న్యూఢిల్లీ: దేశీయ ముడి చమురు ఉత్పత్తి, ఇంధన ఎగుమతులపై ప్రభుత్వం విధించిన విండ్‌ఫాల్ ట్యాక్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు (ఆర్‌ఐఎల్) రిఫైనింగ్ మార్జిన్‌లలో బ్యారెల్‌కు 12 డాలర్ల వరకూ కోత పెట్టనుంది (ప్రస్తుత మార్జిన్ 25 డాలర్లు). ఇక ఓఎన్‌జీసీ ఆదాయంపై కూడా ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపనుంది. కొత్త పన్నుల వల్ల ప్రభుత్వానికి రూ. 1.3 లక్షల కోట్ల వరకు అదనపు ఆదాయం వస్తుందని బ్రోకరేజ్ సంస్థలు పేర్కొన్నారు. దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురు సంస్థలకు అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ధరలతో భారీ లాభాలు వచ్చి పడుతున్నాయి. దీంతో దేశీయంగా ఉత్పత్తి చేసే టన్ను ముడి చమురుపై రూ.23,250 పన్ను లేదా బ్యారల్‌కు 40 డాలర్లు (విండ్‌ఫాల్ ట్యాక్స్) విధించింది.
ఇక్కడి నుంచి ఎగుమతి చేసే లీటర్ పెట్రోల్‌పై రూ.6, విమాన ఇంధనం ఏటీఎఫ్‌పై రూ.6, లీటర్ డీజిల్ ఎగుమతిపై రూ.13 పన్ను విధిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ‘‘ఇటీవలి కాలంలో క్రూడ్ ధరలు గణనీయంగా పెరిగాయి. దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న కంపెనీలకు ఇది అనుకూలంగా మారింది. అంతర్జాతీయ ధరలకే దేశీ రిఫైనరీలకు అవి ముడి చమురును విక్రయిస్తున్నాయి. దీనివల్ల స్థానికంగా ముడి చమురు ఉత్పత్తి చేసే సంస్థలు భారీ లాభాలనార్జిస్తున్నాయి. దీన్ని పరిగణనలోకి తీసుకుని తాజా నిర్ణయం తీసుకున్నాం’’ అని ఆర్థిక శాఖ తెలిపింది. జూలై 1 నుంచే ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చాయి. దీనితోపాటు పసిడిపై దిగుమతి సుంకాన్ని కేంద్రం 5 శాతం పెంచింది. దీనితో ఈ రేటు 10.75 శాతం నుంచి 15 శాతానికి చేరింది. ఆయా అంశాలపై బ్రోకరేజ్ సంస్థల నివేదికలు పరిశీలిస్తే...
రవాణా ఇంధనాలపై రూ.68,000 కోట్లు
గత సంవత్సరంలో డీజిల్, గ్యాసోలిన్ ఎగుమతి పరిమాణం ఆధారంగా 2022–23 అంచనాలను మేము లెక్కగట్టాం. మేము మూడు రవాణా ఇంధనాలపై (పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్) రూ. 68,000 కోట్ల అదనపు ఆదాయాలను అంచనా వేస్తున్నాము. అదేవిధంగా, ముడి చమురుపై విండ్‌ఫాల్ పన్నులు అదనపు ఆదాయాలలో రూ. 70,000 కోట్లను పెంచే వీలుంది. దీనివల్ల రిలయన్స్ మార్జిన్‌ల విషయంలో బ్యారెల్‌కు 12 డాలర్ల మేర (వార్షిక ప్రాతిపదికన రూ. 47,000 కోట్లు) ప్రభావం చూపగలవని అంచనా. – నోమురా
లోటు భర్తీ లక్ష్యం... : 2022 మేలో ప్రభుత్వం పెట్రోల్‌పై లీటరుకు రూ. 8, డీజిల్‌పై రూ. 6 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీనివల్ల కేంద్రం ఆదాయాలు ఒక లక్ష కోట్లు తగ్గాయని అంచనా. అదనపు ఎక్సైజ్ సుంకం (విండ్‌ఫాల్ ట్యాక్స్) విధింపు ప్రకటన ఇప్పుడు వెలువడింది. జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. 2022 మేలో తీసుకున్న నిర్ణయంతో వచ్చే ఆదాయ అంతరాన్ని పూరించడమే లక్ష్యంగా తాజా నిర్ణయం తీసుకున్నట్లు కనబడుతోంది. తాజా నిర్ణయం వల్ల రూ. 1.2 లక్షల కోట్ల ప్రభుత్వం ఆదాయాన్ని ఆర్జిస్తుందని భావిస్తున్నాం.
దీనితోపాటు దేశీయ మార్కెట్ నుండి ఉత్పత్తుల ఎగుమతిని కూడా నిరుత్సాహపరచడానికి కూడా తాజా నిర్ణయం దోహదపడుతుందని భావిస్తున్నాము. క్రూడ్ ఉత్పత్తిపై విండ్ ఫాల్ ట్యాక్స్ వల్ల రూ.65,600 కోట్లు, ఎగుమతి ఉత్పత్తులపై పన్నులు ఏడాది పాటు కొనసాగితే మరో రూ.52,700 కోట్ల ఆదాయం సమకూరుతుందని మా అంచనా. కొత్త పన్ను వల్ల ఓఎన్‌జీసీ ఆదాయాలు ఒక్కో షేరుకు రూ.30 తగ్గే అవకాశం ఉంది. ఆర్‌ఐఎల్‌పై దీని ప్రభావం రూ.36గా ఉంటుందని అంచనా. అయితే ఆర్‌ఐఎల్ దేశీయ మార్కెటింగ్ మార్జిన్‌లో నష్టం... ఎగుమతి పన్ను కంటే ఇంకా ఎక్కువగా ఉందని మేము విశ్వసిస్తున్నాము. అందువల్ల ఆర్‌ఐఎల్ గణనీయమైన మొత్తాలలో ఎగుమతి చేయడాన్ని కొనసాగించవచ్చని మేము భావిస్తున్నాము. – హెచ్‌ఎస్‌బీసీ గ్లోబల్ రీసెర్చ్
భారీ పన్ను రాబడులు: ఇదే నిర్ణయం ఇకముందూ కొనసాగితే, పన్నుల వల్ల వార్షిక ప్రాతిపదికన కేంద్రానికి రూ. 1.3 లక్షల కోట్ల అదనపు పన్ను రాబడులు వస్తాయని భావిస్తున్నాం. 2023 ఆర్థిక సంవత్సరానికి రూ. 1 లక్ష కోట్ల ఆదాయం ఒనగూడుతుందని అంచనా. - కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్
1.38 లక్షల కోట్ల అదనపు పన్ను : అదనపు పన్నుల ద్వారా ప్రభుత్వం ఏటా రూ. 1.38 లక్షల కోట్లను సేకరించవచ్చన్నది మా అంచనా. – యూబీఎస్ అంచనా
Comments
Please login to add a commentAdd a comment