ముంబై: ఈక్విటీ మార్కెట్లు గరిష్టాల్లో మరోసారి అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ 4 శాతం ర్యాలీ చేయడం సూచీలు భారీగా నష్టపోకుండా ఆదుకుందనే చెప్పాలి. శుక్రవారం బీఎస్‌ఈ సెన్సెక్స్ ఇంట్రాడేలో 487 పాయింట్ల శ్రేణిలో చలించి చివరకు 12 పాయింట్ల నష్టంతో 38,129 వద్ద ముగియగా.. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 21 పాయింట్లు కోల్పోయి 11,194 వద్ద స్థిరపడింది.
అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూలతలకుతోడు, అమెరికా–చైనా మధ్య ఉద్రిక్తతలు సెంటిమెంట్‌ను బేరిష్‌గా మార్చినట్టు విశ్లేషకులు తెలిపారు. హూస్టన్‌లో చైనా కాన్సులేట్‌ను మూసేయాలంటూ అమెరికా తీసుకున్న నిర్ణయానికి ప్రతీకారంగా.. చైనాలోని చెంగ్డులో ఉన్న అమెరికా కాన్సులేట్‌ను మూసేయాలని డ్రాగన్ ఆదేశించడం ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు మరింత క్షీణించడానికి దారితీయవచ్చని భావిస్తున్నారు. ‘‘ప్రతికూల అంతర్జాతీయ సంకేతాలకు తోడు ట్రేడ్ ఆరంభంలో లాభాల స్వీకరణతో సూచీలు చివరకు స్వల్ప నష్టాలతో ఫ్లాట్‌గా ముగిశాయి. రిలయన్స్ ర్యాలీ నష్టాలను పరిమితం చేసింది
. దేశీయంగా వైరస్ కేసులు రికార్డు స్థాయిలో పెరగడం కూడా ఎర్నింగ్స్ కోలుకోవడంపై ప్రభావం చూపించొచ్చన్న ఆందోళన ఇన్వెస్టర్లలో కనిపించింది’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ పేర్కొన్నారు. మెటల్, బ్యాంకెక్స్, రియల్టీ, ఫైనాన్స్, టెలికం సూచీలు నష్టపోగా, ఐటీ, ఇంధన సూచీలు లాభపడ్డాయి. రిలయన్స్ 4 శాతానికి పైగా ఎగసి రూ.2,146.20 వద్ద బీఎస్‌ఈలో క్లోజయింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.14,14,825.44 కోట్లకు దూసుకుపోయింది. ఇంట్రాడేలో రూ.2,162.80 వరకు వెళ్లడం గమనార్హం. యాక్సిస్ బ్యాంకు, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, ఓఎన్‌జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్ బ్యాంకు అధికంగా నష్టపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment