న్యూఢిల్లీ: కన్జ్యూమర్ డ్యూరబుల్స్‌లో ప్రముఖ కంపెనీ వర్ల్‌పూల్ ఇండియా సెప్టెంబర్ త్రైమాసికంలో పనితీరు పరంగా ఇన్వెస్టర్లను నిరుత్సాహానికి గురి చేసింది. నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఏకంగా 88 శాతం పడిపోయి రూ.49 కోట్లకు పరిమితమైంది. ఒకవైపు కమోడిటీ ధరల పెరుగుదల ప్రభావం ఉండగా, మరోవైపు క్రితం ఏడాది ఇదే క్వార్టర్‌లో ఏకీకృత లాభం చూపించడం ఈ వ్యత్యాసానికి కారణమని కంపెనీ ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.413 కోట్లుగా ఉంది.
కార్యకలాపాల ఆదాయం రూ.1,611 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.1,607 కోట్లతో పోలిస్తే వృద్ధి నమోదు కాలేదు. కంపెనీ వ్యయాలు 3 శాతం పెరిగి రూ.1,567 కోట్లకు చేరాయి. ‘‘నికర లాభం తగ్గడానికి ప్రధానంగా కమోడిటీల (తయారీలో వినియోగించే) ధరలు పెరగడం, ద్రవ్యోల్బణం కారణం. అయితే తయారీ పరంగా కొన్ని చర్యలు తీసుకోవడం, ధరలు పెంచడంతో ఈ ప్రభావాన్ని కొంత వరకు అధిగమించాం. ఎలికా ఇండియా కొనుగోలు అనంతరం కంపెనీ సబ్సిడరీగా మారింది. భారత అకౌంటింగ్ ప్రమాణాల మేరకు ఎలికా ఇండియాలో మా వాటాల పారదర్శక విలువ ఆధారంగా, రూ.324 కోట్ల లాభాన్ని గతేడాది సెప్టెంబర్ క్వార్టర్ కన్సాలిడేటెడ్ ఫలితాల్లో గుర్తించాం. ఇది మినహాయించి చూస్తే నికర లాభంలో క్షీణత 45 శాతమే ఉంటుంది’’ అని కంపెనీ తెలిపింది. 88 శాతం పడిపోయిన నికర లాభం
Comments
Please login to add a commentAdd a comment