
ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో మూడో రోజూ అమ్మకాల ఒరవడి కొనసాగింది. బలహీన అంతర్జాతీయ సంకేతాలకు తోడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ కౌంటర్లో లాభాల స్వీకరణతో ప్రధాన సూచీలు స్వల్పంగా నష్టపోయాయి. సెన్సెక్స్ 129 పాయింట్లు కోల్పోయి 37,607 వద్ద ముగిసింది. నిఫ్టీ 29 పాయింట్ల నష్టంతో 11,073 వద్ద స్థిరపడింది. ఈ వారంలో సెన్సెక్స్ 522 పాయింట్లు (1.36 శాతం), నిఫ్టీ 121 పాయింట్లు (1.07శాతం) చొప్పున నికరంగా నష్టపోయాయి.
రిలయన్స్‌కు అమ్మకాల సెగ
ఫలితాల ప్రకటన తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ కౌంటర్లో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారు. దీంతో ఈ స్టాక్ బీఎస్‌ఈలో 2 శాతం నష్టపోయింది. గురువారం మార్కెట్ ముగిసిన తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ జూన్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. సెన్సెక్స్‌లో అత్యధికంగా నష్టపోయింది ఈ స్టాకే. ఇక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ, ఏషియన్ పెయింట్స్, కోటక్ బ్యాంకు, బజాజ్ ఆటో, అల్ట్రాటెక్ సిమెంట్ నష్టపోయిన వాటిల్లో ఉన్నాయి. సన్‌ఫార్మా, ఎస్‌బీఐ, హెచ్‌సీఎల్ టెక్, ఎంఅండ్‌ఎం, యాక్సిస్ బ్యాంకు లాభపడ్డాయి. ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించడంతో ఎస్‌బీఐ 3 శాతం వరకు లాభపడడం గమనార్హం. యూఎస్ జీడీపీ రికార్డు స్థాయిలో మైనస్ 32.9 శాతానికి జూన్ త్రైమాసికంలో పడిపోవడంతో ప్రపంచ మార్కెట్లలో ఉత్సాహం ఆవిరైంది. హాంకాంగ్, టోక్యో, సియోల్ నష్టపోగా, షాంఘై లాభపడింది.