర్లు కూడా లాభపడ్డాయి.
► రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేర్‌ను రూ. 1 ముఖ విలువ పది షేర్లుగా విభజన చేసిన నేపథ్యంలో ఐషర్ మోటార్స్ షేర్ ఇంట్రాడేలో 10 శాతం ఎగసింది. చివరకు 0.36 శాతం లాభంతో రూ.2,178 వద్ద ముగిసింది.
► దాదాపు 450కు పైగా షేర్లు అప్పర్ సర్క్యూట్లను తాకాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ, రెప్కో హోమ్ ఫైనాన్స్, అరవింద్ ఫ్యాషన్స్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.
ఆరు నెలల గరిష్టానికి మార్కెట్
Published Tue, Aug 25 2020 5:33 AM | Last Updated on Tue, Aug 25 2020 5:33 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment