ముంబై: స్టాక్ మార్కెట్ లాభాలు ఒకరోజుకే పరిమితమయ్యాయి. ఇంట్రాడేలో తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యే సూచీలు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. కోవిడ్ ఉధృతి, లాక్‌డౌన్ భయాలతో పాటు ఆర్థిక రికవరీపై ఆందోళనలు మరోసారి మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతీశాయి. అలాగే డాలర్ మారకంలో రూపాయి విలువ 75 స్థాయికి దిగివచ్చింది. అమెరికాలో సంపన్నులపై అధిక పన్నులు విధించడంతో అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాలు నెలకొన్నాయి.
ఈ పరిణామాలు కూడా ట్రేడింగ్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా ఇంట్రాడేలో 596 పాయింట్ల పరిధిలో కదలాడిన సెన్సెక్స్ చివరకు 202 పాయింట్ల నష్టంతో 47,878 వద్ద ముగిసింది. అలాగే 188 పాయింట్ల రేంజ్‌లో ట్రేడైన నిఫ్టీ 64 పాయింట్లను కోల్పోయి 14,341 వద్ద స్థిరపడింది. ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, రియల్టీ, మెటల్, ఫార్మా, ప్రైవేట్ రంగాల షేర్లలో అమ్మకాలు తలెత్తాయి. ప్రభుత్వరంగ బ్యాంక్, మీడియా, ఆర్థిక రంగాల షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. ఒడిదుడుకుల ట్రేడింగ్‌లోనూ మధ్య, చిన్న తరహా కంపెనీల షేర్లు రాణించాయి. దీంతో బీఎస్‌ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు అరశాతం లాభంతో ముగి శాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ. 1,361 కోట్ల విలువైన షేర్లను అమ్మారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1,696 కోట్ల విలువైన షేర్లను కొన్నారు.
ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి ఆరు పైసలు బలహీనపడి 75.01 వద్ద స్థిరపడింది. నాలుగు రోజులే ట్రేడింగ్ జరిగిన ఈ వారంలో సెన్సెక్స్ 953 పాయింట్లు, నిఫ్టీ 276 పాయింట్లు నష్టపోయాయి. సూచీలకిది వరుసగా మూడోవారమూ నష్టాల ముగింపు. ‘‘కరోనా వ్యాధి విజృంభిస్తున్న వేళ దేశీయ ఈక్విటీ మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను పెద్ద ఎత్తున వెనక్కి తీసుకుంటున్నారు. స్థానిక లాక్‌డౌన్‌లతో ఆర్థి్థక కార్యకలాపాలు స్తంభించి కంపెనీల ఆదా యాలు క్షీణింవచ్చనే భయాలు ఇప్పటికీ ఇన్వెస్టర్లను వెంటాడుతున్నాయి. అయితే వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు కేంద్రం తీసుకుంటున్న చొరవతో స్వల్పకాలంలో అమ్మకాలు తగ్గే అవకాశం ఉంది’’ అని కోటక్ సెక్యూరిటీస్ ఫండమెంటల్ రీసెర్చ్ హెడ్ రస్మిక్ ఓజా అభిప్రాయపడ్డారు.
► ఇటీవల ఐపీఓకు పూర్తి చేసుకున్న నజరా టెక్ కంపెనీ మార్చి క్వార్టర్ ఫలితాలు మార్కెట్ వర్గాలను మెప్పించాయి. ఫలితంగా షేరు ఐదు శాతం లాభపడి రూ.1,692 వద్ద నిలిచింది.
► కోవిడ్ ఔషధ తయారీకి డీసీజీఐ నుంచి అనుమతి తో క్యాడిల్లా హెల్త్‌కేర్ 4% ర్యాలీ చేసి రూ.576 వద్ద స్థిరపడింది.
Comments
Please login to add a commentAdd a comment