ముంబై: స్టాక్ సూచీలకు నాలుగు రోజుల తర్వాత గురువారం లాభాలొచ్చాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ పాలసీ కమిటీ నిర్ణయాలు ఇన్వెస్టర్లను మెప్పించాయి. ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి రికవరీ కలిసొచ్చింది. ఐటీ షేర్లతో పాటు అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు రాణించాయి.
ఈ పరిణామాలతో సెన్సెక్స్ 113 పాయింట్లు పెరిగి 57,901 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 27 పాయింట్లు ఎగిసి 17,248 వద్ద నిలిచింది. ఫలితంగా సూచీల నాలుగురోజుల వరుస నష్టాలకు విరామం పడినట్లైంది. ఐటీ, ఇంధన, కన్జూమర్ షేర్లకు కొనుగోళ్లకు మద్దతు లభించింది. మిగతా అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బ్యాంకింగ్, ఆర్థిక షేర్ల ఎక్కువగా నష్టపోయాయి. యూఎస్ ఫెడ్ చైర్మన్ పావెల్ పాలసీ కమిటీ నిర్ణయాలను బుధవారం రాత్రి ప్రకటించారు.
ద్రవ్యోల్బణ కట్టడికి బాండ్ల కొనుగోళ్లను మరింత వేగవంతం చేస్తామన్నారు. అలాగే వచ్చే ఏడాది(2022)లో మూడుసార్లు., తర్వాత రెండేళ్లూ రెండుసార్లు చొప్పున వడ్డీ రేట్ల పెంపు ఉంటుందన్నారు. ఫెడ్ పరపతి నిర్ణయాలు అంచనాలకు తగ్గట్లు ఉండటంతో ప్రపంచ మార్కెట్లలో సానుకూలతలు నెలకొన్నాయి. అమెరికా మార్కెట్లు బుధవారం రాత్రి రెండున్నర లాభపడ్డాయి. ఆసియాలో ఒక్క ఇండోనేషియా గురువారం మినహా అన్ని దేశాలకు స్టాక్ సూచీలు లాభాలతో ముగిశాయి. యూరప్ మార్కెట్లు రెండు నుంచి ఒకటిన్నర శాతం దూసుకెళ్లాయి.
ఒడిదుడుకుల ట్రేడింగ్...
ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలను అందుకున్న సూచీలు ఉదయం భారీ లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 455 పాయింట్ల లాభంతో 58,243 వద్ద, నిఫ్టీ 152 పాయింట్లు పెరిగి 17,373 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. తొలి అరగంట కొనుగోళ్ల మద్దతు లభించడంతో మరింత ముందుకు కదిలాయి. అయితే విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు, ద్రవ్యోల్బణ ఆందోళనలు, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి భయాలు తదితర ప్రతికూలతలతో సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి.
ట్రేడింగ్‌లో తీవ్ర ఒడుదుడుకులకు లోనయ్యాయి. ఒకదశలో సెన్సెక్స్ ఇంట్రాడే గరిష్టం(58,337) నుంచి 654 పాయింట్లను కోల్పోయి 57,683 వద్ద, నిఫ్టీ డే హై(17,379) నుంచి 194 పాయింట్లు పతనమై 17,185 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. చివరి గంటలో మరోసారి కొనుగోళ్ల మద్దతుల అభించడంతో సూచీలు స్వల్ప లాభాలతో గట్టెక్కాయి.
మార్కెట్లో మరిన్ని సంగతులు...
► మలేషియాలో సింగ్‌టెల్ డెలివరీ సెంటర్‌ను చేజిక్కించుకోవడంతో ఇన్ఫోసిస్ షేరు బీఎస్‌ఈలో రెండున్నర శాతం లాభపడి రూ.1,777 వద్ద స్థిరపడింది.
► రైల్వే సంస్థ నుంచి ఆర్డర్లను దక్కించుకోవడంతో సుబ్రాస్ షేరు నాలుగున్నర శాతం పెరిగి రూ.392 వద్ద ముగిసింది.
► ఇండియాబుల్ హౌసింగ్ ఫైనాన్స్ షేరు నాలుగు శాతం నష్టపోయి రూ.254 వద్ద స్థిరపడింది. సమీర్ గెహ్‌లాట్ పారీస్ సంస్థ తన వాటాను పదిశాతానికి తగ్గించుకోవడం షేరు పతనానికి కారణమైంది.
Comments
Please login to add a commentAdd a comment