ముంబై: జీవితకాల గరిష్టస్థాయిల వద్ద లాభాల స్వీకరణ చోటుచేసుకోవడంతో సూచీల నాలుగురోజుల రికార్డుల ర్యాలీకి బుధవారం బ్రేక్ పడింది. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అంచనాల(2.2%)ను మించుతూ యూరోజోన్ ద్రవ్యోల్బణం 2.20 శాతంగా నమోదుకావడంతో యూరప్ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. యూఎస్ ఫెడ్ రిజర్వ్ సమావేశపు మినిట్స్ వెల్లడికి ముందు అమెరికా మార్కెట్లలో అమ్మకాలు తలెత్తాయి. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ రెండోరోజూ 11 పైసలు క్షీణించింది. మొహర్రం సందర్భంగా గురువారం ఎక్సే్చంజీలకు సెలవు కావడంతో ట్రేడర్లు తమ పొజిషన్లను తుదపరి వారానికి రోలోవర్ చేసుకునేందుకు ఆసక్తి చూపలేదు.
ఈ ప్రతికూలతలతో సెన్సెక్స్ 163 పాయింట్లు క్షీణించి 55,629 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 46 పాయింట్లు నష్టపోయి 16,569 వద్ద ముగిసింది. దీంతో సెన్సెక్స్ నాలుగురోజులు, నిఫ్టీ ఏడురోజుల వరుసగా లాభాల ముగింపునకు అడ్డకట్ట పడినట్లైంది. ప్రైవేట్ బ్యాంక్స్, ఆర్థిక, మెటల్ షేర్లు అమ్మకాలు తలెత్తాయి. ఇన్వెస్టర్లు రక్షణాత్మక రంగాలు భావించే ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, ఫార్మా, ప్రభుత్వరంగ బ్యాంక్స్ షేర్లలో కొనుగోళ్లు జరిగాయి. చిన్న, మధ్య తరహా షేర్లు మరోసారి అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో బీఎస్‌ఈ మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు అరశాతం క్షీణించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.595 కోట్ల షేర్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.729 కోట్ల షేర్లను విక్రయించారు.
ఆరంభలాభాలు ఆవిరి..: ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న దేశీయ మార్కెట్ ఉదయం లాభంతో మొదలైంది. సెన్సెక్స్ 281 పాయింట్ల లాభంతో తొలిసారి 56000 స్థాయిపైన 56,073 వద్ద, నిఫ్టీ 77 పాయింట్లు పెరిగి 16,692 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. తొలి గంటలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో సెన్సెక్స్ 326 పాయింట్లు ర్యాలీ చేసి 56,118 వద్ద, నిఫ్టీ 87 పాయింట్లు ఎగసి 16,702 వద్ద సరికొత్త జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. సూచీలు ఆల్‌టైం హై స్థాయిలను అందుకున్న తర్వాత లాభాల స్వీకరణ చోటుచేసుకుంది. యూరప్ మార్కెట్ల నష్టాలతో ప్రారంభం కావడం, యూఎస్ ఫ్యూచర్లు నష్టాలతో కదలాడటం ఇన్వెస్టర్లను నిరాశపరిచింది. దీంతో సూచీలు ఆరంభ లాభాల్ని కోల్పోయి నష్టాలతో ముగిశాయి.
సరికొత్త గరిష్టానికి ఇన్వెస్టర్ల సంపద...
స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసినప్పటికీ.., ఇన్వెస్టర్ల సంపద సరికొత్త గరిష్టానికి చేరింది. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం విలువ రూ.242 లక్షల కోట్లకు ఎగసింది. బీఎస్‌ఈ మార్కెట్ విలువ విషయంలో ఇది ఆల్ టైం హై కావడం విశేషం. చివరి ఐదు ట్రేడింగ్ సెషన్లలో రూ.5.33 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది.
నాలుగురోజుల్లో 1,000 పాయింట్లు
గతవారాంతన శుక్రవారం(ఆగస్ట్ 13న)సెన్సెక్స్ 55,000 స్థాయిని అందుకుంది. నాటి నుంచి సరిగ్గా నాలుగు ట్రేడింగ్ సెషన్లలో ఏకంగా 1000 పాయింట్ల లాభాల్ని మూటగట్టకుంది. ఈ ఏడాదిలో 1000 పాయింట్లను ఆర్జించేందుకు సెన్సెక్స్ తీసుకున్న అతితక్కువ సమయం ఇదే కావడం విశేషం.
ఇదే ఏడాది జనవరి 21న సెన్సెక్స్ 50వేల మార్కును అందుకుంది. ఈ ఏడునెలల్లో 6,000 పాయింట్లు ఆర్జించి 56వేల స్థాయిని తాకింది. ఇదే సమయంలో నిఫ్టీ 2,111 పాయింట్లను ఆర్జించింది.
మార్కెట్లో మరిన్ని సంగతులు
► గతంలో విధించిన ఆంక్షలను ఎత్తివేస్తూ కొత్త క్రెడిట్ కార్డులను జారీ చేసేందుకు ఆర్‌బీఐ అనుమతినిచ్చిందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్టాక్ ఎక్సే్చంజీలకు తెలిపింది. దీంతో ఈ షేరు ఇంట్రాడేలో మూడుశాతానికి పైగా లాభపడి రూ.1,565 స్థాయికి చేరింది. అయితే చివర్లో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో ఆరంభ లాభాలన్నీ ఆవిరయ్యి 0.21 శాతం నష్టంతో రూ.1,511 వద్ద ముగిసింది.
► ఈ వారం ప్రారంభంలో డిస్కౌంట్‌తో లిస్టైయిన విండ్లాస్ షేరు పతనం కొనసాగుతోంది. మూడు శాతం నష్టపోయి రూ.388 వద్ద ముగిసింది. ఇష్యూ ధర రూ.460తో పోలిస్తే మూడురోజుల్లో 16 శాతం నష్టపోయింది.
రికార్డుల ర్యాలీకి విరామం
Published Thu, Aug 19 2021 2:39 AM | Last Updated on Thu, Aug 19 2021 2:39 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment