ముంబై: ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండో రోజూ గురువారం అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. క్రితం రోజు యూఎస్ ఫెడ్ పాలసీకి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్త ధోరణి, లాభాల స్వీకరణతో మార్కెట్లు నష్టపోగా.. ఫెడ్ పాలసీ ప్రకటన సానుకూలంగానే వచ్చినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాలకే ఇన్వెస్టర్లు మొగ్గు చూపించారు. ఫెడ్ తన డోవిష్ పాలసీని యథాతథంగా కొనసాగిస్తూ, వడ్డీ రేట్లను సున్నా స్థాయిలోనే కొనసాగిస్తూ, బాండ్ల కొనుగోలు సహా ఇతర ఆర్థిక ఉద్దీపన చర్యలు కొనసాగుతాయని ప్రకటించింది.
అంచనాలకు అనుగుణంగానే పాలసీ చర్యలు ఉన్నాయి. అయినా, దేశీయంగా జూలై నెల ఎఫ్‌అండ్‌వో ముగింపు రోజున ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణను కొనసాగించారు. కరోనా కేసుల పెరుగుదలే ఇన్వెస్టర్ల ఆందోళనకు కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. బీఎస్‌ఈ ఉదయం లాభాలతో ట్రేడింగ్ మొదలు పెట్టినప్పటికీ.. చివరకు 335 పాయింట్లు (0.90 శాతం) నష్టంతో 37,736 వద్ద క్లోజయింది. అదే విధంగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 101 పాయింట్లు (0.90 శాతం) క్షీణించి 11,102 వద్ద స్థిరపడింది.
► నిఫ్టీలో ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ 4%, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 1.5% నష్టపోయాయి.
► బీపీసీఎల్‌లో ప్రభుత్వ పెట్టుబడుల విక్రయానికి సంబంధించి బిడ్ల దాఖలు గడువును ప్రభుత్వం సెప్టెంబర్ ఆఖరు వరకు పొడిగించడంతో ఈ స్టాక్ భారీగా 7 శాతం నష్టపోయింది.
► ఇండస్‌ఇండ్ బ్యాంకు 5 శాతం, ఐవోసీ 4 శాతం, యాక్సిస్ బ్యాంకు 3 శాతం, భారతీ ఎయిర్‌టెల్ 3 శాతం చొప్పున నష్టాల్లో ముగిశాయి.
► డాక్టర్ రెడ్డీస్ కౌంటర్‌లో ర్యాలీ కొనసాగింది. గురువారం మరో 5 శాతం వరకు లాభపడింది.
► అదే విధంగా సన్‌ఫార్మా 4 శాతం, విప్రో రెండున్నర శాతం, మారుతి ఒకటిన్నర శాతం వరకు లాభపడ్డాయి.
► రంగాల వారీ సూచీలను గమనిస్తే.. బీఎస్‌ఈ టెలికం, ఆయిల్ అండ్ గ్యాస్, ఫైనాన్స్, బ్యాంకెక్స్, యుటిలిటీస్, పవర్ సూచీలు నష్టపోయాయి. హెల్త్‌కేర్, ఐటీ సూచీలు లాభపడ్డాయి.
జోష్‌నివ్వని అన్‌లాక్ 3.0
యూఎస్ ఫెడ్ పాలసీని యథాతథంగా కొనసాగించినప్పటికీ అంతర్జాతీయంగా మార్కెట్లు నష్టాలను ఎదుర్కొన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వ్యాపార పరిస్థితులు మందగమనంగా ఉండడం, వైరస్ కేసుల పెరుగుదల ఇందుకు కారణమైంది. దేశీయంగా అన్‌లాక్ 3.0 ఉత్సాహాన్నివ్వలేకపోయింది’’
– వినోద్ నాయర్, జియోజిత్ ఫైనాన్షియల్ రీసెర్చ్ హెడ్
Comments
Please login to add a commentAdd a comment