ట్రేడింగ్ చివరి గంటలో బ్యాంక్, ఆర్థిక, వినియోగ రంగ షేర్లలో అమ్మకాల కారణంగా శుక్రవారం స్టాక్‌మార్కెట్ నష్టపోయింది. అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగానే ఉండటం ప్రతికూల ప్రభావం చూపించింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 21 పైసలు పుంజుకొని 73.45కు చేరినా, స్టాక్ మార్కెట్‌కు నష్టాలు తప్పలేదు. సెన్సెక్స్ 134 పాయింట్లు పతనమై 38,846 పాయింట్ల వద్ద, నిఫ్టీ 11 పాయింట్లు నష్టంతో 11,505 పాయింట్ల వద్ద ముగిశాయి. వరుసగా రెండో రోజూ స్టాక్ సూచీలు నష్టపోయాయి. ఫార్మా షేర్ల జోరు మాత్రం కొనసాగుతోంది. పలు ఫార్మా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు ఎగిశాయి. ఈ వారంలో సెన్సెక్స్ 9 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 41 పాయింట్లు లాభపడింది.
564 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్...
ఆసియా మార్కెట్ల జోరుతో మన మార్కెట్ కూడా మంచి లాభాల్లోనే ఆరంభమైంది. రోజు గడుస్తున్న కొద్దీ ఈ లాభాలు కరిగిపోయాయి. చివరి గంటలో బ్యాంక్, ఆర్థిక రంగషేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఒక దశలో 220 పాయింట్లు ఎగసిన సెన్సెక్స్, మరో దశలో 344 పాయింట్ల మేర పతనమైంది. మొత్తం మీద రోజంతా 564 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఫార్మా షేర్లు పుంజుకోవడంతో నష్టాలు తగ్గాయి.
ఆసియా మార్కెట్లు లాభాల్లో, యూరప్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.
► హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 2.3 శాతం నష్టంతో రూ. 1,057 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే.
► దాదాపు 160కి పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు చేరాయి. అలెంబిక్, అపోలో హాస్పిటల్స్, బయోకాన్, సిప్లా, దివీస్ ల్యాబ్స్, గ్రాన్యూల్స్ ఇండియా, లుపిన్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.
► 285 షేర్లు అప్పర్ సర్క్యూట్లను తాకాయి. రామ్‌కో సిస్టమ్స్, విసా స్టీల్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.
ఆల్‌టైమ్ హైకి డాక్టర్ రెడ్డీస్
డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ షేరు దుమ్ము రేపుతోంది. క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే రెవ్లిమిడ్ ఔషధానికి సంబంధించిన న్యాయ వివాదాన్ని పరిష్కరించుకున్నామని కంపెనీ వెల్లడించింది. దీంతో ఈ కంపెనీ షేరు ఇంట్రాడేలో 14 శాతం లాభంతో ఆల్‌టైమ్ హై, రూ.5,497ను తాకింది. చివరకు 10 శాతం లాభంతో రూ.5,327 వద్ద ముగిసింది. కరోనా వైరస్ వ్యాక్సిన్, స్పుత్నిక్–వి టీకాను భారత్‌లో పంపిణీ చేయడానికి ఒప్పందం కుదుర్చుకోవడంతో ఈ షేర్ ఈ వారం జోరుగా పెరిగింది. గత నాలుగు రోజుల్లో ఈ షేర్ 20 శాతానికి మించి లాభపడింది.
చివరి గంటలో అమ్మకాలు
Published Sat, Sep 19 2020 5:55 AM | Last Updated on Sat, Sep 19 2020 5:55 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment